పాట్నా : కాంగ్రెస్ పార్టీ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనే నిమగ్నం కావడంతో విపక్షాల కూటమి “ఇండియా” పై అంతగా దృష్టి పెట్టడం లేదని, ఫలితంగా నిన్నమొన్నటివరకు కనిపించిన “ఇండియా కూటమి” దూకుడును కొనసాగించలేక పోతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ విమర్శించారు. ‘బీజేపీ హటావో దేశ్ బచావో’ పేరుతో పాట్నాలో సిపిఐ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరుపై మండిపడ్డారు. కేంద్రంలో ప్రస్తుత పాలనను వ్యతిరేకించే పార్టీలు కలిసి కొత్త కూటమిగా ఏర్పడిందని, కానీ ఈ కూటమిలోపెద్దగా పురోగతి లేదని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌నే ముందుండి నడిపించేందుకు అందరం అంగీకరించినప్పటికీ, ఈ ఎన్నికల తర్వాతే మళ్లీ సమావేశం ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైనట్టు కనిపిస్తోందన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధతపై ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు. బీజేపీపై ధ్వజమెత్తుతూ దేశ చరిత్రను మార్చేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే వేదికపై ఉన్న సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ కూడా కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. రానున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు వ్యూహంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు.