గువాహటి: కొత్తగా ఏర్పడిన తీవ్రవాద సంస్థ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్(ఎన్‌ఎల్‌ఎఫ్‌బి)కి చెందిన సభ్యులందరూ ప్రభుత్వం ఎదుట లొంగిపోతున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గురువారం తెలిపారు. గత ఏడాది జనవరిలో కుదిరిన మూడవ బోడో శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఎం బాత నాయకత్వంలో ఎన్‌డిఎఫ్‌బి పేరిట ఒక కొత్త గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. ఈ గ్రూపు బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్(బిటిఆర్)లో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రధాన జనజీవన స్రవంతిలోకి రావాలన్న ఎన్‌ఎల్‌ఎఫ్‌బి నిర్ణయం ప్రభుత్వం పట్ల ప్రజల నమ్మకాన్ని సూచిస్తోందని, వారి రాకను తాను స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు. బిటిఆర్ సర్వతోముఖాభివృద్ధికి అస్సాం ప్రభుత్వం కట్టుబడి ఉందని, బోడో ప్రజల విశిష్ట సామాజిక-సాంస్కృతిక, రాజకీయ ఉనికిని పరిరక్షిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కాగా..ఎన్‌ఎల్‌ఎఫ్‌బికి చెందిన సభ్యులందరూ ఆయుధాలతోసహా లొంగిపోతున్నట్లు డిజిపి భాస్కర్ జ్యోతి మహంత తెలిపారు. అయితే లొంగిపోతున్న తీవ్రవాదుల సంఖ్యను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
NLFB militants to surrendering in Assam