తొలి సెంచరీతో జట్టును ఆదుకున్న తెలుగు
క్రికెటర్ నితీశ్ రెడ్డి ఫాలో ఆన్ గండం
నుంచి బయటపడ్డ టీమిండియా
నితీశ్‌పై మాజీల ప్రశంసలు
మెల్‌బోర్న్: తెలుగు పేస్ ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ చెలరేగండతో టీమిండియాకు ఫాలోఆన్ గండం తప్పింది. ఆసీస్ ఆధిక్యాన్ని తగ్గించే దిశగా సాగుతోంది. నితీష్ సంచలన శతకంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. భారత్ ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో నితీష్ కుమార్ రెడ్డితో పాటు మహమ్మద్ సిరాజ్(2) ఉన్నాడు. నితీష్‌తో పాటు వాషింగ్టన్ సుందర్(50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ప్యాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్ మూడేసి వికెట్లు తీయగా.. నాథన్ లియన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. 164/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడిన పంత్(28) స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో తప్పుడు షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రవీంద్ర జడేజా స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జడేజా అండతో నితీష్ బ్యాట్‌కు పని చెప్పాడు. క్రీజులో కుదురుకుంటున్న ఈ జోడీని లియన్ విడదీసాడు. జడేజాను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. జడేజా ఔటైనా.. క్రీజులోకి వచ్చిన సుందర్‌తో కలిసి నితీష్ రెడ్డి బ్యాటింగ్‌లో వేగం పెంచాడు. దాంతో భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 244/7 చేసింది.
నితీశ్ ఉత్కంఠ సెంచరీ..
రెండో సెషన్ ఆరంభంలోనే నితీష్ కుమార్ రెడ్డి 81 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ అర్థశతకాన్ని పుష్ప ట్రేడ్ మార్క్ తగ్గేదేలే స్టైల్‌లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం మరింత జోరు పెంచిన నితీశ్ స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో వర్షం రావడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆట తిరిగి ప్రారంభం కాగా.. నితీష్ అదే దూకుడు కనబర్చాడు. మరోవైపు ఎండ్‌లో ఉన్న వాషింగ్టన్ సుందర్ అసలు సిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో నితీష్‌కు సహకారమందించాడు. దాంతో భారత్ టీబ్రేక్ సమయానికి 326/7 చేసింది. మూడో సెషన్‌లో ఈ జోడీ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో వాషింగ్టన్ సుందర్ 146 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్ సాయంతో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మరోవైపు నితీష్(96) సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఉన్నాడు. నాథన్ లయన్ వేసిన అనూహ్య బౌన్స్‌కు సుందర్ స్లిప్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 8వ వికెట్‌కు నమోదైన 117 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
అనంతరం బుమ్రా క్రీజులోకి రాగా.. నితీష్ సింగిల్స్ తీస్తూ 99 పరుగులకు చేరుకున్నాడు. ఈ పరిస్థితుల్లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బుమ్రా పరుగులేమి చేయకుండా ఔటయ్యాడు. దాంతో నితీష్ శతకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ మూడు బంతులను ఎదుర్కొని నితీష్‌కు స్ట్రైక్ ఇచ్చాడు. స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో రెండు బంతులను డిఫెన్స్ చేసిన నితీష్ మూడో బంతిని బౌండరీకి తరలించి 171 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆస్టేలియా వేదికగా ఎనిమిదవ స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు సాధించిన భారతీయుడిగా రికార్డు సాధించాడు. గతంలో స్పిన్ దిగ్గజం కుంబ్లే (87) పేరిట ఈ రికార్డు ఉండేది.