Monday, January 20, 2025

నితీశ్ అసంతృప్తి చెందారన్న వార్తలు అవాస్తవం: జెడియు

- Advertisement -
- Advertisement -

పాట్నా: బెంగళూరులో జరిగిన ప్రతిపక్షాల సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు వస్తున్న వార్తలను ఆయనతోపాటు సమావేశంలో పాల్గొన్న జనతా దళ్(యు) అధ్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ లలన్ బుధవారం తీవ్రంగా ఖండించారు.

ప్రతిపక్ష కూటమికి ఇండియా(ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూసివ్ అలయన్స్) అని నామకరణం చేయడం, తనను కొత్త కూటమికి కన్వీనర్‌గా ప్రకటించడకపోవడం పల్ల నితీశ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలను బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ చేస్తున్న దుష్ప్రచారంగా ఆయన అభివర్ణించారు. బుధవారం పాట్నాలో లలన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ సృష్టిస్తున్న దుష్ప్రచారం, వదంతులని ఆరోపించారు. బెంగళూరు భేటీకి హాజరైన ప్రతిపక్ష నాయకులందరి ఏకగ్రీవ ఆమోదంతోనే ఇండియా పేరు పెట్టినట్లు లలన్ స్పష్టం చేశారు.

ప్రతిపక్ష కూటమికి కన్వీనర్‌గా తన పేరును ప్రకగించనందుకు నితీశ్ కుమార్ అసంతృప్తిగా ఉన్నారన్న వార్తలను ప్రస్తావిస్తూ మంగళవారం నాటి బెంగళూరు సమావేశంలో ఆ అజెండా లేనేలేదని, ముంబైలో జరిగే తదుపరి సమావేశంలో దీని గురించి చర్చించాలని నిర్ణయించుకున్నామని ఆయన తెలిపారు. కన్వీనర్‌గా ప్రకటించలేదన్న అసంతృప్తితోనే ఉమ్మడి విలేకరుల సమావేశాన్ని నితీశ్ కుమార్ బహిష్కరించారన్న బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోడీ వ్యాఖ్యలను లలన్ ఖండించారు. సుశీల్ మోడీని ప్రచారం కోసం పాకులాడే రోగిగా ఆయన అభివర్ణించారు.

ప్రతిపక్షాల ఐక్యతకు సూత్రధారి అయిన నితీశ్ కుమార్ ఎందుకు ఆగ్రహం చెందుతారని లలన్ ప్రశ్నించారు. బెంగళూరులో ప్రతిపక్షాల సమావేశం జరిగిన రోజే ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో ఎన్డీయే సమావేశం నిర్వహించడం ఆయన నిస్పృహకు నిదర్శనమని లలన్ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఎన్డీయే సమావేశం జరగడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ప్రాంతీయ పార్టీలను అవినీతి కుటుంబాలంటూ విమర్శించిన ప్రధాని మోడీ ఆ కుటుంబాలకు చెందిన వారినే తన కూటమిలో చేర్చుకుంటున్నారని పరోక్షంగా అజిత్ పవార్‌ను ప్రస్తావిస్తూ ఎద్దేవా చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News