నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా బోర్డుల ఏర్పాటు హామీలు
2014లో బిఆర్‌ఎస్ ఎంపిగా గెలిచిన కల్వకుంట్ల కవిత అనేకమార్లు లోక్‌సభలో పసుపు బోర్డు అంశాన్ని ప్రస్తావించారు. కేంద్ర మంత్రులను కలిశారు. కానీ బోర్డు ఏర్పాటు దిశగా ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు. దీంతో బోర్డు సాధించడంలో కవిత కూడా వైఫల్యం చెందారని అసంతృప్తి పసుపు రైతుల్లో నెలకొంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ ఆమె పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి, ధర్మపురి అర్వింద్ ఆర్మూర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా పసుపు రైతులకు బాండ్ పేపర్ రాసి ఇచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కి సైతం కూడా రాసి ఇచ్చారు. అప్పటి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం ఆర్మూర్ సభలో పసుపు బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. అదే అర్వింద్‌కు కలిసి వచ్చింది. కానీ ఎంపి అయ్యాక బోర్డు ఏర్పాటులో ఆయన మొదట యూటర్న్ తీసుకున్నారు. కానీ పసుపు సాగు విస్తీర్ణం, మార్కెటింగ్ ఎగుమతుల విషయంలో చొరవ తీసుకున్నారు. అయినప్పటికీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు పసుపు బోర్డు విషయంలో అర్వింద్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఇదే అంశాన్ని 2024 ఎన్నికల్లో ప్రస్తావించి అర్వింద్‌ను ఇరుకునపెట్టాలని వ్యూహరచన చేశాయి. ఈ పరిణామాలతో అప్రమత్తమైన అర్వింద్ ఢిల్లీ స్థాయిలో పావులు కదిపారు.
బోర్డు కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలను అదే పనిగా ఒత్తిడి చేశారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ స్వయంగా బోర్డు ఏర్పాటుకు హామీ ఇచ్చారు. ఆ మేరకు పార్లమెంట్‌లోనూ చట్టం చేశారు. రాష్ట్రపతి నుంచి గెజిట్ సైతం వచ్చింది. దీంతో ఈసారి బోర్డు వ్యవహారానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈదఫా లోక్‌సభ ఎన్నికల్లో నిజాం చక్కెర ఫ్యాక్టరీ వ్యవహారం తెర మీదికి తెచ్చేలా ప్రధాన పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఆసియాలోనే ఖ్యాతి గాంచిన నిజాం షుగర్ ఫ్యాక్టరీలు బోధన్, మెట్‌పల్లిలో ఉన్నాయి. ఈ రెండు ఫ్యాక్టరీలను చంద్రబాబు ప్రభుత్వం 2004లో ప్రైవేట్ పరం చేసింది. అప్పటి బిజెపి నేత గోకరాజు ఫ్యాక్టరీని 51 శాతం వాటా కొనుగోలు చేయడంతో ఆ ఫ్యాక్టరీ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీగా మారింది.
కానీ లాభాలు లేకపోవడంతో 2014లో కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలో మూతపడింది. అయితే, అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని టిఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. కానీ కెసిఆర్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. దీంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లోని సుమారు 20 వేల మంది చెరుకు రైతుల్లో ఆశలు చిగురించాయి. అయినప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇదే అంశం ప్రధాన ఎజెండా మారనుంది. 2025లోపు షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి స్పష్టంగా చెబుతున్నారు. బిజెపి ఎంపి అర్వింద్ సైతం ఇదే హామీతో ముందుకొస్తున్నారు. అసాధ్యమానుకున్న పసుపు బోర్డు సాధించిన తాను అలాగే షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని రైతులకు భరోసా ఇస్తున్నారు.
గత లోక్‌సభ ఎన్నికలప్పుడు నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు వ్యవహారం జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ఈసారి ఎన్నికల్లో చక్కెర ఫ్యాక్టరీ తెరమీదకి రాబోతోంది. ఫ్యాక్టరీ పునరుద్ధరణ హామీతోనే ప్రధాన పార్టీలు ప్రచార బరిలోకి దిగబోతున్నాయి. 2019 ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి 176 మంది పసుపు రైతులు నామినేషన్లు వేయడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ కోసం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చుకోవాల్సి వచ్చింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన 176 పసుపు రైతులు బోర్డు ఆవశ్యకతను కేంద్రం గుర్తించేలా ఎన్నికల బరిలోకి దిగారు. రెండు జిల్లాల పరిధిలో పసుపు సాగు సుమారు 40 వేల ఎకరాల్లో జరుగుతోంది. జిల్లాలో పండిస్తున్న పసుపు అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. అందుకే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు దశాబ్దాల తరబడి నుంచి డిమాండ్ చేస్తున్నారు.
– మన తెలంగాణ/
నిజామాబాద్ బ్యూరో: