Friday, November 22, 2024

ఇమ్రాన్ యార్కర్!

- Advertisement -
- Advertisement -

Sri Lanka is in an economic crisis

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ఐక్యప్రతిపక్షం, పాలక కూటమిలోని ఒక వర్గం కలిసి సంధించిన అవిశ్వాస తీర్మానం ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. అవిశ్వాస తీర్మానంపై జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జరిగి వుంటే అది నెగ్గి తీరుతుందనే భరోసా ఏర్పడింది. ఎందుకంటే ఇమ్రాన్ సొంత పార్టీ వారితో పాటు పాలక కూటమిలోని ఇతర పార్టీల వారు కూడా కలిసి ఆయనపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందుచేత ఆయన గద్దె దిగిపోడం ఖాయమనుకుంటున్న దశలో జాతీయ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ చేత దానిని తిరస్కరింపజేసి అసెంబ్లీ రద్దుకు ఇమ్రాన్ ఖాన్ సిఫారసు చేశారు. దేశాధ్యక్షుడు వెంటనే దానిని ఆమోదించారు. ప్రతిపక్షం తనపై సంధించిన అస్త్రాన్ని తిప్పిదాని మీదనే ప్రయోగించారు. ఇమ్రాన్ చర్యను ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. కోర్టు సోమవారం నాడే దీనిపై అభిప్రాయాన్ని ప్రకటిస్తుందనుకున్న అంచనాలు తారుమారయ్యాయి.అది ప్రతిపక్షాల పిటిషన్‌పై మంగళవారం నాడు విచారణ చేపడతానని ప్రకటించింది. ప్రతిపక్షం అత్యున్నత ప్రజాప్రాతినిధ్య వేదిక అయిన జాతీయ అసెంబ్లీని ఉపయోగించుకొని ఇమ్రాన్‌ను దించాలని ప్రయత్నించగా ఆయన తనకు కరతలామలకమైన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శించి దానిపై యార్కర్‌ను ప్రయోగించారు. సుప్రీంకోర్టు ఈ చర్యను తప్పుపడితే తప్ప పాక్‌లో ఎన్నికలు జరగడం, కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు నేరుగా ఎన్నుకోడం తప్పనిసరి పరిణామాలుగా కనిపిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గినా, జాతీయ అసెంబ్లీ రద్దయినా ఇమ్రాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకోడం ఖాయమే. అయితే ఇమ్రాన్ తాను కోరుకున్న పద్ధతిలో దిగిపోతున్నారనుకోవాలి. ఇమ్రాన్ ప్రధాని పదవిలో మూడేళ్ల 228 రోజులే కొనసాగారు. పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు ఏ ప్రధానీ ఐదేళ్ల పూర్తి కాలం కొనసాగలేకపోయారన్న చేదు వాస్తవమే. అక్కడి ప్రజాస్వామ్యం ఎంత బలహీనమైనదో చాటుతున్నది. ఇందుకు కారణం పాక్ సైన్యమే. గూఢచార విభాగం ఐఎస్‌ఐ సహా ప్రభుత్వంలోని వారి ఆయువు పట్లన్నీ అక్కడ సైన్యం చేతిలోనే వుంటాయి. 2018లో ఇమ్రాన్ ఖాన్‌ను స్వయంగా గద్దె ఎక్కించిన పాక్ సైన్యం ఇప్పుడు ఆయన తీరు పట్ల అసంతృప్తిగా వున్నదని, అవిశ్వాస తీర్మానం వెనుక వున్నది సైన్యం హస్తమేనని భావిస్తున్నారు. అయితే అక్కడి ప్రస్తుత రాజకీయ పరిణామాలతో తనకేమీ సంబంధం లేదని సైన్యం బహిరంగంగా చెప్పుకున్నది.