Sunday, December 22, 2024

నితీశ్ కుమార్ బీహారీలకు క్షమాపణ చెప్పాలి: అసదుద్దీన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం కూటములు మారుతున్న జెడియూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తక్షణమే బీహారీలకు క్షమాపణ చెప్పాలని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్ దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడుతూ నితీశ్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్‌జెడితో తెగదెంపులు చేసుకుని మళ్లీ బిజెపితో చేతులు కలపడాన్ని అసదుద్దీన్ తప్పుపట్టారు. బీహార్ ప్రజలను నితీశ్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇన్నాళ్లు బిజెపి బి టీమ్ ఓవైసి అని విమర్శించిన నితీష్ కుమార్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

‘బిజెపితో జతకట్టడం సిగ్గు అనిపించడం లేదా?’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీశ్ కుమార్‌తో పాటు ఆర్‌జెడి నేత తేజస్వీ యాదవ్, ప్రధాని నరేంద్ర మోడీ కూడా బీహార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నితీశ్ కుమార్ ఎప్పటికైనా మళ్లీ ఎన్‌డిఎలో చేరుతారని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని ఓవైసి గుర్తు చేశారు. యావత్ దేశం తమ చేతుల్లోనే ఉండాలని బిజెపి భావిస్తోందని, అందుకు స్వార్థ రాజకీయ నేతలు ఆ పార్టీని అనుసరిస్తున్నారని అసదుద్దీన్ విమర్శించారు. నలుగురు ఎంఐఎం ఎంఎల్‌ఎలను పార్టీలో చేర్చుకున్న తేజస్వీ యాదవ్‌కు ఆ బాధ ఏమిటో ఇప్పుడు తెలిసి వస్తుందని పేర్కొన్నారు. నితీశ్ కుమార్ బీహార్ ముస్లింలను మరోమారు మోసం చేశాడని, ముస్లింలు, సెక్యులర్ శక్తులు, దళితులు, బిసిలు ఈ విషయాన్ని గమనిస్తున్నారని అసదుద్దీన్ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News