తప్పిదాల కంపెనీలపై చర్యలు : గడ్కరీ
న్యూఢిల్లీ : ఇ స్కూటర్లలో మంటలు చెలరేగడంపై కేంద్ర రాదార్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెట్రోలు డీజిల్ ఇంధనంతో కాలుష్య స్థాయి పెరుగుతోంది. దీనికి విరుగుడుగా విరివిగా ఎలక్ట్రానిక్ స్కూటర్లు తీసుకురావాలని కేంద్రం సంకల్పించింది. అయితే ఇవి తరచూ ప్రమాదాలకు గురి కావడం కాలిపోవడం జరుగుతోంది. దీనికి బాధ్యులను చేస్తూ నిర్లక్షపు ఎలక్ట్రానిక్ వాహనాల సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని గురువారం గడ్కరీ హెచ్చరించారు. ఇందుకు అవసరం అయిన ఆదేశాలను వెలువరిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్ వాహనాలలో మంటలు వెలువడటం ఎందుకు జరుగుతోంది? దీనికి బాధ్యులెవరు? అనే అంశాలపై ఆరాతీసేందుకు నిపుణుల కమిటీని వేశారు. ఈ కమిటి నివేదిక ఆధారంగా త్వరలోనే అవసరం అయిన ఆదేశాలను వెలువరిస్తారు.
తప్పిదాల కంపెనీలపై తగు చర్యలకు వీలేర్పడుతుందని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరం అయిన ప్రమాణాల కేంద్రీకృత మార్గదర్శకాలను త్వరలోనే వెలువరిస్తారు. వీటికి సంబంధిత కంపెనీలు అన్ని కట్టుబడి ఉండాలని ఆదేశించారు. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ స్కూటీలు కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడంతో ఒకరిద్దరు మృతి చెందారు. దీనితో సంబంధిత వాహనాల వైపు మొగ్గుచూపుతున్న ప్రజలలో వీటి కొనుగోళ్లపై సందిగ్ధత నెలకొంది. దీనిని తమ మంత్రిత్వశాఖ అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తోందని, భారీ జరిమానాలతో పాటు నాణ్యతాలోపాలను గుర్తించినట్లు అయితే వెంటనే అటువంటి వాహనాలను వెనకకు గోడౌన్లకు తరలిస్తారని , ప్రమాదాల విషయంలో రాజీ ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు.