జర్నలిజం అవార్డుల సభలో గడ్కరీ వ్యాఖ్యలు
పుణే : పటిష్ట కాంగ్రెస్ దేశంలోని ప్రజాస్వామ్యానికి అత్యవసరం అని కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రతిపక్షాల స్థానాన్ని క్రమేపీ ప్రాంతీయ పార్టీలు కైవసం చేసుకోవడం ప్రజాస్వామ్యానికి ముప్పు కల్గిస్తుందని అన్నారు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ బలోపేతంగా ఉండటం వల్లనే దేశంలో ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌వాదులు పార్టీని వీడకుండా తమ సిద్దాంతాలకు కట్టుబడి పనిచేయాలని కోరారు. పుణేలో జరిగిన జర్నలిజం అవార్డుల సభలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ఆవశ్యకత గురించి బిజెపిలో సీనియర్ నేతగా ఉన్న కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడటం సంచలనానికి దారితీసింది.
తాను ప్రధాని పదవికి రేస్‌లో లేనని గడ్కరీ వదంతుల స్వస్తి దిశలోపలికారు. తాను జాతీయ స్థాయి రాజకీయనాయకుడిని అని, మహారాష్ట్ర రాష్ట రాజకీయాలకు వెళ్లడం ఈ దశలో అయితే లేదని తేల్చిచెప్పారు. ఓ దశలో తనకు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి ఉండేది కాదని, అయితే తరువాత పరిస్థితి మారిందని, ఇప్పుడు తన స్థితి పట్ల సంతృప్తితో ఉన్నాని అన్నారు. దేశంలో బలమైన ప్రతిపక్షం ప్రజాస్వామ్యానికి ప్రాణప్రదం అవుతుందన్నారు. బలహీన స్థితిలో ఉండే కాంగ్రెస్ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సెలవిచ్చారు. కాంగ్రెస్ డీలా పడుతున్న ప్రతిచోటా ప్రాంతీయ పార్టీలు బలోపేతం అవుతూ చివరికి ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ కాకుండా ప్రాంతీయ పార్టీలు వచ్చిచేరుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య భారతానికి చేటు కల్గిస్తుందన్నారు.