Monday, December 23, 2024

నమ్మదగిన మిత్రులు లేని నితీష్

- Advertisement -
- Advertisement -

మరోసారి కూటమిని మార్చి, తొమ్మిదో సారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ద్వారా సొంతంగా రాష్ట్ర శాసనసభలో మెజారిటీ తెచ్చుకోలేకపోయినా, చివరకు అతిపెద్ద పార్టీగా ఏర్పడకపోయినా తరచూ కూటములు మార్చడం ద్వారా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిలో ఉండగలగడం ద్వారా జెడియు అధినేత నితీష్ కుమార్ విజయవంతమైన రాజకీయవేత్తగా మనుగడ సాగించగలుగుతున్నారు. అయితే, వివాదాలకు తావులేకుండా మంచి పరిపాలన అందిస్తున్నారని ప్రజలలో ఏర్పర్చుకున్న విశ్వాసాన్ని ఆయన ఈ క్రమంలో పోగొట్టుకున్నట్లు స్పష్టం అవుతుంది. రాజకీయ అవసరాలకోసం ఆయనతో పొత్తు కోసం ఎవ్వరో ఒకరు ముందుకు వస్తున్నా ౠనమ్మదగిన మిత్రులు’ అంటూ లేకుండా మిగిలారని చెప్పవచ్చు. దానితో లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది.

సరిగ్గా సంవత్సరం క్రితం, 2023 జనవరి 30న తాను చావనైనా చస్తాగాని తిరిగి బిజెపితో జత కట్టనని స్పష్టం చేశారు. 2022లో బిజెపితో బంధం తెంచుకొని, ఆర్జేడితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత డిసెంబర్, 2022లో 2025 ఎన్నికలలో ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ నేతృత్వంలో మహాఘట్‌బంధన్ ఎన్నికలకు వెడుతుందని ప్రకటించారు. అంటే, పరోక్షంగా తన రాజకీయ వారసుడు తేజస్వి అనే సంకేతం కూడా ఇచ్చారు.మరోవంక, సరిగ్గా నెల రోజుల క్రితం నితీష్ కుమార్ కు బిజెపి ద్వారాలు శాశ్వతంగా మూసుకు పోయిన్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఒక విధంగా దేశంలో తిరుగులేని పార్టీగా బిజెపి ఉంది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ విశేషంగా పెరిగిందని, తాము 400 లోక్ సభ సీట్లు గెలుచుకుంటామని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కానీ, ప్రాణప్రతిష్ట జరిగిన వారం రోజులకే బీహార్‌లో నితీష్ కుమార్ తో చేతులు గడపడం గమనిస్తే పూర్తి మెజార్టీపై బిజెపి కలత చెందుతుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ౠఇండియా’ కూటమి ఏర్పడినప్పటి నుండి బీజేపీలో అసహనం వ్యక్తం అవుతుంది. ఆ కూటమిలో కీలక నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటాడుతుందనగా, మరోవంక గత పదేళ్లుగా ఉనికి కోల్పోతున్న ఎన్డీయే పరిధిని విస్తరించుకొనేందుకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దక్షిణాదిగా బిజెపికి గల ఏకైక కోట కర్ణాటక చేజారడంతో దిక్కుతోచక గతంలోని ౠచేదు అనుభవాలు’ను దిగమింగి జేడీఎస్‌ను అక్కున చేర్చుకున్నారు. తమిళనాడులో సరికొత్త కూటమి ఏర్పర్చాలనే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. రెండు తెలుగు రాస్త్రాలలో పార్టీ పరిష్టితి అగమ్యగోచరంగా ఉంది. ఇప్పుడున్న సీట్లలో 50కు పైగా కోల్పోయే ప్రమాదం కనిపిస్తుండడంతో వాటిని ఎక్కడ భర్తీ చేసుకోవాలనే ఆందోళన బయలుదేరింది.

