Thursday, January 23, 2025

కేజ్రీవాల్‌తో నితీశ్ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి బిజెపికి వ్యతిరేకంగా విఓక్షాల ఐక్యతపై ఆయా పార్టీల మధ్య సమాలోచనలు జరుగుతున్న విషయం తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఈ విషయంలో చొరవ తీసుకొని విపక్షాలను ఒక్కతాటి పైకి తేవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత తేజస్వి యాదవ్‌తో కలిసి ఢిల్లీకి వెళ్లిన నితీశ్ కేజ్రీవాల్‌తో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా ఓ ‘ రాజ్యసభ ప్లాన్’ను కేజ్రీవాల్ ఆయన వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. సమావేశం అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ పాలనా వ్యవహారాల విషయంలో ఆప్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును అడ్డుకునేందుకు కేంద్రం ఆర్డినెన్స్‌ను తీసుకు రావడం

‘రాజ్యాంగ విరుద్ధం’ అని పేర్కొన్నారు. ఈ విషయంలో నితీశ్ కుమార్ తనకు పూర్తి మద్దతు ప్రకటించారని, విషయంలో కలిసి పోరాడుతామని చెప్పారు.‘ ఢిల్లీకి కేంద్రప్రభుత్వం చేసిన అన్యాయంపై అందరం కలిసిపోరాడుతాం. బిజెపియేతర ప్రతిపక్షాలన్నీ ఒక్క తాటిపైకి వస్తే .. రాజ్యసభలో బిల్లు రూపంలోని ఆర్డినెన్స్‌ను ఓడించవచ్చని సూచించా. ఇదేగనుక జరిగితే .. ఎన్నికల ముందు సెమీ ఫైనల్‌లా అవుతుంది. 2024లో బిజెపి మళ్లీ అధికారంలోకి రాదనే సందేశం దేశమంతటా వెళుతుంది’ అని కేజ్రీవాల్ చెప్పారు.ఈ విషయంలో అన్ని ప్రతిపక్షాల మద్దతు తీసుకోవడం కోసం తాను వ్యక్తిగతంగా అందరినీ కలుస్తానని చెప్పారు. ఎల్లుండి(మంగళవారం) కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలుస్తానని చెప్పిన ఆయన ఆ తర్వాత ప్రతి పార్టీ అధ్యక్షుడిని కలుస్తానని చెప్పారు.

ఈ విషయంలో మీరు కూడా అందరు ప్రతిపక్ష నేతలతో మాట్లాడమని తాను నితీశ్‌ను కూడా కోరినట్లు ఆయనచెప్పారు. ప్రజలద్వారా ఎన్నికైన ప్రభుత్వ అధికారాలను ఎలా లాక్కొంటారని నితీశ్ కూడా ప్రశ్నించారు. ‘ సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వానికి పని చేసే హక్కు ఇచ్చింది. దాన్ని ఎలా లాక్కోగలరు? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ విషయంలో మేము ఆప్‌తో ఉన్నాం. మరిన్ని సమావేశాలు నిర్వహిస్తాం. వీలయినన్ని ఎక్కువ పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి దేశవ్యాప్త ప్రచారాన్ని నిర్వహిస్తాం’ అని నితీశ్ అన్నారు. ఆర్డినెన్స్ విషయంలో తాను కాంగ్రెస్ అధినాయకత్వంతో కూడా మాట్లాడుతానని ఒక ప్రశ్నకు సమాధానంగా నితీశ్ చెప్పారు. కేంద్రం రాష్ట్రాల్లోని బిజెపియేతర ప్రభుత్వాలను వేధిస్తోందని తేజస్వి యాదవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్య ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను సాగనివ్వమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News