Wednesday, January 22, 2025

జెడి(యు) అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ ఎన్నిక

- Advertisement -
- Advertisement -

పార్టీ జాతీయ కార్యవర్గం నిర్ణయం

పాట్నా: జనతాదళ్(యునైటెడ్) అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శుక్రవారం ఎన్నికయ్యారు. బెడి(యు) అధ్యక్షుడిగా ఇప్పటవరకు వ్యవహరించిన లలన్ సింగ్ వైదొలగడంతో శుక్రవారం జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన స్థానంలో నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం, కుల గణన కోసం పోరాటాన్ని సాగించడంలో ఆయన నితీశ్ కుమార్ పాత్రను పార్టీ జాతీయ కార్యవర్గం ప్రశంసించింది. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి నితీశ్ అంగీకరించినట్లు జెడి(యు) అధికార ప్రతినిధి కెసి త్యాగి తెలిపారు.

ఆంతరంగికంగా జరిగిన కార్యవర్గ సమావేశంలో పార్టీ అధ్యక్ష పదవి నుంచి లలన్ సింగ్ వైదొలగి నితీశ్ కుమార్ పేరును ప్రతిపాదించారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నితీశ్ సేవలు పార్టీకి ఎంతైనా అవసరమని కార్యవర్గం అభిప్రాయపడింది. ప్రస్తుతం ముంగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నితీశ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా లేక లోక్‌సభకు పోటీచేస్తారా అన్న విషయం స్పష్టంకాలేదు. జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న నితీశ్ కుమార్ ఈ సంక్లిష్ట దశలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని పార్టీలోని పలువురు నేతలు కోరినట్లు వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమిలో జెడి(యు) భాగస్వామ్య పక్షంగా ఉంది.

ఇటీవల నితీశ్‌ను కలసినపుడు పార్టీ నాయకులు పలువురు లలన్ సింగ్‌పై ఫిర్యాదు చేసినట్లు వర్గాలు తెలిపాయి. పార్టీలో విభేదాలు తలెత్తిన పరిస్థితులలో తామంతా సమైక్యంగా ఉన్నామని చెప్పడానికి నితీశ్ కుమార్ తన వెంట లలన్ సింగ్‌ను ఉంచుకుని పార్టీ సమావేశాలలో మాట్లాడారు. అయితే ఆర్‌జెడితో సన్నిహితంగా ఉంటున్నందువల్లే లలన్ సింగ్‌పై వేటు వేశారన్న వదంతులను పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. అనేక దశాబ్దాలుగా లలన్ సింగ్ నితీశ్‌కు సన్నిహిత అనుచరుడని వారు చెబుతున్నారు. కాగా.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం పట్ల తనకు అంతగా ఆసక్తి లేదని, అయితే పారీ జాతీయ కార్యవర్గ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని నితీశ్ కుమార్ ఆ సమావేశంలో చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు నితీశ్‌ను భావి ప్రధానిగా సంబోధిస్తూ పార్టీ కార్యాలయం వద్ద పెద్దపెట్టున నినాదాలు చేయడం విశేషం.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News