అటువంటి సమయంలో తమతో చేతులు కలపకపోతే జెడియు చీలిపోతుందనే భయం సృష్టించి నితీష్ కుమార్‌ను అక్కున చేర్చుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి చిన్నాభిన్నం అవుతున్నది. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ తో సంబంధం లేకుండా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. రామమందిరం కారణంగా బిజెపి బలోపేతం కావడం నితీష్ కుమార్‌కు ఆందోళన కలిగించవచ్చు. అదేసమయంలో బిజెపి సహితం నితీష్ కుమార్ లేకుండా ఎన్నికలకు వెడితే బీహార్ లో భారీ నష్టం చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నట్లు స్పష్టం అవుతుంది. నితీష్ కుమార్ ఏ కూటమిలో ఉంటె ఆ కూటమికి కనీసం 20 లోక్ సభ సీట్లను గెలిపించే సత్తా ఉంది. అందుకనే బిజెపి ఆయన వెంట పడింది.
2020 అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఒక వంక తనతో పొత్తు పెట్టుకుంటూనే మరోవంక ప్రధాని మోదీకి ౠహనుమంతుడు’ మాదిరిగా మారిన చిరాగ్ పాశ్వాన్‌ను ప్రయోగించి, జెడియు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టించి, అతితక్కువగా 43 స్థానాలకు పరిమితం చేయించారని నితీష్ ఆగ్రహంతో ఉన్నారు.

కనీసం 25 స్థానాలను చిరాగ్ పాశ్వాన్ కారణంగా కోల్పోయారు. అదే సమయంలో తొలిసారి బీజేపీ అత్యధికంగా 74 సీట్లు గెల్చుకుంది. అతిపెద్ద పార్టీగా గెలిచినా ఆర్జేడీ కన్నా 1 సీట్ మాత్రమే తక్కువ. మరోవంక, జెడియును కట్టడి చేయడంలో విశేష పాత్ర పోషించిన పాశ్వాన్ బాబాయి పశుపతి కుమార్ పరస్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రాజకీయంగా నితీష్ కుమార్ ను తుదముట్టించడం కోసం బిజెపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు గ్రహించే హడావుడిగా ఆగష్టు, 2022లో బిజెపితో బంధం తెంచుకొని, ఆర్జేడీ, కాంగ్రెస్ లతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు.అయితే, సామజిక కలయికల ప్రాతిపదికన బీజేపీకి వ్యతిరేకంగా పోటీచేస్తే తాము ఓటమి చెందుతామని కనీసం ఏడుగురు జెడియు ఎంపీలు భయపడుతున్నారు. అందుకనే జెడియు ఎంపీలు, ఎంపీలలో కనీసం సగం మంది బీజేపీతో చేరకపోతే పార్టీని చీల్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. దానితో తన పార్టీని కాపాడుకొనేందుకు నితీష్ కుమార్ కు మరోసారి బిజెపితో చేతులు కలపక తప్పలేదు.

అయితే, కేవలం లోక్ సభ ఎన్నికల వరకు మాత్రమే కనీసం 15 శాతం ఓట్లు ఉన్న నితీష్ కుమార్ అవసరం బిజెపికి ఉంది. ఆ తర్వాత ఏదోవిధంగా నితీష్ ను గద్దె దించి బీజేపీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసేందుకు పావులు కడుపుతారు. అప్పుడు బిజెపి ఎత్తుగడలను తట్టుకోవడం నితీష్ కు సాధ్యం కాకపోవచ్చు.ఇప్పుడు బిజెపి ఎంపిక చేసిన ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను చూస్తే ఆ పార్టీ ఉద్దేశ్యం వెల్లడి అవుతుంది. వారిద్దరూ నితీష్ ను రాజకీయంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారే. రాష్ట్ర శాసనమండలిలో తలకు ఓ రిబ్బెన్ కట్టుకున్న ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఉద్దేశించి ఎందుకని నితీష్ అడిగితే, ౠమిమ్ములను గద్దె దింపాలని దీక్ష చేపట్టాను. గద్దె దింపిన తర్వాతనే దానిని తీస్తాను’ అని స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా కూడా అదే రిబ్బన్ తో కనిపిస్తున్నారు. ఇక, రెండో ఉపముఖ్యమంత్రి విజయ్ సిన్హా గతంలో బిజెపితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన్నప్పుడు స్పీకర్ గా ఉంటూ ముఖ్యమంత్రి నితీష్‌ను ఎన్నో ఇబ్బందులకు సభలో గురిచేశారు. ఇప్పుడు కూడా అదే మిషన్ లో ఉన్నారని చెప్పవచ్చు.

