ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర దిశలో ఆదిలాబాద్‌కు దక్షిణంగా ఉంది. తూర్పున కరీంనగర్, దక్షిణాన మెదక్, పడమరకు మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాలు ఉన్నాయి. అందువల్ల అవిభక్త నిజామాబాద్ ప్రాంత భాషా వ్యవహారంలో చుట్టు ప్రక్కల ప్రదేశాల నుండి వచ్చి చేరిన పదాలతో పాటు ఇందూరుకే ప్రత్యేకమైన పలుకులు కూడా ఉన్నాయి.
“తినాలి”, “పెట్టాలి”… మొదలైన వాటిని భాషలో నిశ్చయార్థకాలు అని అనడం కద్దు. చిత్రంగా నిజామాబాద్ జిల్లా మద్నూరు ప్రాంత ప్రజలు కొందరు “తిన్వాల, పెట్వాల” అంటున్నారు. వాస్తవంగా.. ఈ నిశ్చయార్థకాలు “తినవలయును, పెట్టవలయును” అనే మూల రూపాల నుండి వచ్చినవి. “తినవలయును”.. ఆ తర్వాత “తినవలయు” ఇంకా ఆ పైన “తినవలె”… ఈ రకమైన మార్పులకు గురైంది. ఆధునిక ప్రామాణిక భాషలో “తినవలె” అనేది “తినాలి”గా మారితే, కరీంనగర్ వైపు “తినాలె”గా ఉంటే, నిజామాబాద్‌లో “తినాల”గా ఉంది.
కానీ అదే జిల్లాలోని మద్నూరు ప్రాంతలో “తిన్వాల” అని ఉంది. “తినవలె”లోని వకారాన్ని అలాగే ఉంచుకొని, నకారంలోని అకారం “వ”తో కలిసి దీర్ఘంగా మారింది. ఆ తర్వాత అది “తిన్వాల”గా పరిణమించింది. అంటే మూల రూపంలోని వకారాన్ని పదిలంగా నిలుపుకున్న రూపమిది. ఈ మద్నూరు ప్రదేశంలోనే కొంత మంది “తన్నుతారు” అనే అర్థంలో “తండత” అంటున్నారు. తెలంగాణ అంతటా దాదాపు అందరూ “తంత” అని వ్యవహరిస్తారు. ఇక్కడేమైంది అంటే… “తన్నుతా (ను(లోని “న్ను”, “ండు”గా మారి “తండుతా” ఐంది. తర్వాత చివరి “తా”లోని దీర్ఘం పోయింది. ఆ చివరి “త”లోని అకారాన్ని చూసి “ండు” లోని ఉకారం తన ఆకారం మార్చుకుని ఆఖరున “తండత” అని అవతారం తాల్చింది.
భాషా విషయాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. “ఉండిన వాడు” అనే ప్రాచీనమైన పలుకు ఆ తర్వాత “ఉన్నవాడు” కాలేదూ! (ఇంకా ఆ తర్వాత ఉన్నాడు/ ఉన్నడుగా మారింది. “ఉండిన’ అనేది “ఉన్న” గా మారడం ఒక పద్ధతి. “తన్నుత’ అన్నది “తండత” కావడం దానికి విపరీత పద్ధతి. గణితంలో ఏ సమానం బి ఐతే, బి సమానం ఏ అవుతుందని ఓ సూత్రం. ఇట్లా న, ణ, డల మధ్య మార్పులుంటాయి. సామాన్యం, రామాయణం, వ్రణం, ఋణం… మొదలైనవి సామాన్య ప్రజల భాషలో సామాండెం, రామాండెం, రడం, రుడం… ఇట్లా మార్పుకు గురైనాయి”. సబ్బండ కులాలు అనేది కూడా “సబ్ వర్ణ కులాలు” నుండి ఆవిర్భవించి ఉంటుంది. అన్నట్టు… ఆధునిక ప్రామాణిక భాషలో “మిన్నకుండపోయాడు’ వంటి వాక్యాలను కాల్పనిక సాహిత్యంలో చదువుతుంటాము. అంటే ఊరకున్నాడు ఏమీ మాట్లాడకుండా అని. చిత్రగా ఈ “మిన్నక’ మలయాళంలో “మిండాతె”. అర్థమొక్కటే! మిండాతె ఇరిక్కూ” అంటే మాట్లాడకుండా ఉండమని. అంటే మలయాళం “మిండాతె”, తెలుగులో “మిన్నక” ఐంది. ఇట్లా “న్న” మరియు “ండ”లు పరస్పరం మారుతూ ఉంటాయి.
