లండన్: దివంగత బ్రిటన్ మహారాణి ఎలిజబెత్2 ఒక్కో సందర్భంలో ఒక్కో అలంకరణతో దర్శనమిచ్చే వారు. ఆమె ధరించే దుస్తులతో పాటుగా ధరించే ఆభరణాలుకూడా అందరి దృష్టిని ఆకర్షించేవి. అందులో 300 వజ్రాలు పొదిగిన ప్లాటినం నెక్లెస్ కూడా ఒకటి. ఈ హారం గురించి ప్రధానంగా ప్రస్తావించడానికి కారణం దానికి మన హైదరాబాద్‌తో సంబంధం ఉండడమే. 1947లో ఎలిజబెత్ వివాహం జరిగింది. అప్పుడు హైదరాబాద్ నిజాం నవాబు ఏడవ అసఫ్ జా ఆమెకు వివాహ బహుమతి అందించారు. తనకు నచ్చిన బహుమతిని ఎంచుకోవాలని ఎలిజబెత్‌ను నవాబు కోరారు.ఆయన కోరిక మేరకు 300 వజ్రాలు పొదిగిన ప్లాటినం నెక్లెస్‌ను రాణి ఎంచుకున్నారు. ఆమెకున్న అత్యంత విలువైన ఆభరణాల్లో ఒకటైన దీనిని ఫ్రాన్స్‌కు చెందిన సంస్థ రూపొందించింది. ఈ హారం ధరించి ఎలిజబెత్ చిత్రాలను జులై 21న రాయల్ ఫ్యామిలీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అందులో బ్రిటన్ రాణిగా పట్టాభిషేకం అనంతరం దిగిన ఫొటో కూడా ఉంది. ఆ సమయంలో ఆమె మెడలో ఈ వజ్రాల హారమే ఉంది.ఆమెతో పాటుగా మనవడి సతీమణి కేట్ మిడిల్టన్ ఈ నెక్లెస్ ధరించి దిగిన ఫొటో కూడా ఉంది.ఆ పోస్టు పొందుపరచిన వివరాల్లో ఇది నిజాం నవాబునుంచి అందిన బహుమతిగా పేర్కొన్నారు.