పట్నా: బిహార్ సీఎం నితీశ్ కుమార్ సోమవారం ఆర్‌జెడి అధ్యక్షుడు లాలు ప్రసాద్‌తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత కోరుతూ నితీశ్ ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముందు లాలుతో నితీశ్ భేటీ అవడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. లాలు నివాసానికి వెళ్లిన నితీశ్‌కు మాజీ సిఎం రబ్రీదేవితోపాటు లాలు దంపతుల చిన్నకుమారుడు, డిప్యూటీ సిఎం తేజస్వి యాదవ్ స్వాగతం పలికారు. గౌరవనీయులైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఆర్‌జెడి జాతీయ అధ్యక్షుడు లాలు ప్రసాద్‌ను కలిసేందుకు తమ గృహానికి వచ్చారని తేజస్వి ట్వీట్ చేశారు. పూర్వ ప్రత్యర్థులైన లాలు, నితీశ్ ఫొటోలను సోషల్‌మీడియాలో తేజస్వి షేర్ చేశారు. కాగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలు త్వరలో సింగపూర్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ చేయించుకోనున్నారు. జులైలో భుజానికి తగిలిన గాయం నుంచి కోలుకున్న లాలు నితీశ్‌తో సమావేశమయ్యారు.
గత నెలలో బిజెపి కూటమి నుంచి నితీశ్ వైదొలిగారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని కాషాయపార్టీకి వ్యతిరేకంగా దేశంలోని విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు నితీశ్ కృషి చేస్తున్నారు. ఈక్రమంలో గత వారం తెలంగాణ సిఎం కెసిఆర్‌తో నితీశ్ సమావేశమయ్యారు. ఈనేపథ్యంలో వారు బిజెపి ముక్త్ భారత్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ కాషాయపార్టీతోపాటు కాంగ్రెస్‌తోనూ పోరాడుతున్నారు. ఈనేపథ్యంలో థర్డ్‌ఫ్రంట్‌పై పెద్దగా ఆసక్తి చూపని నితీశ్ కాంగ్రెస్‌పార్టీతో కలిసి ముందుకువెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందనేది వేచి చూడాలి. ప్రస్తుతం నితీశ్ బిహార్‌లో కాంగ్రెస్, వామపక్షాలతోపాటు ఏడు పార్టీల కూటమికి నేతృత్వం వహిస్తున్నారు. కాగా నితీశ్ ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ కేజ్రీవాల్, ఇతర పార్టీ నేతలతో సమావేశం కానున్నారు.