Saturday, November 2, 2024

ఇదేం ‘రాజ’నీతి

- Advertisement -
- Advertisement -

రాష్ట్రాలకు పన్నుల వాటాలో 42 శాతం కాదు.. 29.6 శాతం ఇస్తున్నది
కేంద్ర ప్రయోజిత పథకాలకు 60 శాతానికి తగ్గించారు
కేంద్రం తీరు సహకార సమాఖ్య స్పూర్తి విరుద్ధం
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/ హైదరాబాద్ : నీతి ఆయోగ్ రంగును ముఖ్యమంత్రి కెసిఆర్ బయటపెడితే .. నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకొని విమర్శలు చేయడం సిగ్గుచేటని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి కెసిఆర్ శనివారం మీడియా సమావేశం నిర్వహిస్తూ నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు నీతి ఆయోగ్‌పై పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. సిఎం కెసిఆర్ వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ నోట్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలో ఆదివారం ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో మంత్రులు మహమూద్ అలీ, గంగుల కమలాకర్‌తో కలిసి మీడియాతో హరీశ్‌రావు మాట్లాడారు. నీతి ఆయోగ్‌పై ఘాటుగానే స్పందించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సూటిగా మాట్లాడితే అర్థ సత్యలతో కూడిన ప్రకటన నీతి ఆయోగ్ విడుదల చేసిందన్నారు.

సిఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్నారు. రు. 3922 కోట్లు జల్ జీవన్ కింద కేటాయిస్తే రూ. 200 కోట్లు మాత్రమే తెలంగాణ వాడుకున్నది అని సత్యదూర ప్రకటన చేసిందని. అది శుద్ధ తప్పు. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశానికి రాష్ట్రం నుంచి వెళ్లి ఎన్నిసార్లు చెప్పినా అరణ్య రోదన అయింది.. పట్టించుకొనే వారే లేరు. అందుకే రాష్ట్రం సమావేశం బహిష్కరించిందన్నారు. దీంతో తీవ్రమైన ఒత్తిడితో నీతి ఆయోగ్ ప్రకటన వెంటనే ఇచ్చిందన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి చెప్పాల్సింది పోయి, కేంద్రం తప్పులను కప్పిపుచ్చే విధంగా నీతి ఆయోగ్ ప్రవర్తన ఉంది. ఇది సహకార సమాఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధమన్నారు.

జల్ జీవన్ మిషన్ కింద నిధులు ఇవ్వాలని లేఖలు రాశాం..

జల్ జీవన్ మిషన్ కింద మాకు నిధులు ఇవ్వాలని లేఖలు రాశాం. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్మిత సబర్వాల్, ఇఎన్‌సి కృపాకర్ , సిఎస్‌లు రాష్ట్రానికి నిధులు విడుదల చేయండి అని పలుమార్లు లేఖలు రాశారు. స్వయానా కేంద్రమంత్రి షేకావత్ పార్లమెంట్‌లో తెలంగాణలో ఇంటింటికి తాగునీరు చేరుకున్నది చెప్పారు.. కానీ నిధులు మాత్రం విడుదల చేయడం లేదన్నారు. నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు మిషన్ కాకతీయకు 5వేల కోట్లు ఇవ్వాలని అంటే కేంద్రం బుట్ట దాఖలు చేసిందన్నారు. ఇప్పుడు రు.1195 కోట్లు పీఎంకేఎస్‌వై ద్వారా ఇచ్చామని అంటున్నారు. అసలు దానికి మిషన్ కాకతీయకు ఏమైనా సంబంధం ఉందా.. అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 19వేల కోట్లు ఇవ్వాలని అడిగాం, కానీ స్పందన లేదు. నీతి ఆయోగ్ సిఫార్సులను సైతం కేంద్రం చెత్త బుట్టలో వేసింది. దానికి సమాధానం చెప్పకుండా ఊరికే రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. 3వేల కోట్లు ఇచ్చామని నీతి ఆయోగ్ చెప్తోంది. అందులో తెలంగాణ రెండు వందల కోట్లు మాత్రమే వాడుకుందని తప్పుడు ప్రకటన చేస్తోంది. ఇది ప్రజల్ని పక్కదోవ పట్టించటమే. కాగితాల మీద లెక్కలు చూపుతోంది కేంద్రం కానీ ఆచరణలో నిధులు ఇవ్వట్లేదని హరీష్‌రావు వెల్లడించారు.

పన్నులను 20 శాతానికి పెంచి.. రాష్ట్రాలకు నిధుల తగ్గించారు..

