Friday, December 20, 2024

ఐటిడిఎల రూపశిల్పి

- Advertisement -
- Advertisement -

భారత దేశం ఎన్నెన్నో చారిత్రక ఘట్టాలకు, చారిత్రక పోరాటాలకు నెలవు. నాటి ఆంధ్రప్రదేశ్, నేటి తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే ప్రకృతి వనరులు, జంతుజాలం, దట్టమైన అరణ్యాలతో మమేకమైన ఆదివాసుల జిల్లాగా పేరొందింది. గోండ్వానా రాజ్యం మొదలుకొని బ్రిటీష్, నైజాం పాలనతో పాటు ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ… ఆదివాసీల జీవన శైలిలో మార్పులేదు. ఆదివాసులు తమ అస్తిత్వం, స్వయం పాలన కోసం పోరాటమే జీవితంగా మారుతున్న సందర్భంలో… ఉమ్మడి రాష్ట్రంలోని ఆదిమ జాతి సంక్షేమం గురించి పరితపించిన రాజకీయ నేతలలో కోట్నాక భీమ్ రావ్ తొలి తరం నాయకుడు. నిస్వార్ధ సేవాపరుడు, గిరిజనులలో మొట్ట మొదటి ఆదివాసీ మంత్రి కూడా ఆయనే. గిరిజన గోండు తెగకు చెందిన కొట్నాక భీమ్‌రావ్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని బంబార గూడెంలో కోట్నాక జంగు మొకాసి, బాదుబాయి దంపతులకు రెండవ సంతానంగా 1933, నవంబర్ 19న జన్మించాడు. నలభై సంవత్సరాల తన రాజకీయ జీవితాన్ని బడుగు బలహీన వర్గాలు, పేదల ఉన్నతికి అంకితం చేసిన నిస్వార్ధ సేవా పరాయణుడు ఆయన.

భీమ్‌రావ్ 1972 నుండి 1976 వరకు, 1989 నుండి 1993 కాలంలో రెండు సార్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవిలో ఉన్నారు. ఆ కాలంలో అనేక నిరుపేద ఆదివాసుల సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన ఆదర్శమూర్తిగా కీర్తికెక్కారు. స్వాతంత్య్రం సిద్ధించిన మలి రోజుల్లో అనగా 1948 నుంచి 1956 మధ్య బిఎ, ఎల్‌ఎల్‌బి చదివిన భీంరావ్ గోండు గిరిజనులలో ప్రథమ పట్టభద్రుడుగా రికార్డు సృష్టించాడు. అదే తెగకు చెందిన ఏకైక ఐఎఎస్ దివంగత మడవి తుకారాం కంటే పూర్వమే అంటే 1957లో గ్రూప్-1 పరీక్షలలో ఉత్తీర్ణుడైన తొలి ఆదివాసీ విద్యావంతుడు.ఆయన ఉద్యోగాన్వేషణను విరమించుకొని ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో, సదుద్దేశంతో జీవిత గమ్యాన్ని రాజకీయ దిశగా మార్చుకొని నిస్వార్థ రాజకీయ నేతగా ఖ్యాతి నార్జించాడు. 1952లో మొదటి సారిగా ఆదివాసీ తెగల నుండి పాడేరు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికైన గాం మల్లుదొర పార్లమెంటు లో తొలిసారిగా అరంగేట్రం చేయగా, 1962లో ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన కోట్నాక భీమ్రావ్ రాష్ట్ర శాసన సభలోకి అడుగుపెట్టిన తొలి ఆదివాసీ శాసన సభ్యుడు.

అప్పటి ముఖ్యమంత్రి పి.వి. నరసింహారావు మంత్రి వర్గంలో అంటే 1972లో గిరిజనులకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఆవిర్భవించింది. దీనితో భీమ్ రావ్‌కి తొలిసారిగా గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఆయన్నే వరించింది. 1989లో ఖానాపూర్ శాసన సభ్యునిగా రెండోసారి గెలిచిన తర్వాత మర్రి చెన్నారెడ్డి మంత్రి వర్గంలో, 1990లో నేదురుమిల్లి జనార్ధన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒకసారి, 1992-93 మధ్య కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో గిరిజన సంక్షేమ శాఖామాత్యులుగా మరొకసారి పని చేయడం భీమ్ రావ్ ప్రతిభకు, సేవాతత్పరతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన భూభాగానికి చెందిన గోండు, కోలాం, కోయ, పరధాను, మన్నేవార్లు, తోటి, నాయకపోడు మొదలైన గిరిజన తెగల వారికి అభివృద్ధి ఫలాలు అందిపుచ్చుకోవడానికి అవసరమైన బృహత్తర కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. 1974-1976 మధ్య ఉమ్మడి రాష్ట్రంలో రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం ఆదిమ గిరిజనులు నివసించే 5,948 షెడ్యూక్ట్ ఏజెన్సీ గ్రామాల పరిధిలో తొమ్మిది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు (ఇటిటిఎలు) కృషి చేసిన కోట్నాక భీమ్ రావ్ ఐటిడిఎల రూపశిల్పి అనడంలో అతిశయోక్తి లేదు.

