న్యూఢిల్లీ : అమెరికాపై సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం తాజాగా స్పందించింది. సుంకాల తగ్గింపునకు ఎలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి మిత్రులు, శత్రువులు అనే తేడా లేకుండా అనేక దేశాలపై సుంకాలు విధిస్తున్నారు. భారత్ కూడా తమ వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తోందని, వచ్చేనెల రెండో తేదీ నుంచి తమ ప్రతీకార సుంకాలు ప్రారంభం కానున్నాయని హెచ్చరించారు. ఈ అంశాన్ని లేవనెత్తడం , భారత్ చర్యలను తాము బహిరంగపరచడం వల్ల సుంకాలను తగ్గించడానికి ఆ దేశం అంగీకరించిందని తెలిపారు.
దీనిపై తాజాగా భారత్ స్పందించింది. “ సుంకాల తగ్గింపు అంశంపై అమెరికాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. అమెరికా అధ్యక్షుడు పదేపదే లేవనెత్తుతున్న ఈ సమస్య పరిష్కారానికి సెప్టెంబర్ వరకు సమయం కోరాం” అని పార్లమెంటరీ ప్యానెల్‌కు భారత ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు జాతీయ మీడియా కథనం పేర్కొంది. భారత్, అమెరికా పరస్పరం ప్రయోజనకరమైన ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకొనే దిశగా కృషి చేస్తున్నాయని, తక్షణం సుంకాల సర్దుబాటు చేసుకునే బదులు దీర్ఘకాలిక వాణిజ్య సహకారంపై దృష్టి సారించాయని భారత వాణిజ్యశాఖ కార్యదర్శి సునీల్ భర్ధాల్ వెల్లడించారు.