Monday, January 20, 2025

బీహార్‌లో బిజెపి తప్పుటడుగు-నాడు, నేడు

- Advertisement -
- Advertisement -

Nitish Kumar shock to BJP

తెర వెనుక మంత్రాంగంతో ప్రతిపక్షాల ప్రభుత్వాలు కుప్పకూల్చడంలో ఆరితేరిన బిజెపికి బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కోలుకోలేని దెబ్బ తీశారు. బిజెపి అప్రమత్తంగా లేని సమయంలో ఆగస్టు 9న ఎన్‌డిఎ నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించడం ద్వారా భారత రాజకీయాలలో ఒబిసి ఓటు బ్యాంకు ఏర్పడటంలో కీలక భూమిక వహించిన యుపి తర్వాత పెద్ద రాష్ట్రంలో ఓ విధంగా బిజెపి నేడు ఏకాకిగా మిగిలింది. జాతీయ స్థాయిలో ఒబిసి రాజకీయాలను ప్రోత్సహించడం ద్వారా తన ప్రాతిపదికను విస్తృతం చేసుకోవడం కోసం, తగ్గుతున్న ప్రజాదరణను పూడ్చుకోవడం కోసం విశేషంగా ప్రయత్నం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాలకు ఇది ఒక విధంగా ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేను ఆలంబనగా చేసుకొని, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కూలదోయడంతో తర్వాత వరుసలో తాను కూడా ఉన్నట్లు గ్రహించిన నితీశ్ ముందుగా జాగ్రత్త పడినట్టు కనిపిస్తున్నది.
40 ఎంపి స్థానాలున్న బీహార్‌లో ఎన్‌డిఎ గత ఎన్నికలలో 39 గెల్చుకోంది. ఇప్పుడు 15 మించి గెల్చుకోవడం కష్టమని నితీశ్ నిష్క్రమణ జరిగిన వెంటనే జరిపిన పోల్ సర్వేలో ఇండియా టుడే- సి ఓటర్ తేల్చి చెప్పింది. అంటే సుమారు 25 సీట్లు అక్కడ తగ్గితే, వాటిని మిగిలిన చోట్ల పూడ్చుకోవడం కొంత సమస్య కావచ్చు. ఒక విధంగా 2004లో నాటి ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ బీహార్ లో చేసిన పొరపాటుని రాజకీయంగా ఇప్పుడు మోడీ, అమిత్ షా ద్వయం చేస్తున్నారా అనిపిస్తుంది. అప్పుడు కూడా వాజపేయికి ఇష్టం లేకపోయినా ప్రధాని పదవి కోసం మరెంతోకాలం వేచి ఉండలేన్నట్లు ముందస్తు ఎన్నికలకు వత్తిడి తీసుకొచ్చారు. ఎన్నికల అనంతరం ప్రధాని అభ్యర్థిగా తనకు అనుకూలం కారని భావించిన నితీశ్ కుమార్ బీహార్‌లో, కరుణానిధి తమిళనాడులో బలం పుంజుకోరాదని అనుకున్నారు.
మరోవంక తనకు మద్దతు ఇస్తున్న ఎపిలోని చంద్రబాబు నాయుడుకు ముందస్తు ఎన్నికల విషయంలో అండగా నిలిచారు. తమిళనాడులో డిఎంకెను వదిలి జయలలితతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అక్కడ ఎన్‌డిఎ తుడిచిపెట్టుకుపోయింది. ఎపిలో చంద్రబాబులో కలసి ముందస్తుకు వెళ్లడంతో అక్కడా అదే జరిగింది. బీహార్‌లో ఒక వంక నితీశ్‌తో పొత్తులో కొనసాగిస్తూ రామ్ విలాస్ పాశ్వాన్‌తో విడిగా అభ్యర్థులను పోటీకి దింపి, నితీశ్ పార్టీ చతికిలపడేటట్లు చేశారు. ఈ మూడు రాష్ట్రాలలో ఎన్‌డిఎ దెబ్బతినడంతోనే 2004లో తిరిగి వాజపేయి ప్రధాని కాలేకపోయారు. ఇప్పుడు మరోసారి బీహార్‌లో అదే జరుగుతున్నది.
నితీశ్ కుమార్‌ను రాజకీయంగా కనుమరుగయ్యేటట్లు చేయడం కోసం 2020 అసెంబ్లీ ఎన్నికలలో చిరాగ్ పాశ్వాన్‌తో విడిగా పోటీ చేయించారు. అయితే నితీశ్ సీట్లను 43కు తగ్గించగలిగినప్పటికీ, బిజెపికి 74 సీట్లు వచ్చినా ఆర్‌జెడి కూటమికి 115 వరకు సీట్లు రావడం, పాశ్వాన్ పార్టీ పెద్దగా సీట్లు గెల్చుకోలేక పోవడంతో తిరిగి నితీశ్‌ను సిఎంగా చేయక తప్పలేదు. పాశ్వాన్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో పేరొందిన ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి మద్దతుదారులు కనీసం 12 మంది ఉండడం గమనార్హం.
