Sunday, December 22, 2024

నితీశ్ అసంతృప్తి!

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష ‘ఇండియా’ (భారతీయ జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) మైత్రికి ఇక ఇంతే సంగతులా అనే ప్రశ్న నెమ్మది నెమ్మదిగా బలపడుతున్నది. ఈ కూటమిని కూడగట్టి ఒక దారికి తెచ్చిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ గురువారం నాడు పాట్నాలో మాట్లాడిన తీరు ఇందుకు వీలు కల్పిస్తున్నది. ‘ఇండియా’ కూటమి ఈ మధ్య ఉత్సాహాన్ని కోల్పోతున్నది. ముందడుగు వేయలేకపోతున్నది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల పైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నది అని నితీశ్ కుమార్ సిపిఐ నిర్వహించిన సభలో మాట్లాడుతూ అన్నారు. ‘భాజపా హటావో, దేశ్ బచావో’ (బిజెపిని తొలగించి దేశాన్ని కాపాడుదాం) పేరిట సిపిఐ ఈ సభను జరిపింది. ‘కూటమి సారథ్య బాధ్యతలను కాంగ్రెస్ చేపట్టడానికి మేమంతా అంగీకరించాము. అది మాత్రం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే ‘ఇండియా’ తదుపరి సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి’ అని కూడా నితీశ్ అన్నారు. ఈ కూటమి అవతరించిన తర్వాత పాట్నా, బెంగళూరు, ముంబైలలో సమావేశాలు జరిగాయి. భోపాల్‌లో బహిరంగ సభ జరపాలన్న ప్రతిపాదన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధినేత కమల్ నాథ్ అభ్యంతరంతో ఆచరణకు నోచుకోలేదు.

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ సహాయ నిరాకరణకు తీవ్ర అసంతృప్తి చెంది సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కొంత వ్యవధి తీసుకొని నితీశ్ కుమార్ ఈ విధంగా మాట్లాడ్డం ఇదే మొదటిసారి. అఖిలేశ్ మాదిరిగా నితీశ్ కాంగ్రెస్‌ను విమర్శించకపోడం గమనించవలసిన విషయం. కాని కాంగ్రెస్ తీరు జాతీయ స్థాయిలో బిజెపిని ఉమ్మడిగా ఎదిరించాలన్న సంకల్పాన్ని దెబ్బ తీస్తున్నదనే అసంతృప్తిని నితీశ్ దాచుకోలేదు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తమ పార్టీకి సీట్లు కేటాయించనందుకు మండిపడిన అఖిలేశ్ లోక్‌సభ ఎన్నికల్లో యుపిలో తమ తడాఖా చూపిస్తానని హెచ్చరించేంత వరకు వెళ్ళారు. తాము ‘ఇండియా’ కూటమిలో చేరాలనుకోలేదని బిసి, ఎస్‌సి, మైనారిటీ జెండా కింద పోరాడాలని అనుకొన్నామని కూడా ఆయన అన్నారు. అఖిలేశ్ అలక నేపథ్యంలో ‘ఇండియా’ కూటమిని ముందుకు తీసుకెళ్ళడం లేదా దానిని మంటగలపడం అనేది ఇక కాంగ్రెస్ చేతుల్లోనే వుంది. అఖిలేశ్ ధోరణి నితీశ్ చేతులను కూడా కట్టివేసినట్టు కనిపిస్తున్నది. అందుకే ఆయన కాంగ్రెస్‌ను ఎత్తి చూపుతూ మాట్లాడారని అనుకోవలసి వుంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి కేంద్రీకరించిన మాట వాస్తవం.

ముఖ్యంగా బిజెపితో నేరుగా తాను తలపడుతున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో గెలుపు కోసం అది కృషి చేస్తున్నది. 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది (మధ్యప్రదేశ్‌లో ఆ తర్వాత బిజెపి ఫిరాయింపు రాజకీయం జరిపి అధికారాన్ని చేజిక్కించుకొన్నది). అయినప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. అందుచేత అసెంబ్లీ ఎన్నికల గెలుపు మాత్రమే దానికి ముఖ్యమైన విషయం కాదు. అలాగని అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు మీద అది దృష్టి పెట్టరాదని అనడానికి వీలు లేదు. ‘ఇండియా’ కూటమి లక్షం తమ ఉమ్మడి ఓటుతో కేంద్రంలో బిజెపిని గద్దె దింపడం. అది లోక్‌సభ ఎన్నికల్లోనే సాధ్యం కాబట్టి కూటమి ఐక్యతను వాటికే పరిమితం చేయాలన్నది కాంగ్రెస్ ఉద్దేశంగా కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల విషయంలో కూటమి ప్రస్తావన తీసుకురాకూడదని అది భావిస్తున్నట్టు స్పష్టపడుతున్నది. కూటమి అన్న తర్వాత అన్ని సందర్భాల్లోనూ వర్తించాలన్నది సమాజ్‌వాదీ పార్టీ ఉద్దేశం. ఈ విషయాలను కాంగ్రెస్ పార్టీ ఇతర భాగస్వామ్య పక్షాలతో వివరంగా చర్చించి వుంటే బాగుండేది. అలా కాకుండా వాటితో నిమిత్తం లేని పద్ధతిలో అది వ్యవహరిస్తున్నది.

కాంగ్రెస్ పార్టీ కూటమిలో పెద్దన్న పాత్ర వహిస్తున్నదనే అభిప్రాయానికి ఇది దారి తీస్తున్నది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ తనంతట తానుగా బిజెపిని ఓడించే అవకాశాలు తక్కువ. ‘ఇండియా’ కూటమిలోని ఇతర పార్టీల మద్దతుతో మాత్రమే అది ఆ పని చేయగలదు. ఈ జ్ఞానోదయం తనకు కలిగినందునే కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో సఖ్యతకు అది సిద్ధమైంది. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల్లో అన్ని చోట్లా బిజెపి అభ్యర్థులపై ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టి కూటమి భాగస్వామ్య పక్షాల ఓట్లన్నీ గంప గుత్తగా వారికి పడేలా చూడాలన్న నిర్ణయం చాలా బలమైనది. బిజెపికి నిలువెల్లా వణుకు పుట్టించేది. కాంగ్రెస్ స్వయం కృతాపరాధాల వల్ల గాని, బిజెపి బయటి నుంచి ప్రయోగించే కుట్రలు, కుహకాల వల్ల గాని ‘ఇండియా’ కూటమి చీలిపోయి ఉమ్మడి అభ్యర్థి ఏర్పాటుకు తూట్లు పడితే కేంద్రం లో బిజెపియేతర ప్రభుత్వం నెలకొనే అవకాశాలు దూరం అవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News