Tuesday, January 7, 2025

లాలూ ఆఫర్‌ను లెక్క చేయని నితీశ్

- Advertisement -
- Advertisement -

పొరపాటున ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నా
జెడి (యు) సుప్రీమో వ్యాఖ్య

పాట్నా : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం తన బద్ధ శత్రువు లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్‌జెడి ఆఫర్‌ను అలక్షం చేశారు. ‘అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని’ ప్రతిపక్షంతో ‘పొరపాటున’ పొత్తులు పెట్టుకున్నానని నితీశ్ వ్యాఖ్యానించారు. బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో తిరిగి చేరిన తమ పూర్వపు మిత్ర పక్షానికి ఆర్‌జెడి తన ‘తలుపులు బార్లా తెరచి ఉంచింది’ అని బీహార్ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన లాలూ ప్రసాద్ ప్రకటించిన కొన్ని రోజుల తరువాత జెడి (యు) సుప్రీమో నితీశ్ ఆ వ్యాఖ్య చేశారు. రాష్ట్ర వ్యాప్త ప్రగతి యాత్రలో భాగంగా ఉత్తర బీహార్ జిల్లా ముజఫర్‌పూర్‌లో విలేకరులతో నితీశ్ మాట్లాడుతూ, ‘మాకు ముందు అధికారంలో ఉన్నవారు ఏదైనా చేశారా? జనం సూర్యాస్తమయం తరువాత తమ ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతుండేవారు.

రెండు సార్లు వారితో పొత్తు పెట్టుకోవడం ద్వారా నేను పొరపాటు చేశాను’ అని పేర్కొన్నారు. ‘అప్పట్లో మహిళల స్థితి ఎలా ఉండేది? ఇప్పుడు మీరు ఈ స్వయంసహాయక బృందాలను చూడగలరు. ఈ బృందాలకు జీవిక అని పేరు పెట్టాం. కేంద్రం మా మోడల్‌ను అనుసరించి అజీవిక అని నామకరణం చేసింది. ఇంతకు ముందు అటువంటి దృఢవిశ్వాసం ఉన్న గ్రామీణ మహిళలను మీరు చూశారా?’ అని రాష్ట్రానికి దీర్ఘ కాలంగా సిఎంగా ఉన్న నితీశ్ అన్నారు. అయితే, లాలూ ఆఫర్‌పూ ప్రశ్నలకు నితీశ్ సమాధానం ఇవ్వలేదు.

లాలూ ఆఫర్‌ను ఆయన కుమారుడు, వారసుడు తేజస్వి యాదవ్ తేలికగా తీసిపారేయగా, మిత్ర పక్షం కాంగ్రెస్ ఆమోదించింది. ఒక సంవత్సరం లోపే జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్‌ను కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదించిన నేపథ్యంలో లాలూ ఆ ఆఫర్ ఇచ్చారు. కాగా, రాష్ట్ర బిజెపి నాయకులు కూడా 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డిఎ ‘ముఖ్యమంత్రి’ అభ్యర్థి జెడి (యు) అధ్యక్షుడు నితీశ్ అనే సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించలేకపోయిన బిజెపి కేంద్రంలో అధికారంలో కొనసాగడానికి జెడి (యు), ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టిడిపి వంటి మిత్ర పక్షాలపై ఆధారపడుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News