బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను డిప్యూటీ ప్రధానిగా చేయాలని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే ఒక ప్రకటన చేశారు. ఎన్డీఏ కు నితిశ్ కుమార్ చేసిన కృషి అపారమైనదని చౌబే అన్నారు. చౌబే ఇది పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయం అని ప్రకటించినా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో బీజేపీ సీనియర్ నాయకుడు ఇటువంటి ప్రకటన చేయడం ఆశ్చర్యం కల్గించింది. నితిశ్ కుమార్ వరుసగా ఐదోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, నితిశ్ కుమార్ కు ముఖ్యమంత్రిగా గౌరవంగా సాగనంపాలనే బీజేపీ వ్యూహంలో భాగంగానే ఈ ప్రకటనను భావిస్తున్నారు. నితిశ్ కుమార్ ఎన్డీఏకు చేసిన కృషి గొప్పదని, సంకీర్ణంలో ఆయన మోదీకి బలమైన అండగా నిలిచారని,
ఆయనను డిప్యూటీ సీఎం చేయాలన్నది తన వ్యక్తిగత కోరిక అని అశ్విని కుమార్ చౌబే మీడియాతో అన్నారు. అదే జరిగితే, బాబు జగ్జీవన్ రామ్ తర్వాత ఆ పదవిని అధిష్టించిన బీహార్ భూమి పుత్రుడు కాగలడని చౌబే అన్నారు.గతంలోనూ ఇలాంటి ప్రతిపాదనలు వచ్చాయి. నితిశ్ కుమార్ ఉపరాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారని, దివంగత నేత సుశీల్ కుమార్ మోడీ పేర్కొన్నారు. ఆ అత్యున్నత రాజ్యాంగ పదవికి తన పేరు పరిగణించకపోవడం వల్లే ఆయన 2022లో ఎన్డీయే నుంచి వైదొలగారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికలు 2025 నవంబర్ లో జరుగనున్నాయి. బీజేపీ, జేడీయూ ఈ సారి ఎన్నికల్లోనూ కూటమిగా పోటీ చేయనున్నాయి. మిగతా పార్టీలు అధికారంకోసం పోటీ పడుతున్నాయి. నితిశ్ కుమార్ ఆధ్వర్యంలోని 36 మంది సభ్యుల కేబినెట్ లో బీజేపీ మంత్రులు 21 మంది, జేడీయూ సభ్యులు 13 మంది ఉన్నారు. గత వారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా నితిశ్ కుమార్ తో బీహార్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు.