Wednesday, January 22, 2025

వాక్ స్వాతంత్య్రం-విద్వేష ప్రసంగం

- Advertisement -
- Advertisement -

భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలపై అదనపు పరిమితులు అక్కర్లేదని, రాజ్యాంగం 19(1) కింద పౌరులకు లభించే స్వేచ్ఛ వారికి కూడా సమానంగా వర్తిస్తుందని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం నాడు ప్రకటించిన తీర్పు వాక్ స్వాతంత్య్రానికి పట్టం కట్టింది. అదే సమయంలో వారు బాధ్యతగా మాట్లాడవలసి వుందని పేర్కొన్నది. ఈ మేరకు న్యాయమూర్తులు ఎస్‌ఎ నజీర్, బిఆర్ గవాయ్, ఎఎస్ గోపన్న, పి. రామసుబ్రమణ్యంలు మెజారిటీ తీర్పు ఇచ్చారు.

దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలను కాపాడవలసిన బాధ్యత రీత్యా 19(1) (ఎ) ఇస్తున్న స్వేచ్ఛపై సహేతుకమైన ఆంక్షలు విధించే శాసనాన్ని అమలు చేయడానికి గాని, అందు కోసం కొత్త చట్టం తేవడానికి గాని ప్రభుత్వానికి 19(2) అధికరణ తగిన అధికారాలను కట్టబెట్టిందని అందుకు చట్టం తీసుకు రావడం పార్లమెంటు విజ్ఞత మీద ఆధారపడి వుంటుందని జస్టిస్ నాగరత్న తన ప్రత్యేక తీర్పులో పేర్కొన్నారు. 2016లో యుపి మంత్రి గా వున్న సమాజ్‌వాది పార్టీ నాయకుడు అజామ్‌ఖాన్ చేసిన ఒక వ్యాఖ్యపై దాఖలైన కేసులో ఈ మెజారిటీ తీర్పు వెలువడింది. నోయిడా సహరాన్‌పూర్ హైవే మీద జరిగిన ఒక సామూహిక అత్యాచారంపై వ్యాఖ్యానిస్తూ ఎన్నికలు సమీపిస్తున్నందున ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేయడానికి ప్రతిపక్షం పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు.

ఒక మంత్రి ఒక వ్యక్తిని గాని, ఒక సామాజిక వర్గాన్ని గాని ఉద్దేశించి చేసే విద్వేష ప్రసంగానికి ఆ ప్రభుత్వం బాధ్యత వహించవలసిన పని లేదని మెజారిటీ తీర్పు స్పష్టం చేసింది. ఈ స్పష్టీకరణ మంత్రుల స్థాయిలో కూడా విద్వేష ప్రసంగాలు వెలువడడానికి దోహదం చేస్తే? 19 (1) (ఎ) ని ప్రసాదించిన రాజ్యాంగమే 19(2) ని కూడా ఇచ్చింది. 19(1) (ఎ) కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత విలువైనదో చెప్పనక్కర లేదు. ఈ స్వేచ్ఛ దేశంలో మీడియాకు అపరిమిత స్వాతంత్య్రాన్ని ఇస్తోంది. దాని ద్వారా ప్రజలు తమ అభిప్రాయాన్ని నిర్భయం గా ప్రకటించుకోగలుగుతున్నారు. మీడియా సంపన్న వర్గాల బందీగా మారిపోతున్న క్రమంలో ఈ స్వేచ్ఛ మసకబారుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ వీలైనంత మేర సామాన్యులు తమ అభిప్రాయాన్ని ప్రకటించడానికి ఇది ఎంతో తోడుగా వుంది.

జస్టిస్ నాగరత్న తన ప్రత్యేక తీర్పులో పేర్కొన్న మరి కొన్ని విషయాలు ప్రశంసించదగినవి. మతం, కులం వంటి వాటితో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత పౌరులందరి మీద వున్నదని, భిన్న నేపథ్యాల ప్రజలున్న భారత్ వంటి దేశంలో విద్వేష ప్రసంగాలు మన మౌలిక విలువలనే దెబ్బ తీస్తాయని ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయం ఇప్పటి కాలంలో ఈ దేశ పౌరులకే కాదు, ప్రజా ప్రతినిధులకు, ప్రభుత్వాలు నడుపుతున్న వారికి శిరోధార్యమైనది. భావప్రకటన స్వేచ్ఛ ప్రభుత్వం పరిపాలిస్తున్న తీరును తెలుసుకోడానికి అత్యంత కీలకమైనదని, అదే సందర్భంలో ఆ స్వేచ్ఛ విద్వేష ప్రసంగాలకు దారి తీయరాదని జస్టిస్ నాగరత్న అన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారం చలాయిస్తున్న వర్తమానంలో దేశ ప్రజలను విభజించి పాలించే ధోరణి ప్రబలిపోయింది. ఇందుకోసం ఆ పార్టీకి చెందిన ఎంపిలు, ఎంఎల్‌ఎలు వంటి ప్రజా ప్రాతినిధ్య పదవుల్లోని వారు తమ ఇష్టానుసారం విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు.

మైనారిటీలపై మెజారిటీని రెచ్చగొట్టడమే ధ్యేయంగా మాట్లాడుతున్నారు. ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. బిజెపి పార్లమెంటు సభ్యురాలు ప్రజ్ఞాసింగ్ ఇటీవల చేసిన ప్రసంగం ఇందుకు ఒక మచ్చు తునక. లౌజిహాద్‌కు పాల్పడే వారికి అదే రీతిలో సమాధానం చెప్పాలని, ప్రతి ఇంటా ఆయుధాలను సిద్ధంగా వుంచుకోవాలని ఆమె అన్నారు. ఇంతకు ముందు మరో బిజెపి నాయకురాలు నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఎంతటి వివాదాన్ని రేపాయో తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై కొన్ని ముస్లిం దేశాలు అభ్యంతరం చెప్పడంతో ఆమెను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేశా రు. సుప్రీంకోర్టు కూడా తీవ్రంగా మందలించింది. అందుచేత ఎంపిలు, ఎంఎల్‌ఎలు, మంత్రులు బాధ్యతారహితంగా మాట్లాడకుండా సహేతుకమైన ఆంక్షలు విధించాల్సిన అవసరాన్ని గుర్తించడం పార్లమెంటుపై గల బాధ్యత అని జస్టిస్ నాగరత్న వెలిబుచ్చిన అభిప్రాయం హర్షించదగినది.

అంతేకాదు మన దేశంలోని భిన్నత్వాన్ని దృష్టిలో పెట్టుకొని దానిని కాపాడవలసి వుందని ఆమె చెప్పిన సూచన గణనీయమైనది. భిన్నత్వంలో ఏకత్వం మన రాజ్యాంగ మౌలిక విలువ. దానితో విభేదిస్తున్న రాజకీయ శక్తి దేశాన్ని పరిపాలిస్తున్నది. అందుచేత దేశ ప్రజలందరికీ సమాన హక్కులిస్తున్న రాజ్యాంగ వ్యవస్థను కాపాడుకోవలసిన బాధ్యత ఇప్పుడు ప్రజాస్వామిక ప్రియులందరిపై వున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News