నీతిఆయోగ్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం చెత్తబుట్టలో వేసిందని, కేంద్రం పన్నులను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు నిధులు తగ్గించారని ఆరోపించారు. ఫైనాన్స్ కమిషన్ నిధులు రాష్ట్రాలకు 29.6 శాతమే ఇస్తోందని దుయ్యాబట్టారు. నీతిఆయోగ్ అంకెల గారడి చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. 2015 -16లో సిఎస్‌ఎస్ ద్వారా రూ.6వేల కోట్లు వచ్చాయని, 2016- 17 రూ.6,695 కోట్లు వచ్చాయని వివరించారు. బిజెపి ప్రభుత్వం ఏడేళ్లలో పన్నుల రూపంలో 15,47,560 కోట్లు సమకూర్చింది. ఈ ఏడాది 5,35,112 కోట్లు. మొత్తం 21లక్షల కోట్లు కాగా.. గతంలో 41 శాతం రాష్ట్రాల వాటా ఉండే ప్రకారం 8,60,000 కోట్లు హక్కుగా అన్ని రాష్ట్రాలకు రావాలి. రాకుండా పన్నుల రూపంలో అన్యాయం చేసిందన్నారు. 2.102 వాటా ప్రకారం తెలంగాణకు 42 వేల కోట్లు రాకుండా పోయాయి. దీని గురించి నీతి అయోగ్ మాట్లాడదు. 32 నుండి 42 శాతానికి రాష్ట్రాలకు నిధులు పెంచామని నీతి ఆయోగ్ పేర్కొంటొందని… కాని రాష్ట్రాలకు పన్నుల వాటాలో 42 శాతం కాదు.. 29.6 శాతం వస్తున్నది. పన్నుల్లో వాటా పెంచామని చెప్పారు అది పూర్తి అబద్దం. ఒకప్పుడు 10 శాతం ఉన్న పన్నులు.. ఇప్పుడు 20 శాతానికి పెరిగాయి. చెప్పేది సహకార సమాఖ్య స్పూర్తి.. చేసేది రాష్ట్రాలను నష్ట పరిచేలా ఉందని హరీశ్‌రావు మండిపడ్డారు.

కేంద్ర ప్రయోజిత పథకాలకు వాటా తగ్గాయి..

బిఆర్‌జిఎఫ్, మోడల్ స్కూల్స్‌కు కేంద్రం తన వాటాను రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడింది. గతంలో కొన్ని పథకాలకు వంద శాతం నుంచి70 శాతం కేంద్రం నిధులు ఇచ్చేది. ఇప్పుడు కేంద్రం వాటాను అన్నింటికి 60 శాతానికి తగ్గించి, రాష్ట్రాల మీద భారం వేసింది. పిఎం కిసాన్ యోజన, సడక్ యోజన, ఐసిడిఎస్ తదితర అనేక పథకాల కేంద్ర వాటా 60 శాతానికి తగ్గించింది. ఈ తగ్గుదల వల్ల రాష్ట్రంపై 2018-.. 19లో 2785 కోట్లు ఆర్థిక భారం పడిందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సిఎఎస్‌ఎస్ కేటాయింపులు రెట్టింపు అయ్యిందని నీతి అయోగ్ చెప్పింది. అయితే రాష్ట్రానికి 2015-..16లో రూ. 6003 కోట్లు రాగా, 2021..-22లో కేవలం రూ. 5223 కోట్లు వచ్చాయి. తెలంగాణకు రావాల్సిన వాటా తగ్గింది కాని నీతి అయోగ్ చెప్పినట్లు పెరగలేదని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు.

2020-..21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు ప్రత్యేక గ్రాంట్ కింద రూ. 723 కోట్లు, న్యూట్రీషన్ సెక్టార్ రంగం కోసం రూ. 171 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచిస్తే, కేంద్ర ప్రభుత్వం పక్కకు పెట్టిందన్నారు. 2021..-26 మధ్య రాష్ట్రానికి సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్స్ రూ. 3024 కోట్లు ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సూచించింది. కేంద్రం ఈ ప్రతిపాదనను పక్కన పెట్టి అన్యాయం చేసిందన్నారు. మిషన్ భగీరథ నిర్వహణ కోసం రూ. 2350 కోట్లు సెక్టార్ స్పెసిఫిక్ గ్రాంట్‌గా ఇవ్వాలని సూచిస్తే, కేంద్రం పట్టించుకోలేదన్నారు.ఆర్థిక సంఘం సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి చెప్పాల్సింది పోయి, కేంద్రం తప్పులను కప్పిపుచ్చే విధంగా నీతి అయోగ్ ప్రవర్తన ఉంది. ఇది సహకార సమాఖ్య స్పూర్తికి పూర్తి విరుద్ధమన్నారు.

గత ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేశాయి..

నెహ్రు, ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, మన్మోహన్ ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేశాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకు..? అంటూ ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సిఫారసులను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని, దీనిపై నీతి ఆయోగ్ ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ ప్రకటన సత్యదూరమని.. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అడిగిన ఏ ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వలేదని విమర్శించారు.

లక్షాలను సాధించని నీతి ఆయోగ్..

స్ట్రాటజీ ఫర్ న్యూ ఇండియా @75 పేరుతో 2022 నాటికి నీతి ఆయోగ్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎన్ని సాధించారో చెప్పగలరా… అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమనడంలో ఫెయిల్
ఉత్పతి రంగంలో మహిళల 30 శాతం లక్షం ఫెయిల్
తయారీ రంగంలో వృద్ధి రేటును డబుల్ చేయడంలో ఫెయిల్
అందరికీ ఇళ్లు ఇస్తామని చెప్పి, నిలబెట్టుకోవడంలో ఫెయిల్
నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించడంలో ఫెయిల్
24 గంటల పాటు కరెంట్ అందించడంలో ఫెయిల్
విద్య, ఆరోగ్యం విషయంలో సమ్మిళిత వృద్ధి సాధించడంలో ఫెయిల్
డిసెంబర్ 19, 2018లో నీతి అయోగ్ నిర్దేశించుకున్న ఈ లక్ష్యాలు అలాగే మిగిలిపోయాయి. వీటిని చేరుకోవడంలో వెనుకబడి ఉంది. నీతి అయోగ్ దీనికి సమాధానం చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News