ఎందుకు, దేనికి అనే అర్థంలో నిజామాబాద్‌లో “ఏంటికి?” అంటారు. ఇది “ఏమిటికి?” నుండి ఏ ర్పడిన రూపం. “మళ్లీ” అనే మాట ఇక్కడ “మర్ర’ రూపంలో ప్రయుక్తం అవుతున్నది. మూల రూపం “మరల” కదా! తెలంగాణలో దాదాపుగా యితర ప్రాంతాల్లో ఈ “మరల” వర్ణ సమీకరణం జరిగి “మల్ల”గా ఉంది (కలదు కద్దు; వలదు వద్దు; కొలది కొద్ది; మొలక మొక్క) నిజామాబాద్‌లోని కామారెడ్డి ప్రాంతాల్లో ‘మర్ర” ఉంది. అంటే… “మరల”లోని చివరి “ల” పోయి, రెండవ “ర” ద్విత్వంగా మారింది.
“ఏడు” అనే సంఖ్యా వాచకం “యోడు”గా పలుకబడుతుంది. “ఎవలు” (ఎవరు) అనే మాట “ఓల్లు” గా వినవస్తున్నది. ఈ పదాల మొదటి ఎకారం ఎకాయెకి ఒకారంగా పర్యవసిస్తున్నది. “యోడు” అనే నుడిలో పదాది యకారం ప్రత్యేకంగా పరిశీలనార్హం. “కొంత” అనే అర్థ ఛాయతో “తోడెం” ఉంది. చిన్నయ సూరి సైతం “తోడెంబు తోడెనె ప్రొద్దు పుచ్చుకొని యెద” అన్నారు. శబ్ధరత్నాకర కారుడు అందుకే ఈ మాటలను దేశ్యంగా గుర్తించాడు. మరి హిందీ “థోడా”కు ఇదే మూల రూపమా? ఆలోచించాలి. కామారెడ్డి పరిసరాల్లో “నిన్ననే” తిన వచ్చిండు” అంటున్నారు.
ఇక్కడ “తిన” వచ్చిండు అంటే తినేందుకు వచ్చాడని కాదు “అతను” వచ్చాడని అర్థం. “తిన” అంటే అతను, తను అని. “నిన్ననే తను వచ్చాడు”అనే మాట తీరుంది కొన్నప్రాంతాల్లో. మరి.. ఈ “తిన” అనే పదం “తను”కు రూపాంతరమా? ఆ .. తను కూడా “అతను” నుండి ఉత్పన్నమైందా పరిశీలించాలి. అంతేగాక, బెంగాలీలో “తిని” అంటే అతను. ఆ వంగ భాషీయుల “తిని” మనం తినేశామా కూడా పరిశోధించాలి.
నిజామాబాద్‌లో ఆడపిల్ల పెద్ద పెరగ్గానే “ఒల్లె కట్టిస్తారు”. ఇదొక సంస్కృతిపరమైన వేడుక. “ఒల్లె” అంటే చిన్న చీర. “ఒల్లె” కు మూలం “ఒల్లియ” అర్థాలు వస్త్రము, ఉత్తరీయము అని శబ్ద రత్నాకరం. అది క్రమంగా ఇందూరులో చిన్న చీరకు పరిమితమైంది.
పడక మీద పరిచే “పరుపు”ను నిజామాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో “లేపు” అంటున్నారు. ఇది చక్కటి దేశ్యపదం. “హంస వింశతి” (అయ్యలరాజు, నారాయణామాత్యుడు)లో “మొకమాలు లేపున నొగిన్ శయనించి మనోభవ వ్యధన్” అని ఉంది. అన్నట్లు… “కొంత” అనే అర్థంలో ఈ జిల్లాలో “గోంత” కూడా ఉంది. “కొంత”లోని పదం మొదటి పరుషం “కొ”, ముందుగా సరళం “గొ” గా మారి పిదప దీర్ఘం అయింది. ఈ “గోంత” అనేది “గోరంత” నుండీ వచ్చే వీలున్నది. “అదిగో” అనేది “అగో”గా మారలేదా, “ది”ను దిగవిడిచి. “ఊరకే” అన్నది “ఊకే” గా మారలేదా “ర”ను రాల్చుకుని.
కొట్లాట, పోట్లాట అర్థంలో నిజామాబాద్‌లో “గూసులాట” ఉంది. మరి ఈ ఆట ఏమిటి? మాట ఏమిటి? బహుశః “కీచులాట” దీనికి మాతృకేమో! ఇంకో రకంగానూ చెప్పే అవకాశం ఉంది. బహుశః అది ముందు “కూసులాట” కావచ్చును. “కూసు” అంటే బిడ్డ, చిన్నపిల్ల. “కూసులు” అనగా చిన్నపిల్లలు. “అభ్యాసం కూసు విద్య” అనే సామెత లేదా? అందులోని “కూసు” అంటే ఇదే అర్థం. అంటే ఏ విద్య ఐనా చిన్నప్పటి నుండే అభ్యసించాలని. అంతేగాక మనలో కొందరు “అమ్మ కూచి”లు ఉండరూ! ఏమైతేనేం… సాధారణంగా పిల్లలు ఆటల్లో పడి కొట్లాడుతూ ఉంటారు. మరి అట్లాగా ఆ కూసుల ఆట “గూసులాట”గా కూర్చున్నదా మారిపోయి. ఇక… పదం మొదట ఉన్న “కూ” అనేది “గూ” మారడం భాషలో బాగా నలిగిన మార్పే! (కడప గడప; కొరగడం గొరగడం) అన్నట్లు… “కూసు” కన్నడ పదం. “కూసుమంచి” లోని “కూసు” కూడా యిదే! ఇంకా నిజామాబాద్‌లో దుకాణం లేదా కొట్టు లేక ధాన్యాదుల షాపుల కూడలిని “గంజి” అంటారు. తూకం వేయడాన్ని “బీటు చేసుడు” అని వ్యవహరిస్తారు. “కాంట పెట్టుడు”, “జోకుడు” అనేవి కూడా అక్కడి భాషా వ్యవహారంలో ఉన్నాయి.
