మైసూరు న్యూస్ : కర్ణాటకలో ఒమిక్రాన్ కొత ఉపవేరియంట్ల కేసులు ఏవీ నమోదు కాలేదని, మహారాష్ట్రలో ఒక కేసు నమోదైనప్పటికీ మన రాష్ట్రంలో అలాంటి భయమేమీ లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్ ప్రజలకు స్పష్టం చేశారు. మైసూరులో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజలు తక్షణం బూస్టర్ డోసు వేయించుకోవాలని సూచించారు. వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎంతో అవసరమని , ముఖ్యంగా పండగల సీజన్ అయినందున బిక్యు1,బిఎ.2,3.20 , ఎక్స్‌బిబి తదితర కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు దేశంలో ప్రబలుతున్నందున తగిన జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేసింది. మళ్లీ మాస్కులు తప్పనిసరి అవుతాయా అన్న ప్రశ్నకు అలాంటి పరిస్థితి ఇంకా రాలేదని, అయితే పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కొవిడ్ విషయంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీతో చర్చిస్తానని చెప్పారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య విభాగాలు, జిల్లా వైద్యాధికారులతో మంత్రి సుధాకర్ గురువారం డివిజనల్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.