హైదరాబాద్‌కు రానున్న కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ
హైదరాబాద్: రాష్ట్రంలో 10 జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, 2 జాతీయ రహదారులకు ఈనెలలో ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. వీటిని ఈనెల 29వ తేదీన కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో జాతీయ రహదారి 161లో పూర్తైన 2 ప్యాకేజీ పనుల రోడ్లను కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు. అనంతరం జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన హైదరాబాద్ టు బెంగుళూరు రహదారిలో 12 కిలోమీటర్లు, హైదరాబాద్ టు నాగ్‌పూర్ జాతీయ రహదారిపై బోయినపల్లి నుంచి కండ్లకోయ వరకు ఆరులైన్ల రహదారి విస్తరణకు రెండు ప్యాకేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీంతోపాటు అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు నాలుగు లైన్ల రహదారి, రాష్ట్ర రహదారులు భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న జనగామ టు -దుద్దెడ జాతీయ రహదారి విస్తరణ, వరంగల్ టు ములుగు నాలుగు లైన్ల రహదారి, ఎల్బీనగర్- టు మల్కాపూర్ ఆరులైన్ల రహదారి, బోడుప్పల్ టు -ఘట్కేసర్ మధ్య నాలుగున్నర కిలోమీటర్లు ఆరు లైన్ల రహదారిగా విస్తరణ, బిహెచ్‌ఎఎల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జి, వలిగొండ- టు తొర్రూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నారు.