బలమైన ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం ద్వారానే తాము బలం పెంచుకోగలమని పలు రాస్త్రాలలో బిజెపి వ్యూహాత్మకంగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగానే బీహార్ లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు చొరవ తీసుకున్నట్లు కనిపిస్తుంది.
ఇటువంటి ప్రయత్నాలనే తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాస్త్రాలలో కూడా బిజెపి చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ సొంత బలంపై ప్రభుత్వాలు ఏర్పాటు చేయలేక పోవడం గమనార్హం. కేవలం కాంగ్రెస్ ఆధిపత్యం నెలకొన్న రాష్ట్రాలలోని ఆ పార్టీ పుంజుకోగలుగుతున్నది.అందుకనే జేడీయూ- బీజేపీ కొత్త పొత్తు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఉండదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే ఆ రెండు పార్టీలు మళ్లీ విడిపోతాయని స్పష్టం చేశారు.

జేడీయూ పార్టీ కథ త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఖతం అవుతుందని మొన్నటివరకు నితీష్ మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వీ యాదవ్ కూడా తేల్చి చెప్పారు. ‘ఒక్కటి అయితే స్పష్టంగా చెబుతున్నాను. ఆట ఇప్పుడే మొదలైంది. జరుగాల్సింది ఇంకా చాలా ఉన్నది’ అని చెప్పడం గమనిస్తే ఈ కొత్త ప్రభుత్వంకు ప్రజా మద్దతు లభించే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.రాజకీయంగా తన ఉన్నతికి సహకరించిన నాయకులు అందరిని దగా చేయడం ద్వారానే నితీష్ కుమార్ సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండగలిగారు. ఆ విధంగా ఆయన దగాచేసిన నేతలలో లాలూ యాదవ్, జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్, ఆర్ సి పి సింగ్, ప్రశాంత్ కిషోర్ వంటివారు ఉన్నారు. అందుకనే ఇప్పుడు సొంత పార్టీ నేతలే ఆయనను విశ్వసింపలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. దానితో లోక్ సభ ఎన్నికల అనంతరం రాజకీయ మనుగడ ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది.

ఇండియా కూటమి ఏర్పాటుకు మొదట్లో చొరవ తీసుకొని, దానితో తిరుగులేని నాయకుడిగా తనను అంగీకరించేందుకు మిగిలిన వారెవ్వరూ ఇష్టపడక పోవడం, ముఖ్యంగా తనను ప్రధాని అభ్యర్థిగా ఎవ్వరూ ప్రతిపాదించక పోవడంతో ఇప్పుడు ఆ కూటమిని చిన్నాభిన్నం చేసేందుకు బిజెపితో చేతులు కలిపారు.బిజెపి సహితం మొదటి నుండి ఒక వంక నితీష్ తో పొత్తు పెట్టుకొంటూ, మరోవంక రామవిలాస్ పాశ్వాన్ కుటుంబాన్ని ప్రోత్సహిస్తూ కపట నాటకం ఆడుతూ వస్తున్నది. గతంలో మొదటిసారి ఎల్ కె అద్వానీ సమయంలో ఆ విధంగా జరిగింది. వాజపేయి ప్రోత్సాహంతో నితీష్ తో పొత్తు పెట్టుకోగా, అద్వానీ రాంవిలాస్ పాశ్వాన్ ను ముఖ్యమంత్రి పదవి పొందవచ్చని ప్రోత్సహించి విడిగా పోటీచేసేటట్లు చేసి ఎవ్వరూ గెలవకుండా చేశారు. గత ఎన్నికలలో సహితం నితీష్ తో పొత్తు పెట్టుకొంటూనే చిరాగ్ పాశ్వాన్ ద్వారా నితీష్ కు తగినన్ని సీట్లు రాకుండా కట్టడి చేశారు. నితీష్ వ్యతిరేకులకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. దానితో జేడీయులో చాలామంది నేతలు బిజెపితో కన్నా ఆర్జేడీతో చేతులు కలిపేందుకు సుముఖంగా కనిపిస్తున్నారు. దానితో లోక్ సభ ఎన్నికల అనంతరం బీహార్ లో రాజకీయ శక్తుల పునరేకీకరణ జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News