Monday, December 23, 2024

మళ్లీ జెడి(యు) చీఫ్‌గా నితీశ్ కుమార్?

- Advertisement -
- Advertisement -

పాట్నా: జనతాదళ్ యునైటెడ్( జెడియు)పార్టీ చీఫ్‌గా మళ్లీ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం జెడి(యు) చీఫ్ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ ఉన్నారు. అయితే ఆయనను ఆ పదవినుంచి తప్పించేందుకు నితీశ్‌కుమార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 29న జరిగిఏ పార్టీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పార్టీ చీఫ్‌గా మళ్లీ నితీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు కొన్ని వర్గాలద్వారా తెలుస్తోంది. పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలంటే తానే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని నితీశ్ కుమార్‌కు ఆయన సన్నిహితులకు చెప్పినట్లు తెలుస్తోంది.

లలన్ సింగ్ పనితీరు పట్ల నితీశ్‌కుమార్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్‌తో ఆయన సన్నిహితంగా మెసలుతుండడం నితీశ్‌కు గిట్టడం లేదు. అంతేకాకుండా లలన్ సింగ్ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ముంగేర్‌నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఈ సారి ఆయన ఆర్‌జెడి టికెట్‌పై పోటీ చేస్తారని అనుమానాలు వ్య్కమవుతున్నాయి. ఇండియా కూటమి నేతలతోను జెడి(యు) విధానాలను చర్చించడంలో లలన్ సింగ్ విఫలమయినట్లు కూడా నితీశ్ భావిస్తున్నారు.

త్వరలో జెడి(యు), ఆర్‌జెడి విలీనం: కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్
ఇదిలా ఉండగా బీహార్ ముఖ్యమంత్రి నేతృత్వంలోని జెడి(యు), లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్‌జెడి త్వరలోనే విలీనం అవుతాయని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ జోస్యం చెప్పారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ జనవరి నాటికి సీట్ల పంపిణీ ఏర్పాట్లు పూర్తి చేయాలని నితీశ్ కుమార్ పట్టుబట్టడం గురించి విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా గిరిరాజ్ సింగ్ ఈ విషయం చెప్పారు.‘ నాకు లాలూప్రసాద్‌తో వ్యక్తిగత సాన్నిహిత్యం ఉంది. ఆయన నా చెవిలో చాలా రహస్యాలు చెప్పారు. వాటిని బహిరంగంగా చెప్పలేను. కానీ త్వరలోనే జెడి(యు) ఆర్‌జెడితో విలీనం కానుందను ఒక్క విషయం మాత్రం చెప్పగలను. అప్పుడు సీట్ల పంపిణీ సమస్యే రాదు’ అని మంత్రి చెప్పారు. కాగా ఢిల్లీనుంచి పాట్నాకు తిరిగి వస్తూ గిరిరాజ్ సింగ్, లాలూ ప్రసాద్ ఇద్దరూ రెండు రోజుల క్రితం ఒకే విమానం ఎక్కడం జరిగింది.

లాలూ ప్రసాద్ ఇండియా కూటమి సమావేశంలో పాల్గొని తిరిగి వస్తుండగా, గిరిరాజ్ సింగ్ ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని పాట్నా వస్తున్నారు. గురువారం సాయంత్రం పాటా విమానాశ్రయంలో దిగిన తర్వాత గిరిరాజ్ సింగ్ విలేఖరులతో మాట్లాడుతూ, విమానంలో తాను, లాలూ ఎన్నో మాట్లాడుకున్నామని చెప్పారు. తన కుమారుడు, డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన సమయం వచ్చిందని లాలూ తనతో అన్నారని సింగ్ చెప్పారు. అయితే అదే విమానంలో ఉండిన తేజస్వి యాదవ్ మాత్రం తనకు నితీశ్ కుమార్‌కు మధ్య విభేదాలున్నాయన్న వార్తలను కొట్టిపారేశారు. అందరిదృష్టిలో పడాలని గిరిరాజ్ సింగ్ ఏమేమో మాట్లాడుతుంటారని, ఆయన మాటలను ఎవరూ పట్టించుకోరని తేజస్వి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News