న్యూఢిల్లీ: మిషన్ 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్షంగా జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దూసుకుపోతున్నారు. మూడు రోజుల హస్తిన పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన అగ్రనేతలను కలుసుకున్నారు. బీజేపీయేతర పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకురావడంలో భాగంగా నితీశ్ ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, జేడీఎస్ అధినేత కుమారస్వామిలను కలుసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్‌ను కలుసుకున్నారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి అరగంటకు పైగా చర్చించారు. దేశ ప్రయోజనాల కోసం విపక్షాలన్నీ ఐక్యం కావడమే ప్రధాన లక్షంగా చర్చలు జరిపారు. తమ మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని నితీశ్ తెలిపారు.
Nitish Kumar Meets Opposition leaders for Alliance