18న హైదరాబాద్‌లో అంత్యక్రియలు
మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచారు. శనివారం రాత్రి 10.30 గంటలకు టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచినట్లు హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఆయన కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్‌లోని ఆసఫ్ జాహీ ఫ్యామిలి టూంబ్స్ (మక్కా మసీదు) లో తండ్రి సమాధి పక్కన ఖననం చేయనున్నారు. మముకరంజా వయస్సు 89 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించింది. ముకరంజా పార్థివదేహాన్ని ఈ నెల 17న టర్కీ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక ఫ్లైట్‌లో తీసుకువస్తారు.
అక్కడి ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నారు. బుధవారం సాయంత్రం మక్కా మసీదులో అసర్ నమాజ్‌ఎ జనాజ తర్వాత అయన తండ్రి సమాధి పక్కన ఖననం చేస్తారు. కాగా హైదరాబాద్ చివరి నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్‌కు ముకరం జా బహదూర్ మనుమడు, ముకరంజా అసలు పేరు మీర్ బర్కత్ అలీ ఖాన్. మీర్ హిమాయత్ అలీ ఖాన్ ఉర్ఫ్ ఆజం జా బహాదూర్, న్రిన్సెస్ దుర్రె షెవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకరంజా జన్మించారు. 1954 జూన్ 14న ప్రిన్స్ ముకరం జా ను తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారసుడిగా ప్రకటించారు. దీంతో 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా పిలువబడ్డారు. 1954 నుంచి ముకం జా హైదరాబాద్‌కు ఎనిమిదో రాజుగా గుర్తింపు పొందారు.
ముకరమ్ జా మరణం పట్ల కెసిఆర్ సంతాపం
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం… ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతుల కుమారుడు ముకరమ్ జా మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకరమ్ జా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.
టర్కీలోని ఇస్తాంబుల్‌లో మరణించిన ముకరమ్ జా పార్థివదేహం హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత, వారి కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు అంత్యక్రియల సమయాన్ని, స్థలాన్ని నిర్దారించి తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్‌కు సిఎం లసూచించారు. సిఎం ఆదేశాల మేరకు అందుకు సంబంధించి అంశాలపై ఖాన్ సమన్వయం చేస్తున్నారు.
ముంత్రుల సంతాపం
ఎనిమిదో నిజాం ముకరం జా బహదూర్ మృతి పట్ల హాంమంత్రి మొహమ్మద్ మహబూద్ అలీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శోక సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు అండగా ఉంటానన్నారు. ఆయన పూర్వీకులను ఖననం చేసిన మక్కా మసీదులో అతనిని ఖననం చేయనున్నట్లు తెలిపారు. సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
అంత్యక్రియల ఏర్పాట్ల పరిశీలించిన సలీం
ఎనిమిదో నిజాం ముకరం జా అంత్యక్రియల ఏర్పాట్లను హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ సీలీ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ముకరం జా పార్థివదేహాన్ని ప్రజల దర్శనార్థం ఉంచనున్న చౌమొహల్లా ప్యాలెస్‌ను సందర్శించారు. అక్కడి ఏర్పాట్లను పరిశీలంచారు. ఈ నెల 17న ప్రైవేట్ జెట్‌విమానంలో ముకరం జా పార్థివదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో రాజకుమారి ఎస్రాబెగం, ఫై.జ్ ఖాన్, మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎకె ఖాన్, విక్రమ్‌సింగ్ మాన్, తదితరులు ఉన్నారు.