అన్ని ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పోటీ
ఇవిఎంలకు బదులు బ్యాలెట్‌లతోనే ఎన్నికలు నిర్వహించాలి : సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడితో తమ భారత రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకోదని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గురువారం స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి సీటులోనూ తమ పార్టీ సివిల్, అసెంబ్లీ, సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తుందని వెల్లడించారు. మహారాష్ట్రలో తొలిసారిగా వార్ధా రోడ్‌లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఇవిఎం)కు బదులు బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన (యుబిటి), కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలతో కూడిన ఎంవిఎతో బిఆర్‌ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటుందా? అని ప్రశ్నించగా, ‘మేము చాలా ఫ్రంట్‌లు, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్‌లను చూశాము కానీ ఇవి సరిపోవు.
అందుకే, మేము బిఆర్‌ఎస్ ఎజెండాను సిద్ధం చేస్తున్నాము. ‘నిర్మాణాత్మక మార్పు కోసం బిఆర్‌ఎస్ ఎజెండాతో ఏకీభవించే ఏ పార్టీ అయినా మాతో రావచ్చు,‘ అని ఆయన అన్నారు, ‘మాకు పొత్తు అవసరం లేదు‘ కాబట్టి బిఆర్‌ఎస్ ఏ పొత్తు గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం మహారాష్ట్ర తర్వాత ఉత్తరప్రదేశ్, చండీగఢ్, పంజాబ్, హర్యానాలలో బిఆర్‌ఎస్‌ను విస్తరిస్తామన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, దేశంలో ఏ వర్గం సంతృప్తిగా లేరన్నారు. దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, రాజ్యాంగ, న్యాయ ఎన్నికల పరిపాలనా సంస్కరణల ద్వారా దేశంలో మార్పు సాధ్యపడుతుందన్నారు. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నా రు. దేశంలో మేధావులు, యువత గుణాత్మక మార్పు కో సం ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు.
దేశం లో ఎలాంటి అభివృద్ధి అయినా నిర్మాణాత్మక మార్పుతోనే సాధ్యపడగలదన్నారు. వ్యవసాయం ప్రధాన వృత్తి అయిన మన దేశంలో ఏ ప్రభుత్వమూ రైతులను ఆదుకునేందుకు ప్రయత్నించలేదని తెలిపారు అవసరానికి మించిన నీటి వనరులు మన దేశంలో ఉన్నా ఉపయోగించుకోవడంలో విఫలమయ్యామన్నారు. మన దేశంలో 70 వేల టిఎంసిల నీళ్లు ఉన్నా తాగు నీటి కోసం ప్రజలు గోసపడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ జలవిధానాన్ని వెంటనే మార్చాల్సిన అవసరం ఉందన్నారు. నదుల నీటి కోసం రాష్ట్రాల మధ్య ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశం లో వ్యవసాయానికి యోగ్యమైన భూమి 41 కోట్ల ఎకరాలు ఉందని, దానిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తే దేశంలోని ప్రతి ఎకరానికి సా గునీరు అందిచొచ్చన్నారు. దేశంలో 361 బిలియన్ ట న్నుల బొగ్గు ఉందన్నారు. ఈ బొగ్గును కరెక్ట్‌గా వాడితే దేశానికి 150 ఏండ్లకు సరిపోయే కరెంట్ ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, రోడ్లు మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇన్నేండ్ల తర్వాత కూడా దేశంలో రవాణా వ్యవస్థ దారుణంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగపూర్‌లో ఎలాంటి వనరులు లేకున్నా అద్భుతంగా అభివృద్ధి సాధించారన్నారు. సింగపూర్‌లో మట్టిని కూడా ఇండోనేషియా నుంచి దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు. ఎలాంటి వనరులు లేకున్నా సింగపూర్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. మానవ వనరుల అభివృద్ధి, తలసరి విద్యుత్ వినియోగంలోనూ భారత్ వెనుకబడి ఉందన్నారు. రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయిందన్నారు. టెస్ట్ ప్రాక్టీస్ నుంచి నెక్ట్ ప్రాక్టీసెస్‌కు మార్పు చెందాల్సిన అవసరం ఉందన్నారు. పేద దేశాలు ఆర్థికంగా బలపడుతున్నాయన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. చైనా 1992 నుంచి విప్లవాత్మకమైన మార్పు చెందుతున్నదన్నారు. దేశంలోని రెం డు జాతీయ పార్టీలు ఏం సాధించలేకపోయాయని ధ్వజమెత్తారు. రాష్ట్రాలు మున్సిపాలిటీలుగా దిగజారాయన్నా రు. ఔట్ ఆఫ బాక్స్ థింకింగ్‌లోకి మనం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక, నిర్మాణాత్మక సంస్కరణలు తీసుకురావాలని అవసరం ఉందని స్పష్టీకరించారు. రాజ్యాంగ, న్యాయ, పరిపాలన, ఎన్నికల సంస్కరణలను వెంటనే తీసుకురావాలని తెలిపారు. అదే విధం గా వ్యవసాయ ఉత్పత్తులను లాభాల దిశగా మార్చాలన్నారు.
కాలపరిమితితో సంబంధం లేకుండా దేశంలో సమూల మార్పు కోసం బిఆర్‌ఎస్ పనిచేస్తుందన్నారు. అందులో విజయం సాధించి తీరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. . తాము ఎలాంటి తొందరలో లేమన్నారు. తాము ఎన్నో ఫ్రంట్ లను చూశాం. వీటి వల్ల ఎలాంటి ఫలితాలు రాలేదని చెప్పారు. తమ ఎజెండాతో కలిసి వచ్చేవారిని కలుపుకొని ముందుకు సాగుతామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. తాము ప్రాంతీయ పార్టీ కాదని, జాతీయ పార్టీగా ఇప్పటికే ప్రకటించామన్నారు. తెలంగాణ సాధించేందుకు పదిహేనేళ్ళు కష్టపడ్డామని, తాను మరణం అంచుల దాకా వెళ్ళి వచ్చానని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చాక 33 జిల్లాలు ఏర్పరుచుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులోనే విధానాలు రూపొందుతాయని, విధానాలు రూపొందించే శక్తిని పొందేందుకే రాజకీయాలు చేస్తామని మరోమారు పునరుద్ఘాటించారు. దేశంలోని ఏదైనా పార్టీని గానీ, వ్యక్తులను గానీ నిందించకుండా దేశంలో గుణాత్మక మార్పు అవసరాన్ని ప్రజలందరూ గుర్తించి కృషి చేయాలన్నారు. గత ఏడు దశాబ్దాలుగా దేశం తన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయిందని, భారతదేశ అభివృద్ధి పథంపై సిఎం కెసిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితులపై పౌరులలో నెలకొన్న అసంతృప్తిని బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ ఎత్తి చూపారు. దేశం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను పరిష్కరించడానికి, భారతదేశాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు నడిపించడానికి సమూల మార్పులు అవసరమని సిఎం కెసిఆర్ నొక్కి చెప్పారు.