Sunday, December 22, 2024

చెల్లని కాసు నీతి ఆయోగ్

- Advertisement -
- Advertisement -

అమలుకాని నీతి ఆయోగ్ సిఫారసులు
చెల్లని రూపాయి నీతి ఆయోగ్!
సిఫారసులన్నీ బుట్టదాఖలు చేసిన కేంద్రం!
ఈనెల 27న నీతి ఆయోగ్ కౌన్సిల్ భేటి
ప్రధాని అధ్యక్షతన అన్ని రాష్ట్రాల సిఎంలు హాజరు
నీతి ఆయోగ్‌తో తెలంగాణకు జరగని మేలు
విశ్వసనీయత కోల్పోయిన నీతి ఆయోగ్
హాజరవ్వాలా..?, బహిష్కరించాలా..?
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన ఈనెల 27వ తేదీన న్యూఢిల్లీలో జరుగనున్న నీతి ఆయోగ్ జనరల్ కౌన్సిల్ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం హాజరవుతుందా..? లేదా..? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ రాష్ట్రానికి నీతి ఆయోగ్ నుంచి ఎలాంటి ప్రయోజనం జరుగకపోవడం, చివరకు నీతి ఆయోగ్ సిఫారసులను కూడా అమలు చేయించుకోలేని డమ్మీ సంస్థగా నిలిచిపోయిందనే విమర్శలు తీవ్రస్థాయిలో ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ప్రభుత్వ పెద్దలు హాజరవుతారా? లేక బహిష్కరిస్తారా? అనే అంశంపై అధికారవర్గాల్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సంస్థను అదే కేంద్ర సర్కార్ నీరుగార్చిందని, ఆ సంస్థకుగానీ, ఆ సంస్థ సిఫారసులకు గానీ ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రతి సిఫారసునూ బుట్టదాఖలు చేయడంతోనే ఆ సంస్థకు విలువ, గౌరవం లేకుండా పోయాయని కొందరు సీనియర్ అధికారులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన నీతి ఆయోగ్ బృందాలు ఇక్కడ అమలవుతున్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి జరుగుతున్న పథకాలను తిలకించి ముచ్చటపడిపోయి రాష్ట్రానికి ఆర్ధికంగా సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసులు చేసింది.

కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు రాజకీయ పరమైన దురుద్దేశ్యాలతో నీతి ఆయోగ్ సిఫారసులను అమలు చేయకుండా బుట్టదాఖలు చేయడంతో వేల కోట్ల రూపాయలను నష్టపోవాల్సి వచ్చిందని, తమకు నీతి ఆయోగ్ సిఫారసులు చేసిన నిధులను ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆర్ధిక శాఖామంత్రి టి.హరీష్‌రావులు అనేక పర్యాయాలు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి విన్నవించారు. లేఖలు రాశారు. స్వయంగా న్యూఢిల్లీకి వెళ్ళి కలిసి విజ్ఞప్తులు చేశారు. వినతిపత్రాలను అందజేశారు. కానీ కేంద్రం ససేమిరా అంటూ ఒక్క రూపాయిని కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఇంత జరుగుతున్నా నీతి ఆయోగ్ మాత్రం కనీసం కల్పించుకోలేదని, తెలంగాణలోని అభివృద్ధి-సంక్షేమ పథకాలకు ఆర్ధిక సహాయం చేయాలని తాము చేసిన సిఫారసులను అమలు చేస్తూ తెలంగాణకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ పెద్దలు కూడా కేంద్రానికి ఒక్కమాట కూడా చెప్పలేదని ఆ అధికారులు తీవ్రస్థాయిలో అసంతృప్తులను వ్యక్తంచేస్తున్నారు.

తమ సిఫారసులకే విలువలేనప్పుడు, సొంత సంస్థ నీతి ఆయోగ్‌ను కేంద్రమే అగౌరపరుస్తున్నప్పుడు ఈనెల 27వ తేదీన నీతి ఆయోగ్ చైర్మన్ అయిన ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి వెళ్ళినా అదనంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదని ఆ అధికారులు అంటున్నారు. మొక్కుబడిగా, ఒక తంతుగా జరిగే నీతి ఆయోగ్ 18వ జనరల్ కౌన్సిల్ సమావేశం కేవలం ఒక లెక్కకు మాత్రమే పరిమితమని, ఈ సమావేశంలో ఎలాంటి ప్రజాప్రయోజనాలు ఉండవని బల్లగుద్ది వాదిస్తున్నారు. అంతేగాక నీతి ఆయోగ్ ప్రస్తుత వైస్ చైర్మన్ సుమన్ బేరీ కేంద్ర కేబినేట్ సెక్రటరీ డాక్టర్ రాజీవ్ గౌబతో కలిసి అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను గుర్తు చేశారని, అయనా ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రానికి ఒక్క రూపాయిని కూడా కేంద్రం నిధులను విడుదల చేయలేదని వివరించారు.

ఇలాంటి చెల్లని నాణెంగా మారిన నీతి ఆయోగ్ సమావేశాలకు వెళితే ప్రయాణ చార్జీలు దండగేనని, కేంద్ర ప్రభుత్వ పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఆర్ధిక సహాయం చేయరని ఆ అధికారులంటున్నారు. కాకుంటే కర్ణాటక రాష్ట్రంలో బిజెపి ఘోరంగా పరాజయం చెందిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం గనుక దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఏదైనా ఒక నిర్ధిష్టమైన సందేశం ఇవ్వాలని కేంద్ర సర్కార్ భావిస్తుందా..? అంటే.. అదీలేదని తెలిపారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి 2018వ సంవత్సరంలోనే నీతి ఆయోగ్ సిఫారసుల ప్రకారం మన రాష్ట్రంలోని మిషన్ భగీరథ పథకానికి 19,205 కోట్ల రూపాయలను గ్రాంటుగా నిధులు రావాల్సి ఉందని తెలిపారు. అంతేగాక మిషన్ కాకతీయ పథకానికి మరో అయిదు వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కూడా అప్పట్లో నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని, కానీ ఇప్పటి వరకూ ఆ సిఫారసులు అమలుకు నోచుకోలేదని అధికారులు వివరించినట్లు తెలిసింది.

