Monday, January 20, 2025

ప్రగల్భాలు కాదు….అసెంబ్లీకి రా

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం అవినీతి బయటపడుతుందనే కుట్రతో నల్లగొండలో సభ
చావు నోట్లో తలకాయ పెట్టారని కోటి ఒకటోసారి కెసిఆర్ మాట్లాడారు
గత పాలకుల నిర్వాకంతోనే ప్రాజెక్టులకు ఈ దుస్థితి నెలకొంది
మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు ముందు ఉత్తర ప్రగల్భాలు పలకుండా శాసనసభలో జరిగే చర్చకు మాజీ సిఎం కెసిఆర్ హాజరు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేల కోట్ల దోపిడీపై చర్చ జరగకుండా ఉండాలనే కుట్రలతో కెసిఆర్ నల్లగొండలో సభ పెట్టి ప్రజల దృష్టి మళ్లించాడనికి ఎత్తుగడ వేశాడని మండిపడ్డారు. మంగళవారం మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రజల ముందు తన బండారం బయటపడుతుందనే నల్లగొండలో నిర్వహించిన సభలో మాపై ఎదురుదాడికి దిగారని, చావు నోట్లో తలకాయ పెట్టానని కేసీఆర్ కోటి ఒకటవసారి అబద్ధం చెప్పారని ఎద్దేవా చేశారు. సత్య హరిశ్చంద్రుడు అయితే శాసనసభలో చర్చకు ఎందుకు రాలేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని, నీ ఏజెంట్ హరీశ్‌రావు సభలో అసత్యాలు మాట్లాడుతూ తమ ప్రభుత్వం చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు తంటాలు పడుతున్నారన్నారు. మీరు చేసిన నిర్వాకంపై సభలో ఆధారాలతో సహా బయటపెట్టామని, మేడిగడ్డ సందర్శనకు రావాలని మా మంత్రి లేఖ రాశారని, తాము నిర్ణయించిన తేదీపై అభ్యంతరం ఉంటే మీరు చెప్పిన తేదీనే వెళదామని చెప్పిన ఎందుకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పర్యటనకు రాలేదని నిలదీశారు. కాలు విరిగిందని డ్రామాలాడి అసెంబ్లీకి రాని కెసిఆర్ నల్లగొండ సభకు ఎలా వెళ్లారని,నల్లగొండ దూరమా, అసెంబ్లీ దూరమో ఒక ఆలోచించి మాట్లాడాలని సూచించారు. నాలుగైదు పిల్లర్లు కూలాయని చులకనగా మాట్లాడుతున్నారని, మీ లక్ష కోట్ల దోపిడీకి కాళేశ్వరం బలై పోయిందని మేడిగడ్డ సమస్యను చులకన చేసి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కెఆర్‌ఎంబిపై తాను సలహాలు ఇచ్చేవాడినని సభలో అనడం పెద్ద గొప్పకాదని, దమ్ముంటే శాసనసభకు వచ్చి సలహాలు ఇవ్వాలని గతం నుంచి చెబుతామని గుర్తు చేశారు. తీర్మానంలో లోపాలు ఉంటే హరీష్ రావు ఎలా మద్దతు ఇచ్చారని, అందుకే వారి మాటలకు విలువ లేదని కెసిఆర్ సభకు రావాలని తాము కోరామని,నల్లగొండ సభలో దిక్కుమాలిన మాటలు మాట్లాడటం కాదు, శాసనసభకు వచ్చి సత్తా చూపించాలని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలు వెంటాడుతామంటూ అంటూ బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తున్నారని, కాళేశ్వరంపై చర్చకు రావడానికి మీరు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మీ కార్యదర్శి మీ అనుమతి లేకుండానే లేఖ రాశారా మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్ పదే పదే మాట్లాడుతున్నారని,నీ గురించి ప్రజలకు ముందే తెలిసి ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదన్నారు. కుర్చీ పోగానే కెసిఆర్‌కు నీళ్లు, నల్లగొండ ఫ్లోరైడ్ గుర్తొస్తాయని, ఆయన మాట్లాడే అబద్దాలు నమ్మడానికి తెలంగాణ సమాజం ఇంకా సిద్ధంగా ఉందనుకోవడం మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కెసిఆర్‌ను ఈ వేదికగా ఆహ్వానిస్తున్నా బుధవారం జరిగే ఉదయం సభకు హాజరై బడ్జెట్ తో పాటు, సాగునీటి రంగంపై చర్చలో పాల్గొనాలని కోరారు.

ప్రతిపక్ష నేతగా ప్రజలకు మేలు చేయాలి:
రాష్ట్రంలో అన్ని పాపాలకు కెసిఆర్ కారణమని స్వార్ధం కోసం కాకుండా ఒక్కసారైనా ప్రజలకు మేలు జరిగేలా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత నెరవేర్చుకోవాలని,మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లకు పగుళ్లు స్పష్టంగా కమిపిస్తున్నా చిన్న సంఘటనగా చెప్పడం సరికాదన్నారు. తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, కాళేశ్వరంపై జరిగిన అవకతవకలపై మీ వైఖరేంటో శాసన సభలో చెప్పాలన్నారు. కుర్చీ పోయిందని, కుర్చీని వెతుక్కుంటూ నల్లగొండ దారి పట్టాడని, పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతితో ఓట్లు పొందాలని రాజకీయ ఎత్తుగడలు వేశారని ఆరోపించారు. భయపడనని ప్రగల్భాలు పలకడం కాదు వచ్చి సభలో మాట్లాడాలని, సభలో కాళేశ్వరం అవినీతి చర్చకు రాకుండా ఉండేందుకే నల్లగొండలో సభ పెట్టాలరన్నారు. కెసిఆర్ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజంపై ఉందని, ఆయన కాళేశ్వరానికి కాదు ఇక కాశీకి వెళ్లి సన్యాసం పుచుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు.

