Monday, December 23, 2024

రెండు మెడికల్ కాలేజీలకు ఎన్‌ఎంసి అనుమతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో రెండు ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసి) అనుమతి మంజూరు చేసింది. కామారెడ్డి, కొమురంభీం అసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2023 -24 విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. ఒక్కో కళాశాలలో వంద చొప్పున ఎంబిబిఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ ఏడాది కొత్తగా నిర్మల్, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జనగామ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, సిరిసిల్ల, వికారాబాద్‌లో మొత్తం తొమ్మిది ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనుంది.

వీటిలో రెండు మెడికల్ కాలేజీల ప్రారంభానికి అనుమతి ఇస్తూ ఎన్‌ఎంసి మెడికల్ అసెస్మెంట్ రేటింగ్ బోర్డు(ఎంఎఆర్‌బి) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హర్షం వ్యక్తం చేశారు. కొత్త మెడికల్ కాలేజీలతో గ్రామాల్లో వైద్యసేవల బలోపేతానికి మరింత ఆస్కారం ఉంటుందన్నారు. ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే సిఎం కెసిఆర్ ఆశయ సాధనలో ఇది మరో ముందడుగు అని పేర్కొన్నారు. మరో ఏడు వైద్య కళాశాలల అనుమతుల ప్రక్రియ వివిధ దశల్లో ఉందని తెలిపారు. ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగుపరచడమే కాకుండా ఔత్సాహిక వైద్య నిపుణులకు మరిన్ని అవకాశాలు వస్తాయని మంత్రి ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News