ఉభయ తెలుగు రాష్ట్రాలలో కోట్నాక భీమ్ రావ్ కృషి వల్ల మొత్తం తొమ్మిది సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు ఏర్పడ్డాయి. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఉమ్మడి వరంగల్ జిల్లా ఏటూరునాగారం, అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో పార్వతీపురం, తూర్పు గోదావరి జిల్లాలో రంపచోడవరం, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలోని కోటరామచంద్రపురం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం వంటి ప్రాంతాలలో ప్రస్తుతం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు పని చేస్తున్నాయి. వీటితో గిరిజనులలో అక్షరాస్యత పెంచి, వారిని చైతన్యవంతులను -చేసేందుకు 1975-1976 మధ్యకాలంలో ఐటిడిఎల ఆధ్వర్యం లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను, తదుపరి గిరిజన వసతి గృహాలను, గురుకుల పాఠశాలలను భీంరామ్ ప్రారంభించారు.మౌలిక వసతుల కల్పనలో భాగంగా అనేక ఆదివాసీ గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం, పారిశుధ్యం, వ్యవసాయం, గృహ నిర్మాణాల పట్ల అత్యంత శ్రద్ధ కనబరిచారు. వాస్తవంగా చెప్పాలంటే ఆ కాలంలో భీంరామ్ చొరవతో ఆదివాసులు ఆర్థికంగా నిలదొక్కుకోగలిగారు. గిరిజనుల్లో జీవన ప్రమాణాలు పెరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడినవి.

కోట్నాక భీమ్ రావు భారీ, బంజార జాగీరు అయినందున గోండ్వానా రాజ్యం నుండి దేశానికి స్వాతంత్య్రానంతరం గోండుల పోరాటాలు, వారి సాంస్కృతిక చరిత్రను పరిశోధించిన అధ్యయన శీలి. 1940, అక్టోబర్ 8న నిజాం మూకల దాడిలో అమరుడైన ఆదివాసీల ఆశాజ్యోతి, తెలంగాణ పోరాట యోధుడు కుమ్రంభీం చరిత్రను తొలుత ‘సామల సదాశివ్’ చేత లోకానికి పరిచయం చేసిన ఘనత భీమ్ రావ్ కే దక్కుతుంది. ఆ తర్వాత భీమ్ చరిత్రను అల్లం రాజయ్య, సాహూ, దేశపాండే నవలలుగా రచించారు. ఒక మంత్రి హోదాలోనూ, గోండు గిరిజనుల పండుగలు, సంస్కృతీ సంప్రదాయాలను ఆరాధించిన భీమ్ రావ్ ఆదివాసీల ఆత్మబంధువు. మారుతున్న సమాజంలో వచ్చే కొత్త మార్పులను, కుటుంబ తగాదాలను స్వయంగా పరిష్కరించుకొనేందుకు ప్రొఫెసర్ హైమండార్ఫ్- ఎలిజబెత్ దంపతుల ఆధ్వర్యంలో గోండ్వానా రాయ్ సెంటర్, రాజ్ గోండ్ సేవా సమితి, అవ్వల్ కమిటీలను ఏర్పాటు చేశారు. నిజాం పాలనలో ‘ఖాదీ అభ్యాం’ అనే సోషల్ సర్వీస్ ‘సోషల్ వెల్ఫేర్’ గా ఉండేది. దీని నుండి ప్రత్యేకంగా ‘ట్రైబర్ వెల్ఫేర్’ అంటే గిరిజన సంక్షేమ శాఖగా అవతరించింది

ఆదివాసీల సంక్షేమం కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగానే కాకుండా నిరంతరం సేవా దృక్పధంతో పలు కార్యక్రమాలు చేసిన కోట్నాక భీమ్ రావ్ 2002, ఆగస్టు 29న కాలగర్భంలో కలిశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రాజ్ గోండ్ సేవా సమితి ప్రతినిధి సిడాం అర్జు , ప్రస్తుత జెడ్పీ చైర్మన్ కోవలక్ష్మీతదితరుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భీం రావు స్మారక సంక్షేమ సంఘం భీమ్ రావ్ స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ, ఐటిడిఎల రూపకల్పనకు భీమ్ రావ్ చేసిన కృషి అనన్యమైనది. కోట్నాక భీమ్ రావ్ జయంతి అయిన నవంబర్ 19ని ఐటిడిఎ స్థాపక దినోత్సవంగా గుర్తించి, అన్ని ఐటిడిఎ ప్రాంగణాలలో భీమ్ రావ్ విగ్రహాన్ని ప్రతిష్టించి ఐటిడిని స్థాపకోత్సవాలు నిర్వహిస్తే బాగుంటుందని గిరిజనులు ఆశిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News