హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభానికి సర్వ సిద్ధమైంది. మార్చి 22వ తేదీన ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన చేసి ట్రోఫీని దక్కించుకునేందుకు అన్ని జట్టు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నాయి. అయితే గత సీజన్ రన్నర్ అప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి ట్రోఫీని దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. అన్ని విభాగాల్లో జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జట్టు అభిమానులకు ఓ శుభవార్త అందింది. యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ సాధించాడు. జాతీయ క్రికెట్ అకాడమీ నుంచి అతను ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాడు. గత ఐపీఎల్‌లో నితీశ్ అద్భుత ప్రదర్శన చేశాడు. 13 మ్యాచుల్లో రెండు అర్ధ శతకాలతో 303 పరుగులు చేశాడు. అంతేకాక.. ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు.
పక్కటెముకల గాయంతో క్రికెట్‌కి దూరమైన నితీశ్ బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలో చికిత్స పొందాడు. తాజాగా అతను యో-యో టెస్టులో 18.1 పాయింట్లతో పాస్ అయ్యాడు. దీంతో అతను ఆదివారం నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జతకట్టనున్నాడు. కాగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.