జెడి(యు), ఆర్‌జెడి, కాంగ్రెస్‌ల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించి, అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు ఒక వంక సాగుతున్నాయి. అందుకు నితీశ్‌కు ఒకప్పుడు కుడిభుజంగా పేరొందిన ఆ పార్టీ ఎంపి ఆర్‌సిపి సింగ్‌ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకొని, అతని ద్వారా జెడి(యు)లో ఫిరాయింపులకు పథకం వేసినట్లు చెబుతున్నారు. ఈ పథకాన్ని నితీశ్ గత ఫిబ్రవరి నాటికి గాని గ్రహించలేకపోయారు. తెలియగానే ముందు సింగ్‌కు రాజ్యసభ సీటు మరోసారి ఇవ్వకుండా చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు తేజస్వి సింగ్ ఏదో విషయమై ప్రభుత్వాన్ని నిలదీస్తుండగా నితీష్ సంయమనం కోల్పోయి ‘మాట్లాడమాకు… నాకు సోదరుడి వంటి స్నేహితుడి కుమారుడవు కావడంతో సహిస్తున్నాను..’ అని మాట్లాడారు. అప్పుడు లాలూ సహాయం తీసుకోవాలనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆసుపత్రిలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న లాలూ వద్దకు పరామర్శ పేరుతో వెళ్లి, తనను బిజెపి ఏ విధంగా చేస్తుందో ఆవేదన వ్యక్తం చేశారు. లాలూ మాట్లాడే పరిస్థితిలో లేకపోయినా ‘ఉద్రిక్తత చెందవద్దు.. అన్ని సర్దుకుంటాయి…’ అంటూ అభయమిచ్చారు. ఆ తర్వాత వచ్చిన కొడుకుకు నితీశ్ వెంట నడవమని చెప్పడంతో అప్పటి నుండే వ్యూహాత్మకంగా బిజెపి ఎత్తుగడలను ఎదురుకోవడం గురించి ఆలోచిస్తూ వచ్చారు. ముందుగా, మంత్రివర్గంలోని బిజెపి మంత్రులను తొలగించి, ఆర్‌జెడి వారితో భర్తీ చేయమని సూచించారు. అయితే బిజెపితో కలసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తాను ఆ విధంగా చేయడాన్ని ప్రజలు సహింపరని వెనుకాడారు. మరోవంక, రాజీనామా చేస్తే బిజెపికి చెందిన గవర్నర్ తననే తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయమని ఆహ్వానిస్తారనే హామీ లేదు. ఎందుకంటే, అతి పెద్ద పార్టీగా ముందుగా బిజెపిని ఆహ్వానించవలసి ఉంటుంది.
అందుకనే ముందుగా అసదుద్దీన్ ఒవైసీతో మాట్లాడి, ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎమ్యెల్యేలు ఆర్‌జెడిలో విలీనం అయ్యేటట్లు చూశారు. ఆ విధంగా ఆర్‌జెడి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన తర్వాతనే రాజీనామాకు సిద్ధమయ్యారు. దానితో వెంటనే ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకపోవడం, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో బిజెపి నిస్సహాయంగా ఉండిపోయింది.
