Monday, March 10, 2025

అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదు : జైశంకర్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికా నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొత్తదేమీ కాదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. తాజాగా అమెరికా 104 మంది భారతీయులను స్వదేశానికి పంపించడంపై కేంద్ర మంత్రి రాజ్యసభలో ప్రకటన చేశారు. వలసదారులకు సంకెళ్లు వేసి పంపిస్తున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ , డీపోర్టేషన్ సమయంలో వలసదారుల పట్ల దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. “ అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది.

ఇది ఏ ఒక్క దేశానికి సంబంధించిన విధానం కాదు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా వెనక్కి పంపిస్తోంది. 2009లో ఈ సంఖ్య 734 ఉండగా, 2012లో ఈ సంఖ్య 530 గా ఉండగా, 2019లో 2 వేలకు పైగా ఉంది. 2024 లో 1368 వరకు ఉండగా, 2025 లో 104 మందిని వెనక్కి పంపారు. అక్రమ వలసలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలి. తమ దేశస్థులు విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటే వారిని స్వదేశాలకు ప్రక్రియను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసిఇ) చూసుకుంటుంది. వలసదారులను ఎయిర్‌క్రాఫ్ట్‌లో తరలించే విధానాన్ని 2012 నుంచి అమలు చేస్తుండగా, నిబంధనల ప్రకారం (ఎస్‌ఒపి) వారిని నిర్బంధిస్తారు.

టాయిలెట్‌కు వెళ్లే సమయంలో అవసరమైతే వాటిని తొలగిస్తారు. సైనిక ఎయిర్ క్రాఫ్ట్, చార్టర్డ్ విమానాలకూ ఇది వర్తిస్తుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అయితే మహిళలు, చిన్నారులును నిర్బంధించలేదని ఐసీఈ అధికారులు మాకు సమాచారం ఇచ్చారు. ” అని ఎస్. జైశంకర్ పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో వారికి అవసరమైన ఆహారం, అత్యవసర వైద్య సదుపాయాలు , సమకూర్చినట్టు తెలిపారు. గురువారం చేరుకున్న అక్రమ వలసదారులు కూడా ప్రయాణంలో తమ కాల్లు, చేతులకు సంకెళ్లు వేశారని ఆరోపించారు. అమృత్‌సర్‌కు చేరుకున్న తరువాతనే వారి సంకెళ్లను తొలగించారు.
విపక్షాల నిరసనలు…
భారతీయులను అమెరికా వెనక్కి పంపించిన విధానాన్ని లేవనెత్తిన విపక్షాలు పార్లమెంటులో నిరసనలు చేపట్టాయి. దీనిపై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. అమెరికా ప్రభుత్వ యంత్రాంగంతో తీసుకుంటున్న దౌత్యచర్యల గురించి వివరించాలని కోరాయి. దీనిపై లోక్‌సభ స్పీకర్ ఈ అంశం విదేశాంగ మంత్రిత్వశాఖకు సంబంధించినదని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించిందన్నారు. ఇలా ఉభయసభలకు అంతరాయం కలుగుతోన్న క్రమం లోనే రాజ్యసభలో కేంద్ర మంత్రి జైశంకర్ దీనిపై ప్రకటన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News