Thursday, January 16, 2025

ప్రమాదాల అదుపునకు సాంకేతికత

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతుండటంపై కేంద్ర రోడ్లు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల లోక్‌సభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాను విదేశాలకు వెళ్లినప్పుడు ఆయా సమావేశాల్లో రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే తలదించుకోవలసి వస్తోందని ఆయన నిర్మొహమాటంగా వెల్లడించడం విశేషం. ఈ ప్రమాదాలను నివారించాలంటే ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని కూడా ఆయన సూచించారు. ఏడాదిలో సగటున 1.78 లక్షల మంది రోడ్డుప్రమాదాల బారిన పడుతున్నారని, అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో ఏటా 28 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలకు దారి తీసే కారణాలను, ప్రాంతాలను, ఇతర పరిస్థితులను సరిగ్గా అధ్యయనం చేయడానికి, ప్రమాదాలను అదుపు చేయడానికి వీలుగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఒఆర్‌టిహెచ్) 2021లో సాంకేతిక వ్యవస్థను రూపొందించింది. ఇది ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్ (ఐఆర్‌ఎడి) అనే సెంట్రల్ డిజిటల్ వ్యవస్థ. దీనిని నేషనల్ ఇన్‌ఫర్మేటిక్ సెంటర్ నిర్వహిస్తుంది. ఈ ఐఆర్‌ఎడి డేటా ప్రకారం గత నాలుగేళ్లలో దేశం మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదాలు భారీ సంఖ్యలో జరిగాయని వెల్లడైంది. 2021 నుంచి 2024 డిసెంబర్ 9 వరకు 14.1 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. దక్షిణాదిలో ఈ ప్రమాదాల్లో అగ్రస్థానంలో ఉన్న ఐదు రాష్ట్రాల్లో ముందున్న తమిళనాడులో 1.9 లక్షలు, కర్ణాటకలో 1.4 లక్షలు, కేరళలో 1.3 లక్షల ప్రమాదాలు గత నాలుగేళ్లలో జరిగాయి. ఐఆర్‌ఎడి అమలులోకి వచ్చిన నాటి నుంచి 1393 రోజులు దాటిపోగా, ఆ సమయంలో ప్రతిరోజూ సరాసరిన 102 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు రికార్డు కావడం శోచనీయం. ఈ లెక్కన గత నాలుగేళ్లలో మొత్తం 14.1 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా దాదాపు 17.7 లక్షల మంది బాధితులయ్యారని తెలిసింది. వీరిలో 23% మంది ప్రాణాలు కోల్పోగా, 25 శాతం మంది తీవ్రగాయాల పాలయ్యారు. 8.6 లక్షల మంది మైనర్లు కూడా ఈ ప్రమాదాలకు కారకులయ్యారు. 201516 నుంచి 201920 మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాల వల్ల సంభవించే మరణాలు జాతీయ స్థాయిలో సరాసరి సంఖ్య కన్నా దక్షిణాది రాష్ట్రాలలోనే ఎక్కువగా ఉన్నట్టు దేశంలోని రోడ్డు భద్రతకు సంబంధించిన 2023 నివేదిక వెల్లడించింది. దేశం మొత్తం మీద దక్షిణాది రాష్ట్రాల్లోనే రోడ్డు ప్రమాదాలు భారీ సంఖ్యలో జరగడానికి కారణాలేమిటో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఐఐటి మద్రాస్‌కు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ డిజైన్ ప్రొఫెసర్ బాలసుబ్రమణియన్ సూచించారు. టు వీలర్ వాహనాలను తరచుగా వినియోగించడం, బాధితులకు జీవిత బీమా వర్తింపు తదితర అంశాలు ఈ సందర్భంగా పరిశీలించవలసిన అవసరం ఉందన్నారు. అత్యధిక సంఖ్యలో రోడ్డు ప్రమాదాల నమోదులో టాప్ మూడు రాష్ట్రాల్లో తమిళనాడులో 1.9 లక్షలు, మహారాష్ట్రలో 1.8 లక్షలు, ఉత్తరప్రదేశ్‌లో 1.5 లక్షలు నమోదయ్యాయి. రోజువారీ అత్యధిక సంఖ్యలో నమోదవుతున్న ప్రమాదాలు సగటున తమిళనాడులో 141, మధ్యప్రదేశ్‌లో 131, కేరళలో 122 ప్రమాదాలు నమోదవుతున్నాయి. రోడ్డు భద్రత యాజమాన్య వ్యవస్థలో సాంకేతికత కీలకమైన పాత్ర వహిస్తుందని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (ఎంఒఆర్‌టిహెచ్) భాగస్వామ్య సంస్థ జార్జి ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సూచించింది. అంతేకాకుండా రోడ్డు భద్రత మరింత పెంచడానికి ఐఆర్‌ఎడి వంటి డిజిటల్ వ్యవస్థలను విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించింది. రోడ్డు ప్రమాదాల వివరాల సేకరణ, నిర్వహణలో ఐఆర్‌ఎడి/ఇడిఎఆర్ వంటి డిజిటల్ వ్యవస్థలను సరిగ్గా వినియోగించకపోవడంతో సమగ్రంగా ట్రాఫిక్ నిర్వహించడం కానీ, ప్రమాదాలను అదుపు చేయడం కానీ జరగడం లేదని నివేదిక పేర్కొంది. వాహనాలు ఢీకొనడం వంటి ప్రమాదాల్లో 90 శాతం మానవ ప్రమేయం వల్లనే జరుగుతున్నాయని 2022 లోని రోడ్డు భద్రత నివేదిక వెల్లడించడం ఈ సందర్భంగా గమనించవలసి ఉంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన వల్లనే ప్రధాన కారణంగా 90 శాతం డేటా వెల్లడించడం విశేషం. ఇదిలా ఉండగా 2024లో డ్రంక్ డ్రైవింగ్ వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాల కన్నా కొబ్బరి బొండాలు రోడ్లపై చెల్లాచెదురుగా పడివేయడం వల్ల జరిగే ప్రమాదాలు 2.28 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని అకో అనే సంస్థ తన అధ్యయనంలో వెల్లడించింది. వీధి కుక్కలు వెంటాడడం వల్ల 62 శాతం, ఆవులు వల్ల 29 శాతం ప్రమాదాలకు దారి తీస్తున్నాయని వివరించింది. దేశం మొత్తం మీద రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మెట్రో నగరాలైన ఢిల్లీ ఎన్‌సిఆర్, హైదరాబాద్ నగరాల్లో 78% వరకు ఉండగా, పుణెలో 15.9 శాతం, బెంగళూరులో 14.2% ఉంటున్నాయని పేర్కొంది. నగరాల్లో రోడ్ల నిర్వహణ సరిగ్గా లేక, గతుకులు, గుంతలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని వివరించింది. రోడ్లపై గతుకుల, గుంతల వల్లనే బెంగళూరులో 44.8 శాతం, ఢిల్లీలో 13.3 శాతం, ముంబైలో 12.3 శాతం ప్రమాదాలు ఏర్పడుతున్నాయని విశ్లేషించింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా వాహనాలు దెబ్బతిని ప్రమాదాలకు దారి తీస్తున్నాయని నివేదిక పేర్కొంది. తుపాన్ వల్ల వరదల ముంచెత్తి వాహనాలు దెబ్బతినడం చెన్నైలో 22 శాతం వరకు ప్రమాదాలకు దారి తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో వాహనాలకు బీమా వర్తింప చేయడం తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News