టీ పాయింట్ యజమాని వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా నిజాంపేట మున్సిపాలిటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్, మరో వ్యక్తిని ఎసిబి అధికారులు సోమవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా ఎం. శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. స్థానికంగా ఉంటున్న గొట్టిపాటి శ్రీనివాసులు నాయుడు టీ పాయింట్ కంటేయినర్‌లో ఏర్పాటు చేసుకున్నాడు, అలాగే దాని వద్ద చెన్నపట్నం చీరలు పేరుతో అడ్వర్టైజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. వాటిని తొలగించాలని గతంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆదేశించారు.
వాటిని తొలగించుకుండా ఉండాలంటే రూ.1,50,000 ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీనివాసరావు డిమాండ్ చేశాడు.దీంతో బాధితుడు శ్రీనివాసులు నాయుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రూ.1,50,000లు ప్లానింగ్ ఆఫీసర్ ప్రైవేట్ వ్యక్తి రాములకు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారులు వారికి కెమికల్ పరీక్ష నిర్వహించగా అందులో పాజిటివ్ రావడంతో ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.