Tuesday, January 21, 2025

నీతి ఆయోగ్ నిరర్థకత

- Advertisement -
- Advertisement -

గత శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా భారత దేశాన్ని మంచి మార్పు దిశగా నడిపించే జాతీయ సంస్థ) ఎనిమిదవ పాలక మండలి సమావేశాన్ని 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరించడం ఆ సంస్థ ప్రయోజకత్వంపై దట్టమైన చీకట్లను పరిచింది. 2047 నాటికి భారత దేశ పరిపూర్ణ అభివృద్ధిని సాధించడం ప్రధానాంశంగా ఏర్పాటైన ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి టీం ఇండియాగా పని చేయాలని ఆ విధంగా 2047 నాటికి వికసిత భారతాన్ని సాధించాలని ఉద్బోధించారు.

ప్రధాని మోడీ నోట వినవచ్చే టీం ఇండియా నినాదం ఎంత బూటకమైనదో, మరెంత కుత్సితమైనదో ఆచరణలో లెక్కలేనన్ని సార్లు రుజువైంది. బిజెపియేతర రాజకీయ పక్షాల పాలనలోని రాష్ట్రాలను ఆయన ప్రభుత్వం ఎంతగా నిర్లక్షం చేస్తున్నదో, వాటి అభివృద్ధిని ఎన్ని రకాలుగా అడ్డుకుంటున్నదో, వీలైనప్పుడల్లా ఆ ప్రభుత్వాలను కూల్చడానికి ఎన్ని కుట్రలు పన్నుతున్నదో ప్రత్యేకించి వివరించనక్కర లేదు. అటువంటి విద్రోహ చరిత్ర కలిగిన ప్రభుత్వ ప్రధాని టీం ఇండియా అనే మాటను ఎలా ఉచ్ఛరించగలుగుతున్నారో ఊహించడం సాధ్యం కాదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గత ఏడాది జరిగిన నీతి ఆయోగ్ ఏడవ సమావేశాన్ని కూడా బహిష్కరించారు. ఆ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ వైఖరిని చెరిగి వదిలిపెట్టారు. నీతి ఆయోగ్ ఒక పనికిరాని, ప్రభావరహితమైన సంస్థ అని అన్నారు.

నీతి ఆయోగ్ చేసే సిఫారసులను మోడీ ప్రభుత్వం బుట్టదాఖలా చేస్తున్నదని, అలాగే రాష్ట్రాల రుణ యత్నాలకు విఘాతం కలిగిస్తున్నదని, కార్పొరేట్ శక్తుల రుణాలను మాఫీ చేస్తున్నదని ఆయన అన్నారు. దేశాభివృద్ధిలో రాష్ట్రాలను సమాన భాగస్వాములుగా పరిగణించకపోడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలకు రూ. 24 వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని నీతి ఆయోగ్ 2016లో సిఫారసు చేయగా, ఇప్పటి వరకు రూ. 24 పైసలు కూడా ఇవ్వలేదని ఆయన చీల్చి చెండాడారు. నీతి పుట్టుకే ఒక అస్తవ్యస్త పరిణామం. అంతకు ముందు ఎంతో పకడ్బందీగా వుంటూ వచ్చిన ప్రణాళిక సంఘం శిరస్సును ప్రధాని మోడీ తొలిసారి అధికారంలోకి రావడంతోనే ఖండించారు.

పంచవర్ష ప్రణాళికల ద్వారా ఒక పద్ధతి ప్రకారం దేశ సర్వతోముఖ వికాసాన్ని సాధించడం కోసం స్వాతంత్య్రానంతరం 1950 మార్చిలో ఏర్పాటైన ప్రణాళిక సంఘం అణగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి వీలైనంత వరకు పాటుపడింది. నిజమైన సహకార సమాఖ్య విధానాన్ని అమలు పరిచింది. దాని తల తరిగి వచ్చిన నీతి ఆయోగ్ అందుకు పూర్తి విరుద్ధంగా నిరూపించుకొంటున్నది. కేంద్రం దాని పెడరెక్కలు విరిచికట్టి తన సొంత దుర్విధానాలను అమలు పరుస్తున్నది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల అభివృద్ధికి అవసరమైన నిధులను సమకూర్చకుండా, అవి సమకూర్చుకొంటూ వుంటే దానిని అడ్డుకొంటూ కేంద్ర పాలకులు దేశ వికాసానికి పట్టిన చెద పురుగుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీ తొలిసారి అధికారం చేపట్టిన 2014లో దేశం అప్పు రూ. 65 లక్షల కోట్లు కాగా, గత మార్చి నాటికి అది రూ. 155.8 లక్షల కోట్లకు చేరుకొన్నది. ఇంతగా అప్పులు చేస్తున్న ప్రధాని వేరొకరు లేరు.

అయితే ఆయన రాష్ట్రాలకు మాత్రం వ్యయ కర్తనం (పొదుపు) గురించి తరచూ నీతులు చెబుతుంటారు. తాజా నీతి ఆయోగ్ సమావేశంలో కూడా ప్రధాని మోడీ ఇదే ఉద్బోధ చేశారు. కోడలికి బుద్ధి చెప్పే అత్త వైఖరికి ఇంత కంటే నిదర్శనం అవసరమా? ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాను నీతి ఆయోగ్‌ను బహిష్కరించడంపై వివరిస్తూ కేంద్రం రాజ్యాంగ నియమాలను, ప్రజాస్వామిక సూత్రాలను అగౌరవ పరుస్తున్న నేపథ్యంలో, సహకార సమాఖ్య అనే ఆలోచనను అవహేళన పరుస్తున్న పరిస్థితుల్లో ఈ సమావేశాలకు హాజరు కావడం అర్థం లేని పని అని స్పష్టం చేశారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల గవర్నర్లు తమ రాజ్యాంగ విహిత విధి విధానాలను పక్కన పెట్టి కేంద్ర పాలకుల చెప్పుచేతల్లోని ఏజెంట్లుగా పని చేయడం అలవాటు చేసుకొన్నారు.

గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా వుండిన ప్రస్తుత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఈ విషయంలో అందెవేసిన చేయిగా రుజువు పరుచుకొన్నారు. కేరళ, తమిళనాడు, తెలంగాణ గవర్నర్లు ఆయన అడుగు జాడల్లో నడుస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్గాలు జనహిత పాలన కోసం ఆమోదించి పంపిన బిల్లులను నెలల తరబడి తమ వద్ద వుంచుకొని చెప్పనలవికాని ఇబ్బందులు పెడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో టీం ఇండియా ఏ విధంగా రుజువు కాగలదో ప్రధాని మోడీయే చెప్పాలి. పెడరెక్కలు విరిచి కట్టి పక్షిని ఎగరమంటే కుదురుతుందా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News