కామారెడ్డి : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కామారెడ్డి జిల్లాలో బుధవారం పర్యటిస్తున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా నిజాం సాగర్ బ్రిడ్జిని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. నిజాంసాగర్ – పిట్లం రహదారిలో మంజీరా నదిపై నూతనంగా రూ. 25 కోట్లతో బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రిడ్జిని ప్రారంభించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ బ్రిడ్జి ప్రారంభంతో తెలంగాణ-కర్ణాటక రాష్ట్రాల మధ్య రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. నిజాంసాగర్ మండలం జక్కాపూర్ లో 476 కోట్ల రూపాయల వ్యయంతో నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మానానికి శంకుస్థాపన చేసి పైలాన్ ను మంత్రి కెటిఆర్ ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కెటిఆర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ శోభరాజు, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఆర్మూర్ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో పాటు పలువురు ఘనస్వాగతం పలికారు.