పాట్నా: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్ర శేఖర్ రావు వచ్చే నెల ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరు కావలసిందిగా ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్, జెడి(యు) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్‌ను కోరినట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం చెప్పారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల కాంగ్రెస్‌తో తన సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండబోదని నితీశ్ స్పష్టం చేశారు. బీహార్‌లో నితీశ్ నేతృత్వంలోని మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగస్వామిగా ఉండడం, అలాగే కాంగ్రెస్‌ను కెసిఆర్ తన ప్రధాన శత్రువుగా భావిస్తుండడం తెలిసిందే. ‘తాను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను హాజరు కావాలని కెసిఆర్ పట్టుబట్టారు. అయితే రాష్ట్రంలో ముందుగా నిర్ణయించుకున్న ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్న విషయం చెప్పగా పార్టీ తరఫున ఎవరో ఒకరిని పంపించాల్సిందిగా ఆయన కోరారు. అందువల్ల లలన్‌ను వెళ్లాల్సిందిగా కోరాను’ అని తన ‘సమాధాన్ యాత్ర’లో భాగంగా ఆదివారం కౌముర్ జిల్లాను సందర్శించిన నితీశ్ అక్కడ విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు.
ఆర్‌జెడికి చెందిన తేజశ్వి యాదవ్‌కు కూడా ఒక మాట చెప్పమని కెసిఆర్ కోరారని నితీశ్ చెప్పారు. అలాగే చెప్తానని తాను ఆయనకు హామీ ఇచ్చానని, అయితే కెసిఆరే తేజశ్వితో మాట్లాడారని, వారిద్దరూ హైదరాబాద్ వెళ్తున్నారని నితీశ్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఖమ్మంలో ప్రతిపక్ష నేతల సమావేశం నిర్వహించిన కెసిఆర్ వచ్చే నెల రెండో వారంలో నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం సందర్భంగా మరో భారీ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకొంటున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి కెసిఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను ఆహ్వానించారు. కాగా ఇంతకు ముందు జరిగిన కార్యక్రమానికి నితీశ్ రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే తనను ఆ కార్యక్రమానికి ఆహ్వానించలేదని, ఒక వేళ ఆహ్వానించినా తాను వెళ్లి ఉండే వాడిని కాదని నితీశ్ ఆ తర్వాత వివరణ ఇచ్చారు. కాగా కాంగ్రెసేతర, బిజెపియేతర ప్రతిపక్షాల కూటమి కోసం యత్నిస్తున్న కెసిఆర్‌కు దగ్గరవడం కాంగ్రెస్‌తో ఉమ్మడి ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలన్న తన ఆలోచనను వదులుకున్నట్లు కాదని నితీశ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర ముగియడం కోసం వేచి చూస్తున్నానని, ఆ తర్వాత వివిధ ప్రతిపక్ష పార్టీలు కలిసి కూర్చుని వీలయినంత ఎక్కువ మందిని కలుపుకొని పోయే విధంగా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసే విషయమై చర్చిస్తాయని తాను ఇంతకు ముందే చెప్పినట్లు నితీశ్ తెలిపారు. బిజెపితో పొత్తు తెగతెంపులు చేసుకుని,మహాఘట్‌బంధన్‌లో చేరడం, అలాగే ఢిల్లీ సందర్శించి వివిధ పార్టీలకు చెందిన నేతలను కలవడం ద్వారా ఈ దిశగా తన వంతు ప్రయత్నం తాను చేశానని కూడా ఆయన గుర్తు చేశారు.