వాస్తవానికి కేంద్ర ప్రభుత్వంలో నీతి ఆయోగ్ సంస్థ కేవలం తాను చేసిన సిఫారసులను అమలు చేయించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వశాఖ నుంచి దేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళాల్సిన నిధులన్నింటినీ విడుదల చేయించేందుకు పెద్దన్నగా వ్యవహరించాల్సి ఉందని, ఆ పనిచేయడంలో కూడా నీతి ఆయోగ్ విఫలమయ్యిందని ఆవేదన వ్యక్తంచేశారు. లేకుంటే నీతి ఆయోగ్ సిఫారసు చేసిన నిధులే కాకుండా తెలంగాణ రాష్ట్రానికి 14వ ఆర్ధిక సంఘం, 15వ ఆర్ధిక సంఘం సిఫారసు చేసిన నిధులు కూడా నాలుగేళ్ళ క్రితమే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సి ఉందని వివరించారు. నీతి ఆయోగ్ సిఫారసులతో పాటుగా ఆర్ధిక సంఘాలు సిఫారసులు చేసిన నిధులు, రాష్ట్ర విభజన చట్టం అమలు చేసే సమయంలో కేంద్రం చేసిన పొరపాట్ల మూలంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయాలను సరిదిద్దే పనిని కూడా చేయలేదని, ఆ విషయంలో కూడా నీతి ఆయోగ్ సంస్థ స్పందించలేదని, పెద్దన్న పాత్రను పోషించడంలో నీతి ఆయోగ్ ఘోరంగా విఫలమయ్యిందని ధ్వజమెత్తారు. లేకుంటే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ, నీతి ఆయోగ్‌లు నిజాయితీగా వ్యవహరించి తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా ఇవ్వాల్సిన 35,099 కోట్ల రూపాయల నిధులు ఏనాడో విడుదల అయ్యేవని వివరించారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రానికి ప్రోత్సాహమివ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇలా అడుగడుగునా అడ్డుతగులుతుంటే నీతి ఆయోగ్ ప్రేక్షక పాత్రనే పోషిస్తోందని విమర్శిస్తున్నారు. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర జి.ఎస్.డి.పి 5.5 లక్షల కోట్ల రూపాయలుంటే 202౩ మార్చి నాటికి రికార్ఢుస్థాయిలో 13.25 లక్షల కోట్ల రూపాయలకు పెరిగిందని, అందుకు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి-సంక్షేమ పథకాలే కారణమని నీతి ఆయోగ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికీ చాలా స్పష్టంగా తెలుసునని, కానీ నిధులను విడుదల చేయడానికి మాత్రం ఎవ్వరికీ మనసొప్పడంలేదని ధ్వజమెత్తారు. వాస్తవానికి 14వ ఫైనాన్స్ కమీషన్ సిఫారసుల ప్రకారం తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 315 కోట్ల 32 లక్షల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 502 కోట్ల 61 లక్షల రూపాయలు కలిపి స్థానిక సంస్థలకు 817 కోట్ల 61 లక్షల రూపాయల నిధులను గ్రాంట్ రూపంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంవత్సరానికి 450 కోట్ల రూపాయల లెక్కన గడచిన అయిదేళ్ళకు కలిపి 2,250 కోట్ల రూపాయల నిధులను కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ ఇవ్వాల్సి ఉందని వివరించారు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు పన్నుల వాటాలో తెలంగాణకు ఇవ్వాల్సిన 723 కోట్ల రూపాయలను ఇప్పటి వరకూ ఇవ్వలేదని తెలిపారు. 15వ ఆర్ధిక సంఘం సిఫారసుల ప్రకారం న్యూట్రిషన్ రంగంలో తెలంగాణకు మరో 171 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాల్సి ఉంది. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు 15వ ఆర్ధిక సంఘం 3,024 కోట్ల రూపాయల నిధులను గ్రాంటుగా తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాలని 2017లోనే సిఫారసు చేసిందని, ఇప్పటి వరకూ ఆ నిధులను కూడా ఇవ్వలేరని తెలిపారు. మిషన్ భగీరథ పథకానికి 15వ ఆర్ధిక సంఘం తెలంగాణ రాష్ట్రానికి మరో 2,350 కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేసింది.

ఈ నిధులను కూడా ఇవ్వలేదని తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 495 కోట్ల 20 లక్షల రూపాయల నిధులను కేంద్రం చేసిన పొరపాటుతో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళాయని, ఆ నిధులను కూడా కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సి ఉంది. 2021-22వ ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణలోని గ్రామీణ స్థానిక సంస్థలకు 682 కోట్ల 50 లక్షల రూపాయలు, పట్టణ స్థానిక సంస్థలకు 331 కోట్ల 40 లక్షల రూపాయల నిధులను గ్రాంటుగా ఇవ్వాల్సి ఉంది. ఇలా మొత్తం కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి గ్రాంట్ల రూపంలో రావాల్సిన 35,099 కోట్ల 71 లక్షల రూపాయల నిధులను ఇవ్వాల్సి ఉందని, ఇప్పటి వరకూ ఒక్క రూపాయిని కూడా కేంద్రం ఇవ్వలేదని వివరించారు. ఇంతటి చేదు అనుభవాలను చవిచూసిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నీతి ఆయోగ్ సమావేశానికి వెళతారో? లేదో? వేచి చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News