Wednesday, January 22, 2025

నితీశ్ ‘ఇండియా’లో ఉంటే ప్రధాని: అఖిలేశ్ యాదవ్

- Advertisement -
- Advertisement -

లక్నో : ప్రతిపక్ష ఇండియా కూటమిలోనే బీహార్ సిఎం నితీష్ కుమార్ కొనసాగితే ఆయన ప్రధాని పదవి పీఠం చేరుకుంటారని సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. జెడియు అధినేత నితీష్ ప్రస్తుత రాజకీయ పరిణామాల నడుమ తిరిగి బిజెపి సారధ్యపు ఎన్‌డిఎలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఎస్‌పి నేత శుక్రవారం స్పందించారు. దేశంలో క్రమేపీ లోక్‌సభ ఎన్నికల వాతావరణ నెలకొంటున్న దశలో ఇండియా కూటమిలో బీటల పరిణామాలు చర్చనీయాంశాలు అయ్యాయి. ఆయన బిజెపి వైపు ఎందుకు చూస్తున్నారో తెలియడం లేదు. ఇండియా కూటమి ఆలోచనకర్తనే ఆయన. ఇందులోనే ఆయన మరింత బలంగా కొనసాగితే పరిస్థితి మరో విధంగా ఉంటుందని, రేపు ఎన్నికల తరువాత ఆయన దేశ ప్రధాని అయ్యే బలీయ అవకాశాలు ఉన్నాయని అఖిలేష్ తెలిపారు. ఈ క్రమంలో ఆయన బీహార్‌లో ఇప్పుడు నెలకొన్న రాజకీయ సంక్షోభం గురించి కూడా పరోక్షంగా ప్రస్తావించారు.

ఇండియా కూటమిలో ఎవరినైనా ప్రధాని పదవికి అభ్యర్థిగా నిలిపేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధమైన అంతర్గత లక్షణం ఉంది. ఈ క్రమంలో తగు మద్దతు, అందరి ఆమోదయోగ్యుడుగా నితీష్‌కు అయితేనే అవకాశాలు ఉంటాయి. ఆయన ప్రధాన పోటీదారు అవుతారని అఖిలేష్ చెప్పారు. రెండు మూడురోజులుగా రాజకీయ వర్గాలలో నితీష్ కదలికలపై ప్రచారం జరుగుతోంది. ఆయన ఇండియా కూటమి నేతల వైఖరి నచ్చక , దీనిని వీడి తిరిగి బిజెపితో సంబంధాలు పునరుద్ధరించుకుంటారని వార్తలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ మద్దతుతో బీహార్ సంకీర్ణ ప్రభుత్వం ఇప్పుడు ఉంది. ఆయన కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంటారని అయితే ఈసారి బిజెపి మద్దతుతో రేపు లేదా ఎల్లుండి ఆయన తిరిగి సిఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని వార్తలు వెలువడ్డాయి. దీనితో ఆయన బీహార్‌కు తొమ్మిదోసారి సిఎం కావడం అవుతుంది. ఆయన యూటర్న్ , ఇండియా కూటమికి దూరం కావడం పట్ల అఖిలేష్ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాను ఆయనను ఇండియా కూటమిలోనే ఉండాలని బలవంతం చేయడం లేదని, చేయలేనని, అయితే ఆయన రాజకీయ భవిష్యత్తు కోణంలో చూస్తే ఇండియా కూటమిలో కొనసాగడం మంచిదని అభిప్రాయపడుతున్నానని తెలిపారు. విపక్ష కూటమిలో అసంతృప్త పక్షాలు ఉండనే ఉన్నాయని వ్యాఖ్యానించారు.

రాహుల్‌తో కలిసి ప్రచారం చెప్పలేం
లోక్‌సభ ఎన్నికలలో రాహుల్ గాంధీతో కలిసి విపక్ష విజయానికి ప్రచారానికి వెళ్లడంపై అఖిలేష్ స్పష్టత ఇవ్వలేదు. దీనిపై ఇప్పుడేమీ చెప్పలేమని, కాలం సమాధానం చెపుతుందన్నారు. పరస్పర సహకారం వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకుంటే ఆ విధంగా చేసేందుకు వీలుంటుందని తెలిపారు. తనకు ప్రధాని పదవిపై ఆశలేదని అఖిలేష్ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలకు బలం ఉన్నచోట ఎన్నికలలో పోటీకి ఎక్కువగా దిగాలనేదే తమ ఆలోచన అన్నారు. టిఎంసి అధినేత్రి మమత బెనర్జీ కూడా ఇదే విధంగా స్పందించారు. బెంగాల్‌లో టిఎంసి ఒంటరి పోరుకు దిగనుంది. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం అయ్యాయి. దీనిపై అఖిలేష్ పెద్దగా మాట్లాడలేదు. కాగా రామాలయం గురించి మాట్లాడుతూ బిజెపి అన్నింటిని రాజకీయం చేసిందని, ఇప్పుడు అయోధ్య ఆలయాన్ని కూడా వదలలేదన్నారు. తాను తగు సమయం చూసుకుని అయోధ్యలో రామాలయ సందర్శనకు వెళ్లుతానని , ఎప్పుడు అనేది తన పండితులతో చర్చించుకుని సకాలంలో ఈ సమయం ఖరారు చేసుకుంటానని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News