ప్రభుత్వానికి అనుకూలంగా 55 మంది
చండీగఢ్: హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బుధవారం ఉదయం కాంగ్రెస్‌పక్షం నేత బిఎస్ హుడా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆరు గంటల చర్చ అనంతరం స్పీకర్ గ్యాన్‌చంద్‌గుప్తా ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానానికి 32 మంది ఎంఎల్‌ఎలు మాత్రమే మద్దతు తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలంగా 55మంది ఎంఎల్‌ఎలు నిలవడంతో తీర్మానం వీగిపోయింది.
మొత్తం 90మంది సభ్యులుండే హర్యానా అసెంబ్లీలో ప్రస్తుతం 88మంది ఉన్నారు. ఖట్టర్‌కు అనుకూలంగా ఉన్నవారిలో బిజెపికి చెందినవారు 39మంది,జెజెపికి చెందినవారు 10మంది, స్వతంత్రులు 5మంది కాగా, ఒకరు హర్యానా లోక్‌హిత్ పార్టీకి చెందినవారు. కాంగ్రెస్‌కు 30మంది సభ్యుల బలముండగా, మరో ఇద్దరు స్వతంత్రులు కూడా అవిశ్వాస తీర్మానాన్ని సమర్థించారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ నేత హుడా చర్చను ప్రారంభిస్తూ రాష్ట్ర సరిహద్దులో 250మందికిపైగా రైతులు చనిపోయారని,వారి పేర్లు కూడా తాను వెల్లడించానని తెలిపారు.
ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ముఖ్యమంత్రి ఖట్టర్ ప్రయాణించే హెలికాప్టర్‌ను దించేందుకు కూడా ప్రజలు అనుమతించడంలేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారని, వారికి ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వంలోని బిజెపి, జెజెపి నేతలు విస్మరించారని ఆయన మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న రైతులపై ప్రభుత్వం బాష్పవాయువు, నీటి ఫిరంగులను ప్రయోగించి అడ్డుకుంటున్నదని హుడా అన్నారు.