Sunday, December 22, 2024

మోడీ అధ్యక్షతన నేడు నీతి ఆయోగ్ సమావేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం(జులై 27) నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన వికసిత్ భారత్@2047 పత్రాన్ని ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. నీతి ఆయోగ్‌లో అత్యున్నత భాగమైన గవర్నింగ్ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు ఉన్నారు. నీతి ఆయోగ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుందని, అప్పటికి భారత్ ఆర్థికాభివృద్ధి 30 ట్రిలియన్ డాలర్లకు చేరుకునేందుకు విజన్ డాక్యుమెంట్‌ను ప్రభుత్వం రూపొందించిందని ఆ అధికారి తెలిపారు. 10 రంగాలలో అభివృద్ధి కోసం ఒక ఉమ్మడి విజన్‌ను వికసిత్ భారత్@2047 పేరిట రూపొందించే బాధ్యతను నీతి ఆయోగ్‌కు ప్రభుత్వం 2023లో అప్పగించిందని ఆయన తెలిపారు. ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతి, పర్యావరణ సుస్థిరత, సుపరిపాలన తదితర అంశాలను ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా..కేంద్ర బెడ్జట్‌లో తమ రాష్ట్రాల పట్ల వివక్ష చూపారని రాఓపిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

అదే విధంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్(డిఎంకె), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(సిపిఎం), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(ఆప్), ఢిల్లీ ప్రభుత్వం కూడా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాగా..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం నాటి సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల బహిష్కరణ నిర్ణయాన్ని బిజూ జనతా దళ్ ఎంపి సస్మిత్ పాత్రా సమర్థించారు. బడ్జెట్‌లో రాష్ట్రాలకు న్యాయంగా రావలసిన వాటాను కేంద్రం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. కాగా..తమ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లాలా వద్దా అన్న విషయాన్ని నిర్ణయిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చ ఎంపి మహువా మాఝీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News