ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి సుస్థిర అభివృద్ధిని సాధిస్తున్న తెలంగాణ
నీతి అయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్‌కుమార్ ట్వీట్, కృతజ్ఞతలు చెబుతూ మంత్రి కెటిఆర్ ప్రతి ట్వీట్
కొత్త రాష్ట్రమైనప్పటికీ పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నది
మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితులతో 9% వృద్ధి రేటును సాధిస్తోంది
వృద్ధి రేటు పెరిగిన చోటనే అభివృద్ధి : రాజీవ్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంపై నీతి ఆయోగ్ మరోసారి ప్రశంసల జల్లు కురిపించింది. అనతి కాలంలోనే తెలంగాణ అద్భుతమైన ప్రగతి పథంలో కొనసాగుతోందని కితాబిచ్చింది. దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నిలుస్తోందని వ్యాఖ్యానించింది. ప్రధానంగా ప్రత్యేక తెలంగాణగా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రం సుస్థిరాభివృద్ధిని కొనసాగిస్తోందని నీతి ఆయోగ్ ఉపాఘ్యక్షుడు రాజీవ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కేవలం ఏడేళ్లలోనే తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కానుందన్నారు.
పైగా తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం పలు విప్లవాత్మకమైన నిర్ణయాలను తీసుకుందని మెచ్చుకున్నారు. కొత్త రాష్ట్రమే అయినప్పటికీ ప్రధానంగా మెరుగైన పారిశ్రామిక విధానాలు, భౌగోళిక పరిస్థితులతో తొమ్మిది శాతానికిపైగా వృద్ధిరేటు సాధిస్తోందని తెలిపారు. ఇది తెలంగాణ రాష్ట్ర సుస్థిరాభివృద్ధిని సూచిస్తోందని ఆయన ప్రశంసించారు. ఏ రాష్ట్రం అయితే తన వృద్ధిరేటును గణనీయంగా పెంచుకోగలుగుతుందో… ఆ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని పేర్కొనేందుకు చక్కటి నిదర్శమని రాజీవ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇందులో తెలంగాణ అగ్రస్థానం దిశగా పరుగులు తీస్తుండడం హర్షించదగ్గ పరిణామం అని ఆయన పేర్కొన్నారు.
రాజీవ్‌కుమార్‌కు కెటిఆర్ కృతజ్ఞతలు
రాష్ట్ర సుస్థిరాభివృద్ధిని గుర్తించి కితాబిచ్చిన నీతిఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్‌కు రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ 9 శాతానికి పైగా వృద్ధిరేటు సాధించడం పట్ల ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కెటిఆర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించి రాజీవ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.