నిజామాబాద్ చుట్టు ప్రక్కల “నేను బీ” మొదలైన మాట తీరు ఉన్నది. “బీ” అంటే “కూడా” అని అర్థం. ఇది హిందీ లేదా ఉర్దూ ప్రభావ జన్యమైన పలుకు. అట్లాగే “ఇస్కూలు” అంటున్నారు కొందరు బడిని. స్కూలు అనే ఆంగ్ల పదం ఉర్దూలో “ఇస్కూలు”గా మారుతుంది. ఐతే, నిజామాబాద్‌లో మాత్రం ఉర్దూయేతరులు సైతం “ఇస్కూలు అంటారు. పైగా “సాల్లె” అని పేర్కొంటారు బడిని. ఏమిటిది? ముందు అది “సాలె”. ఇంకా ముందు “శాలె”. ఇంకా మున్ముందు “శాల”. ఏ “శాల?” అది “పాఠశాల”. వంటశాలనో, భోజనశాలనో, మల్లెశాలనో కాదు. “శాల” అనేది కన్నడంలో ఎకారాంతమైంది. ఆ పదమే క్రమంగా సాలె, సాల్లెలుగా రూపాంతరం చెందింది. ఇప్పటికే కర్నాటకలో “బడి”ని “శాలె” అంటారు. నిజామాబాద్ పొరుగున కన్నడవాడు ఉన్నందు వల్ల అక్కడి “శాలె” ఇక్కడ “సాల్లె” గా అవతరించింది. తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో “సోపాల”, “సోప” అనేవాళ్లు బడిని. నిజామాబాద్‌లో “ఆర్మూరు” మండలం పేరును విడదీస్తే “ఆరుమూరు. “ఆరు అంటే ఐదుకు ఒకటి కలవగా ఏర్పడిన అంకె. “మూరు” అంటే “మూడు” అని.
కన్నడంలో “మూడు” ను “మూరు” అనే అంటారు. (తమిళంలో “మూన్‌ఱు) ఆరు మూరు కలిస్తే తొమ్మిది. అంటే నవనాథులు వెలసిన ఊరు. అట్లాగే “మోర్తాడు” అనే గ్రామం ఉంది. ఇది నిజానికి “మూరు తాడు”, అంటే మూడు ఎత్తైన తాళ వృక్షాలుండిన వూరు. ఈ కన్నడ ప్రభావంతోనే “బేగి రా” అంటారు. అంటే వేగంగా అని. ఇంకా “కావాలి” అనడానికి కొన్ని చోట్ల “బేకు” అంటారు. ఈ “బేగి, బేకు”లు ఏ బ్రేకుల్లేకుండా నిజామాబాద్ కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి. ఈ ఇందూరులో చాలా మంది “బిడ్డ”ను “బిడ్డె” అంటారు. ఇదీ కన్నడపు అసరే! ఆసరే!! కన్నడంలో పదం చివర “ఎ” ఉంటుంది. అట్లా ఇక్కడా బిడ్డ బిడ్డెగా అడ్డ బిటాయించింది. పిట్ట పిట్టెగా గూడు కట్టుకుంది.
ఇంకా కాస్త “ఆగు… తాళు.. ఓపిక పట్టు… సహించే అనే అర్థ స్ఫురణతో ఇక్కడ “ససు” ఉంది. ఇది కన్నడ “సహిసు”. తెల్గులో “సహించు” లేదా “సైచు”. ఈ కర్నాటక “సహిసు” లోని “హి” పోయి నిజామాబాద్‌లో “ససు” మిగిలింది. మరి కొందరు దీన్నే చివర ద్విత్వంతో “సస్సు” అంటే, మరి కొంత మంది మొదలు “స” స్థానంలో “త” చేర్చి “తస్సు” అంటున్నారు. “నీ కోసురం వస్తే నువ్వు నిన్న లేవు గదా” వంటి వాక్యాల్లోని “కోసురం” అంటే కోసం, కొరకు అని. ఈ “కోసురం” అనే మాటను కాస్త కొరకి చూస్తే అది కాస్తా కన్నడంలోని “ఓస్కర” నుండి వచ్చిందని తెలుస్తున్నది. ఓపిక ఉంటే ఇట్లా ఇందూరులో వందలాది పదాల చరిత్రను చెప్పొచ్చాను.