బీహార్‌లో కనీసం ఎనిమిది జిల్లాలో జెడి(యు) లేకుండా బిజెపికి సీట్లు గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు వెనుకబడిన వర్గాలు, బాగా వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు బిజెపికి వ్యతిరేకంగా సమీకృతం అవడంతో కేవలం అగ్రవర్ణాలు, పట్టణ ప్రాంత ఓటర్లపై బిజెపి ఆధారపడాల్సి వచ్చింది. మొదట గోవా, తర్వాత మణిపూర్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలలో ఇతర పార్టీల నుండి ఫిరాయింపులను ప్రోత్సహించి అధికారంలోకి రాగలిగారు. అయితే, బిజెపికి మొదటిసారి రాజస్థాన్‌లో ఎదురుదెబ్బ తగిలింది. సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిగా చేయడానికి ఆ పార్టీలోని బలమైన వర్గానికి చెందిన వసుంధర రాజే సిద్ధంగా లేకపోవడంతో సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు బీహార్‌లో ఎన్నికల విజయాలు సాధించడంలో ‘అజేయ జంట’గా భావిస్తున్న మోడీ, అమిత్ షా లకు మొదటిసారిగా బీహార్‌లో ఊహించని విధంగా ఎదురు దెబ్బ తగిలింది. బిజెపికి గల అతి పెద్ద మిత్రపక్షం జెడి(యు) తన దారి తాను చూసుకోవడంతో రెండంకెల ఎంపిలు గల పార్టీ ఏదీ ఇప్పుడు ఎన్‌డిఎ లేకపోవడం గమనార్హం. ఒక విధంగా రాజకీయ యాజమాన్యంలో బిజెపిలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న మోడీ, అమిత్ షాల సామర్ధ్యంపైననే ఆ పార్టీ వర్గాలలో అనుమానాలు చెలరేగే అవకాశాలు ఉన్నాయి.
ఆ ప్రభావం ఎంతో ఘనమైన సంబరాలుగా జరుపుతున్న 75వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని చెప్పుకోదగిన విశేషమైన ప్రకటనలు ఏవీ లేకపోవడంపై కనిపిస్తున్నది. నూతన ఎత్తుగడలు, వ్యూహాలు రూపొందించే సామర్ధ్యం సన్నగిల్లుతున్నదా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏదేమైనా 2024 ఎన్నికల ముందు బీహార్‌లో జరిగిన పరిణామాలు జాతీయ రాజకీయాలపై చెప్పుకోదగిన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఏదో విధంగా బీహార్ ప్రభుత్వంపై తిరిగి తన ఆధిపత్యాన్ని బిజెపి ఏర్పర్చుకోలేని పక్షంలో కీలక వర్గాల మద్దతును కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఒక విధంగా బిజెపి ఇప్పుడు సరికొత్త రాజకీయ సవాల్‌ను ఎదుర్కొంటున్నదని చెప్పవచ్చు. అయితే, ఇప్పుడు బిజెపి ముందున్న సమస్య బీహార్‌లో బలాన్ని సమీకరించుకోవడం కన్నా, నితీశ్ జాతీయ స్థాయి రాజకీయాలలోకి రాకుండా అడ్డుకోవడంగా కనిపిస్తున్నది.
రాహుల్, మమతా, కేజ్రీవాల్ వంటి వారెంత హడావుడి చేసినా వారెవ్వరూ నేడు బిజెపి దృష్టి సారిస్తున్న ఒబిసిల మద్దతు కూడగట్టుకొని విషయంలో ఏమీ చేయలేరు. ఇక్కడనే నితీశ్ ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది. మొదట్లో అటువంటి ప్రయత్నం చేసిన మమతా బెనర్జీని ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయానికి మౌనం వహించేటట్లు చేయగలిగారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించికొని రాజకీయ ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకోవడంకు సహితం కొన్ని పరిమితులు ఉన్నాయని గ్రహించాలి. కర్ణాటకలో సంవత్సరాల తరబడి కేంద్ర సంస్థలు దాడులు జరుపుతున్నా కొందరు నాయకులను దారిలోకి తెచ్చుకోలేకపోతున్నారు. మహారాష్ట్రలో బాల్ థాకరే వారసత్వం లేకుండా చేయడం కోసం ఉద్ధవ్ థాకరే, సంజయ్ రౌత్‌లను సహితం బెదిరింపులతో అడ్డుకోలేకపోతున్నారు. ఆప్ విషయంలో కూడా అదే జరుగుతుంది.

                                                                                            చలసాని నరేంద్ర, 9849569050

Nitish Kumar shock to BJP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News