బిఆర్‌ఎస్, బిజెపివి చీకటి పొత్తులు: సిఎం రేవంత్‌రెడ్డి
బిజెపి, బిఆరెస్ ఇంకా ఎన్నాళ్లు చీకట్లో పొత్తు పెట్టుకుంటారని, ఇలాంటి దొంగ కుట్రలో రెండు పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిచెందాయని రేవంత్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ సందర్శనకు బిజెపి ఎమ్మెల్యేలు వాళ్లు వస్తారని అనుకున్నామని, కెసిఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలన్న ఆపార్టీ సభ్యులు పర్యటకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బిజెపి వైఖరేంటో ఇప్పటికైనా స్పష్టంచేయాలని, మాజీ సిఎం అవినీతికి సహకరిస్తారో అవినీతిపై విచారణ చేసే మా ప్రభుత్వానికి సహకరిస్తారో తేల్చుకోవాలన్నారు. గత ప్రభుత్వం అవినీతిని బయటపెట్టడానికి ఈ పర్యటన కీలకమని,అలాంటి మేడిగడ్డ సందర్శనకు బిజెపి ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు.

కోటి ఎకరాలకు సాగు నీరు ఎక్కడ అందించలేదు:
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కోటి ఎకరాలకు సాగు నీరు అందించాం అని గత ప్రభుత్వం చెప్పిన మాట అంతా అబద్దమని, లక్ష కోట్లు ఖర్చు చేసిన లక్ష ఎకరాలకు కూడా గత ప్రభుత్వం సాగునీరు ఇవ్వలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్వహణ, విద్యుత్ బిల్‌కు ఏటా రూ. 25 వేల కోట్ల బడ్జెట్ అవసరమన్నారు. 2020లోనే మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం ఉందని ఇరిగేషన్ అధికారులు ఎల్‌అండ్ టికి లేఖ రాసిన అప్పటి ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో ప్రాజెక్టు కుంగుబాటుకు గురైందన్నారు. మేడిగడ్డ, అన్నారం,సుందిల్ల బ్యారేజిలు మూడు ఒకే టెక్నాలజీ, నైపుణ్యంతో నిర్మించారని, ఒకే విధమైన సమస్యలు ఈ మూడింటిలో ఉత్పన్నం అవుతున్నాయన్నారు. ఈ సమస్యను కప్పిపుచ్చేందుకు అసెంబ్లీ ఎన్నికల ముందు నీటిని తొలగించారని, నీరు పూర్తి సామర్థ్యం మేరకు నింపితే లోపాలు బయటపడినట్లు పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నుండి ఏటా 180 టిఎంసిల నీటిని ఎత్తి పోయాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికీ ఒక్క సంవత్సరం కూడా ప్రతిపాదిత లక్ష్యం చేరుకోలేదని, 2020 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అధికారులు లోపాలు ఉన్నట్లు ఎల్‌అండ్‌టికి నోటీస్‌లు జారీ చేసిన సంగతి గుర్తు చేశారు. ఇప్పుడు గత ప్రభుత్వ బాధ్యులు, నిర్మాణ సంస్ధ బ్యారేజి కుంగుబాటుకు మా బాధ్యత లేదని చెబుతుందని, కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్, నిర్మాణాలు, నిర్వహణలో లోపాలు ఉన్నాయన్నారు. కాగ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దోపీడీ జరిగిందని చెప్పాయన్నారు. వీటి రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో దోపీడీ పై ఈ బడ్జెట్‌లో చర్చ పెట్టాలని భావించామని, కృష్ణానది పైన ప్రాజెక్ట్ లను కెఆర్‌ఎంబికి ఇచ్చారని తమ ప్రభుత్వాన్ని ఆబాసు పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో కెఆర్‌ఎంబి పై సలహాలు సూచనలు ఇవ్వమని ప్రతిపక్షాలకు సూచించామని, తెలంగాణ ప్రజల మేలుకు ఏవిధమైన సూచనలు ప్రతి పక్షం చేసిన స్వాగతిస్తామన్నారు. మేడిగడ్డ బ్యారేజి లో నీళ్ళు నింపితే పెను ప్రమాదముందని, 5 మీటర్ల మేరా బ్యారేజి కుంగిందని, బుధవారం అసెంబ్లీ లో సాగునీటి రంగం పై శ్వేత పత్రం ప్రవేశ పెడతామని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని, కవులు, కళాకారులు మేడిగడ్డ బ్యారేజి వచ్చి కుంగుబాటును పరిశీలించాలని సిఎం రేవంత్‌రెడ్డి సభావేదికగా కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News