నిజామాబాద్‌లో అధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్: భానుడి భగభగలతో ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. వడగాల్పులతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పగటిపూటే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా అసాధారణంగా పెరుగుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగ్గుమంటున్నాడు. బయట అడుగు వేస్తే నిప్పుల కొలిమిలా ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా లకా్ష్మపూర్‌లో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కాగా, నిజామాబాద్ నార్త్, ఆదిలాబాద్ భోరాజ్‌లో 44.5 డిగ్రీలు, జగిత్యాల జిల్లా మెట్‌పల్లి, ఆలిపూర్, ఆదిలాబాద్ జిల్లా చాపర్లలో 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది.
రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు
రానున్న రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటరల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు సైతం కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి రాష్ట్రం నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టం నుంచి 0.9 కి.మీల ఎత్తు వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.