దీనిని విశ్వసించలేము. ప్రజల ఓటు హక్కు ద్వారా దేశాన్ని పాలించే ప్రభుత్వాన్ని, దాని అధినేతను ఎన్నుకునే పద్ధతిని పాకిస్తాన్ నెలకొల్పుకున్నప్పటికీ సైన్యం పెత్తనం వల్ల అది పడగ నీడ ప్రజాస్వామ్యంగానే కొనసాగుతున్నది. ఇది తెలిసి కూడా ఇమ్రాన్ ఖాన్ దానితో ఎందుకు చెలగాటానికి దిగాడో తెలియవలసి వుంది. అవిశ్వాస తీర్మానం వైపు ప్రతిపక్షాల కదలికలు మొదలైన వెంటనే దాని వెనుక విదేశీ హస్తం వుందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. పాకిస్తాన్ విదేశాంగ విధానాన్ని తాను రష్యా, చైనాల వైపు పూర్తిగా తిప్పబోయినప్పుడు అమెరికా రంగప్రవేశం చేసి సైన్యం ద్వారా తనకు అడ్డు చక్రం వేసిందని ఇమ్రాన్ ఖాన్ భావిస్తున్నారు. అమెరికా చిరకాలంగా పాకిస్తాన్‌ను ఒక దుష్టశక్తిగా తయారు చేసి పోషిస్తూ వచ్చింది. విపరీతంగా ఆయుధాలను, ఆర్థిక మద్దతును ఇచ్చింది. అయినా పాక్ ప్రజల స్థితిగతుల్లో మంచి మార్పు రాలేదు. ఇమ్రాన్ ఖాన్ కూడా ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యాడనే ఆరోపణను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ రద్దయి ఎన్నికలకు తెర లేచినందున ఇమ్రాన్ ఖాన్ అధికారాన్ని ఆపద్ధర్మ ప్రధానికి అప్పగించవలసి వుంది.మాజీ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్‌ను అందుకు ఇమ్రాన్ సూచించారు. వాస్తవానికి అసెంబ్లీ రద్దు తర్వాత ఎన్నికలు ముగిసే వరకు తాత్కాలిక ప్రధానిగా ఇమ్రాన్ కొనసాగే అవకాశముంది. కాని ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు వుండదు. అందుచేత ఆపద్ధర్మ ప్రధాని నియామకానికే ఆయన మొగ్గు చూపారు. ఆపద్ధర్మ ప్రధానిని నియమించే అంతిమ అధికారం దేశాధ్యక్షుడికి వుంటుంది. చివరికి ఏమైనప్పటికీ పాకిస్తాన్ మరో అనిశ్చితిలోకి జారుకోడం ఆందోళన కలిగించే అంశం. నిత్యం భారత వ్యతిరేకత మీద ఆధారపడి అక్కడి ప్రభుత్వాలు నడుస్తూ వుంటాయి. అందుకు అనుగుణంగా భారత వ్యతిరేక ఉగ్రవాదులకు అక్కడ ఆశ్రయం లభిస్తూ వుంటుంది. తాలిబన్లను తయారు చేసి అఫ్ఘానిస్తాన్ మీదికి పంపి వారు అక్కడ అధికారంలో నిలదొక్కుకునేలా చేయడంలో పాక్ సైన్యం, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పాత్ర వున్నట్టు రుజువైంది. దీనితో ఇమ్రాన్‌కు అమెరికాతో సంబంధాలు తెగిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ దేశాన్ని సరిగ్గా పాలించలేకపోగా, విదేశాంగ విధానంతో ఇష్టావిలాసంగా ఆడుకున్నాడనే ఆరోపణకు గురయ్యారు. ఎన్నికలే జరిగితే పాక్ ప్రజలు ఎవరి వైపు మొగ్గుతారో, ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాలి. సుప్రీంకోర్టు ఈ విషయంలో సత్వర నిర్ణయం ప్రకటిస్తే దాని ప్రభావం ఎలా వుంటుందోననేది ఆసక్తికరం.

No Confidence motion against Imran Khan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News