Wednesday, November 6, 2024

కేజ్రీవాల్‌తో భేటీకానున్న నితీశ్ కుమార్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల మధ్య ఐక్యతను తీసుకురావడంలో కీలక భూమిక పోషించిన బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీశ్ కుమార్ బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు మరికొందరు ఇండియా కూటమి నేతలతో భేటీ కానున్నారు.

రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత మొట్టమొదటిసారి కేజ్రీవాల్‌ను నితీశ్ కలుసుకోనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి వ్యతిరేకంగా సమైక్యంగా పోటీచేయనున్న ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన కొందరు నాయకులతో కూడా నితీశ్ సమావేశం కానున్నారు. నితీశ్ వెంట ఆయన మంత్రివర్గ సహచరులు కొందరు ఉండనున్నారు. వాజపేయి ప్రభుత్వంలో రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన నితీశ్ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి స్మారకాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నారు.

ఇలా ఉండగా బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను ఆయన కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మీసా భారతి నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలుసుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో జరగనున్న ఇండియా కూటమి తదుపరి సమావేశం ఏర్పాట్లపై వీరిద్దరూ చర్చించినట్లు తెలిసింది.

ప్రతిపక్ష కూటమి మొదటి సమావేశం పాట్నాలో నితీశ్ కుమార్ అధికారిక నివాసంలో జరిగింది. రెండవ సమావేశం బెంగళూరులో జరిగింది. ఈ సమావేశంలో కూటమికి ఇండియా అని పేరు పెట్టారు. ముంబైలో జరిగే తదుపరి సమావేశంలో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల పంపకం గురించి చర్చించి ఖరారు చేయనున్నట్లు నితీశ్ కుమార్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News