సకాలంలో స్పందించని సర్కారుతో చిక్కులే
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందన
మోడీ ప్రగతి పథం వ్యాఖ్యలకు కౌంటర్?
వినూత్న నిర్మాణాలకు ఇంజనీర్లకు పిలుపు
న్యూఢిల్లీ: ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై దాపరికాలు లేకుండా తరచూ గడ్కరీ విమర్శలకు దిగుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బిజెపి పార్లమెంటరీ పార్టీ బోర్డు సభ్యత్వం నుంచి అమిత్‌షా నడ్డాలు ఆయనను మోడీ ప్రోద్బలంతో తీసేశారు. దీని గురించి పట్టించుకోకుండా గడ్కరీ ఇటీవలే ఓ సమావేశంలో ప్రభుత్వ స్పందన తీరు తెన్నులు సరిగ్గా లేవని వ్యాఖ్యానించారు. ముంబైలో కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్ నాట్కన్ 2022 సమావేశంలో ఆయన స్పందనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడం ఓ సమస్య అని గడ్కరీ వ్యాఖ్యానించారు. సరైన నిర్ణయాలను సకాలంలో తీసుకోకపోతే ఏం జరగాలో అదే జరుగుతుందని అన్నారు. దేశానికి ఇంజనీర్లు నిర్మాణ పాత్ర వహిస్తారని, వారు అద్భుతాలు చేయగలరని, వారికి ఈ సమర్థత ఉందని, దేశ భవిష్య మౌలికసాధనాసంపత్తి భవిత బాగుంటుంది. దీనిని మరింతగా తీర్చిదిద్దే దిశలో ఇంజనీర్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. సముచిత ఆవిష్కరణలు, సృజనాత్మకతలు, ఉత్తమ పరిశోధనలు, విజయవంతమైన ఆచరణ ప్రపంచవ్యాప్త పరిణామం అయింది. దేశంలోనూ దీనిని పాటించాల్సి ఉంటుంది. ఇంజనీర్లు నిర్మాణ వ్యయాలు తగ్గించేందుకు అవసరం అయిన పద్దతులు రూపొందించాలి. అతి ఖర్చు, బరువులతో కూడిన సామాగ్రి బదులు ఇతరత్రా వాటిని కనుగొనాలి. దీని వల్ల నిర్మాణాలు సులభతరం అవుతాయి. దేశం ఇప్పుడు నిర్మాణ దిశలో పురోగామ దశలో ఉంది. దీనిని గుర్తించాల్సి ఉందన్నారు. నాణ్యతతో రాజీపడకుండా ఖర్చు తగ్గించే ప్రక్రియలు అన్వేషించుకోవల్సి ఉందన్నారు. అన్నింటికన్నా కాలం విలువైనది. ఇదే దేనికైనా మూలధనం పెట్టుబడి.
సకాలంలో సర్కారు నిర్ణయాలు తీసుకోకపోవడం సమస్యలకు దారితీస్తుంది. ఇది అందరికీ వర్తిస్తుందన్నారు. సమయం అత్యంత విలువైన సాంకేతికత, వనరుల ప్రాతిపదిక అవుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. తమ ప్రభుత్వం పలు మైలురాళ్లు దాటుతూ విజయం సాధించిందని పంద్రాగస్టు సందేశంలో ప్రధాని మోడీ చెప్పిన దానికి గడ్కరీ మాటలకు పొంతన కన్పించకుండా పోయింది. సకాల నిర్ణయాలతో ఇప్పుడు విజయపథానికి అమృతకాలం ఏర్పడిందని ప్రధాని వ్యాఖ్యానించగా, సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోకపోవడం సమస్య అవుతోందని పార్టీలో అప్రాధాన్యతకు గురైన మంత్రి గడ్కరీ చెప్పడం కీలక పరిణామంఅయింది. అయితే గడ్కరీ నిర్థిష్టంగా ఏ ప్రభుత్వం గురించి వ్యాఖ్యలకు దిగలేదని, ఆయన ప్రభుత్వం అని సాధారణ రీతిలో పేర్కొన్నారని, దీనిని మోడీ ప్రభుత్వానికి వర్తింపచేయాల్సిన అవసరం లేదని బిజెపి నేతలు కొందరు వెంటనే స్పందించారు. నాగ్‌పూర్‌లో ఈ మధ్యలోనే ఓ చోట గడ్కరీ మాట్లాడుతూ ఈరోజులలో రాజకీయాలు కేవలం అధికార కర్రపెత్తనంగా మారాయని, దీనిని ఆలోచించుకుంటే తాను ఎందుకొచ్చిన ఈ రాజకీయాలు అన్పిస్తుందని వ్యాఖ్యానించారు.
Nitin Gadkari comments on Central Govt