ఆస్తులలో 13 ఆవులు, 2 బంగారు ఉంగరాలు, ఒక ట్రెడ్ మిల్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మొత్తం ఆస్తుల విలువ కేవలంరూ. 1.64 కోట్లు మాత్రమే. ఈ విషయాన్ని క్యాబినెట్ సచివాలయం శాఖ ఆదివారం సాయంత్రం తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. నితీశ్ కుమార్ వద్ద రూ. 22,552 నగదు, వివిధ బ్యాంకుల ఖాతాలలో రూ. 49,202 డిపాజిట్లు ఉన్నాయి. ఆయన ఇతర ఆస్తుల వివరాల ప్రకారం రూ. 11.31 లక్షల విలువచేసే ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు, రూ. 1.28 లక్షల విలువైన రెండు బంగారు ఉంగరాలు, ఒక వెండి ఉంగరం ఉన్నాయి.
ఇతర చరాస్తులలో రూ. 1.45 లక్షల విలువైన 13 ఆవులు, 10 దూడలు, వ్యాయామం చేయడానికి ఉపయోగించే ఒక ట్రెడ్‌మిల్, ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఉన్నట్లు నితీశ్ ప్రకటించారు. ఆయనకు ఉన్న ఏకైన స్థిరాస్తి న్యూఢిల్లీలోని ద్వారకలో ఒక ఆపార్ట్‌మెంట్ ఫ్లాట్. దీని విలువ 2004లో రూ. 13.78 లక్షలు ఉండగా ఇప్పుడు దీని విలువ రూ. 1.48 కోట్లు. గత ఏడాది నితీశ్ కుమార్ మొత్తం ఆస్తుల విలువ రూ.75.53 లక్షలు ఉండగా ఢఙల్లీ అపార్ట్‌మెంట్ విలువ పెరగడంతో ఆయన ఆస్తుల విలువ కూడా పెరిగింది.
ప్రతి ఏడాది ముగింపు రోజున(డిసెంబర్ 31) తన క్యాబినెట్‌లోని మంత్రులందరూ తమ ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించాలని నితీశ్ కుమార్ ప్రభుత్వం గత ఏడాది తప్పనిసరి చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్‌జెడి నేత తేజస్వి ప్రసాద్ యాదవ్ 2022-23లో తన ఆదాయం రూ.4.74 లక్షలని చూపారు. ఆయన సోదరుడు, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి కూడా ఆఅయిన తేజ్ ప్రతాప్ తనకు రూ. 3.58 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చూపారు.