Sunday, December 22, 2024

మళ్ళీ ఏకమవుతారా?

- Advertisement -
- Advertisement -

ప్రతిపక్ష ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) వ్యూహకర్త, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా తిరిగి బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమిలో చేరిపోడం జాతీయ ప్రతిక్షాన్ని అసాధారణంగా దెబ్బతీసింది. బెంగాల్‌లో మమతా బెనర్జీ తీసుకొన్న వైఖరి కాంగ్రెస్‌ను ఒంటరిని చేసింది. అదే విధంగా ఆప్ కూడా కాంగ్రెస్‌కు దూరంగా వుండాలని నిర్ణయించుకొన్నట్టు బయటపడింది. యుపిలో సమాజ్‌వాది పార్టీ ధోరణి సైతం ఇలాగే ఉండడంతో బిజెపికి వ్యతిరేకంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఉమ్మడి ఓటును కూడగట్టాలనే మహాఘట్ బంధన్ ఎత్తుగడ చిత్తయిపోతున్నది. నితీశ్ కుమార్‌ను మళ్ళీ తమ శిబిరంలో చేర్చుకోవడంలోనే ఉమ్మడి ఓటు వ్యూహం బిజెపిని ఎంతగా భయపెట్టిందో వెల్లడయింది. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా వైభవోపేతంగా, దిగ్విజయంగా జరిపించడంతో, రాముడిపట్ల దేశమంతటా ప్రజల్లో గల భక్తిభావం ఈ సందర్భంలో పెల్లుబికి కనిపించింది.

అది బిజెపి ఓటు బ్యాంకును విశేషంగా పెంచి గతం కంటె ఎక్కువగా లోక్‌సభలోని 400 స్థానాలను దానికి కట్టబెట్టగలదనే అంచనాలు బలపడడం ప్రారంభించాయి. ఒకవైపు ఛిన్నాభిన్న శిధిల ప్రతిపక్షం, మరోవైపు తన పాలనా వైఫల్యాలతో నిమిత్తం లేకుండా ప్రజాబలాన్ని పెంచుకొంటున్నదనే ప్రచారంతో బిజెపి ఎన్నటికంటే ఎక్కువ ఉత్సాహంతో గోడకు కొట్టిన బంతిని తలపిస్తున్నది. నితీశ్ కుమార్‌ను విడిచిపెడితే ప్రతిపక్ష నేతలందరికీ బిజెపిపట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నమాటవాస్తవం. దానిని మళ్ళీ కేంద్రంలో అధికారానికి రానిస్తే ఇడి, సిబిఐల ద్వారా తమ మీద కక్ష సాధింపును మరింత పెంచి మిగిలిన కాస్త ఫెడరల్ నీతిని నమిలిమింగుతుందని, సెక్యులర్ రాజ్యాంగ ఆశయానికి సమాధి కడుతుందని వారికి తెలుసు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఇడి చేత అరెస్టు చేయించడంలో దేశాన్ని ప్రతిపక్ష రహితంగా మార్చాలనే బిజెపి పట్టుదల, దాని నిరంకుశత్వ పరాకాష్ఠ నగ్నంగా బయటపడ్డాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్టు చేయించే ప్రమాదం లేకపోలేదు.

భారత దేశమంతటా ప్రజలు బిజెపి పాలనలో తాము ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని దానిని ఓడించే అవకాశాలు ఉన్నాయా, ఓటర్లలో అంతటి చైతన్యం కలుగుతుందా అంటే అటువంటి సూచనలు ఇప్పటికైతే బలంగా లేవు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీని కసిగా ఓడించినప్పటి మాదిరి వివేచన ఇప్పుడు ప్రజల్లో వెల్లివిరుస్తుందని అనిపించడం లేదు. రెండు మాసాల క్రితం జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతుందనుకొన్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపి ఊహించని విజయాలు సాధించింది. కాంగ్రెస్ పరాజయం పాలయింది. లోక్‌సభ ఎన్నికలలో రాగల ఫలితాలకు అవి సూచికలని భావించినవారు నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి విజయం, ప్రధానిగా ఆయన హ్యాట్రిక్ ఖాయమనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల శాసన సభ ఎన్నికల్లో గెలిచినా ఆ తర్వాత జరిగిన లోక్‌సభ (2019) బరిలో కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయిన గత అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవలసి వుంది. ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలో ఒక విధమైన తీర్పును ఇచ్చి లోక్‌సభకు మరో రకంగా వ్యక్తం కావడానికే ఎక్కువ అవకాశాలుంటాయి.

అయితే బిజెపి తమను ఎన్ని బాధలు పెట్టినా హిందుత్వ ఆకర్షణకు లొంగిపోయి ఉత్తరాది ఓటర్లు దానినే గెలిపిస్తున్న సత్యాన్నీ గమనించాలి. 80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌ను గంపగుత్తగా తన ఖాతాలో వేసుకోగలనన్న బిజెపి ధీమాకు ఇదే కారణం. గత ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోయిన కఠోర సత్యం గుర్తుంచుకోదగినది. అటువంటి దయనీయ పరిస్థితి నుంచి ఉత్తరాదిలో కాంగ్రెస్ కోలుకోవాలంటే ఒకప్పటి మాదిరిగా ముస్లిం ఓటు దాని వెంట సంఘటితం కావాలి. బిజెపి నుంచి ఆత్మరక్షణ కోసమైనా వారు ఒక్క త్రాటిపైకి వచ్చి కాంగ్రెస్‌కి ఓటు వేయాలి. అలాగే యువత, స్త్రీ ఓటర్లు బిజెపిపట్ల సరైన అవగాహనతో ప్రతిపక్షాన్ని గెలిపించాలి. దేశమంతటా 250300 స్థానాల్లో బిజెపితో ఢీ కొనగల శక్తి ఒక కాంగ్రెస్ పార్టీయే. అందుచేత ఐక్యత కోసం ప్రతిపక్షాలు మళ్ళీ ప్రయత్నించడానికి తలుపులు పూర్తిగా మూసుకు పోలేదు. బిజెపియేతర పక్షాల మధ్య పునరైక్యత కోసం శరద్ పవార్ వంటివారో తలచుకోవలసి ఉంది. అయితే బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర నిర్వహించడం మమతా బెనర్జీని ఆగ్రహానికి గురి చేసింది.

సీట్ల సర్దుబాటుపై తన ప్రతిపాదనను కాదని కాంగ్రెస్ పార్టీ బెంగాల్‌లో ముస్లిం ఓట్ల కోసం వల వేస్తున్నదని, ఉత్తరాదిలో బిజెపిని ఎదుర్కొనే దమ్ము దానికి లేదని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దానికి 40 సీట్లు కూడా దక్కవని ఆమె అన్నారు. ఈ పరిస్థితుల్లో ఐక్యతా యత్నాలు మళ్ళీ ప్రారంభమై విజయవంతం కాగలవా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News