అగ్నిపథ్‌పై త్రివిధదళాల వివరణ
న్యూఢిల్లీ : అగ్నిపథ్ సాయుధ దళాల రిక్రూట్ మెంట్ విధానంలో ఎలాంటి మార్పు ఉండబోదని, ఈ పథకంపై విశ్వసనీయ సమాచారం రావడంతో మొదట్లో వచ్చిన తప్పుడు సమాచారం చెల్లాచెదురైందని మిలిటరీ వ్యవహారాల అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ అనిల్ పురి వెల్లడించారు. మిలిటరీలో సంప్రదాయ రెజిమెంటేషన్ వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సైనికులుగా తయారు కాడానికి యువత సిద్ధమౌతోందని, అనేక చోట్ల భౌతిక పరీక్షల కోసం హాజరవుతున్నారని పేర్కొన్నారు. త్రివిధ దళాల పాత్రికేయ సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రిక్రూట్‌మెంట్ విధానంలో విధ్వంసంలో పాల్గొనలేని అభ్యర్థుల నుంచి ప్రమాణ పత్రం స్వీకరిస్తామన్నారు. ఆర్మీలో హింసకు తావు లేదన్నారు. 1989 నుంచి వివిధ కమిటీల సిఫార్సులు చేస్తున్నాయని, అగ్నిపథ్ పథకాన్ని చేయడంలో అందరి భాగస్వామ్యం ఉందని పేర్కొన్నారు. ఈ పథకంతో యువ ప్రొఫైల్ తయారు చేయవచ్చని చెప్పారు. సాంకేతికంగా సమర్ధులను, ఆర్మీలో చేరేందుకు కావల్సిన సామర్ధం ఉన్నవారిని రిక్రూట్ చేయనున్నట్టు చెప్పారు. ఆర్మీకి తగినట్టు అగ్నివీరుల్ని తీర్చి దిద్దడం వల్ల వారు భవిష్యత్తుకు సిద్ధంగా ఉంటారని అనిల్ పురి తెలిపారు.