కాంట్రాక్టర్ ఆత్మహత్యపై బొమ్మై స్పష్టీకరణ
బెంగళూరు: ప్రాథమిక దర్యాప్తు పూర్తయ్యేవరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయత్ రాజ్ మంత్రి కెఎస్ ఈశ్వరప్పపై ఎటువంటి చర్యలు తీసుకునే ప్రసక్తి లేదని కర్నాటక ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బసవరాజ్ బొమ్మై గురువారం స్పష్టం చేశారు. సంతోష్ పాటిల్ అనే కాంట్రాక్టర్ ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణపై మంత్రి ఈశ్వరప్పపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సంతోష్ పాటిల్ ఆత్మహత్య కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని, నిజం ఏమిటో బయటకు వస్తుందని బొమ్మై చెప్పాఉ. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగానే ఈశ్వరప్పపై చర్యలు తీసుకునే విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ఈ విషయంలో బిజెపి అధిష్టానవర్గం నుంచి ఎటువంటి జోక్యం లేదని ఆయన తెలిపారు. సమాచారం మాత్రమే వాళ్లు(బిజెపి అధిష్టానం) తీసుకున్నారని, దర్యాప్తు విషయంలో వారి పాత్ర ఏదీ ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. బుధవారం రాత్రే సంతోష్ పాటిల్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తయ్యిందని, ఇక దర్యాప్తు మొదలు అవుతుందని ఆయన చెప్పారు. దర్యాప్తులో తేలే విషయాల ఆధారంగా తాము నిర్ణయం తీసుకుంటామని బొమ్మై చెప్పారు. ఈ కేసు దర్యాప్తును వేరే సంస్థకు అప్పగిస్తారా అన్న ప్రశ్నకు ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటూ ఆయన సమాధానాన్ని దాటవేశారు. మంత్రి ఈశ్వరప్ప తనను అంచం అడిగారని ఆరోపించిన బెలగావికి చెందిన కాంట్రాక్టర్ కొద్ది వారాలకే ఉడుపిలోని ఒక హోటల్‌లో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు.